అమెరికాలో భయం భయం.. డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రూల్.. భారత విద్యార్ధులపై ప్రభావం.?
అమెరికాలో మన స్టూడెంట్స్...చదువుపై ఫోకస్ పెట్టడంలేదు. ఉదయం లేస్తే ట్రంపు ఇంకేదైనా తిక్కరూల్ పెడతాడోమోనన్న టెన్షన్ మనోళ్లకు పట్టుకుంది. ఒకటా రెండా...ఇంట్లో ఉంటే భయం..బయట అడుగుపెడితే భయం..యూనివర్సిటీలో సైలెంట్‌గా చదువుకుందామన్నా భయం. కారు తోలితే భయం...మాట మాట్లాడితే భయం..సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే భయం..ఇలా ప్రతి క్షణం భయంతో గడుపుతున్నారు మన స్టూడెంట్స్. ఇంతకూ ట్రంప్ కొత్తరూల్..మన విద్యార్ధులను కొత్త టెన్షన్‌లోకి నెట్టిందా...?

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ టార్గెట్‌గా మరో కొత్త ఒప్పందం ట్రంప్ సర్కార్ తెరపైకి తెచ్చింది. కొన్ని యూనివర్శిటీలు యు.ఎస్. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ICEతో 287(g) కింద కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, దీని ద్వారా స్థానిక పోలీసు శాఖలు ఇమిగ్రేషన్ చట్టాల అమలులో ఫెడరల్ అధికారులతో కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పందాల ప్రకారం, విశ్వవిద్యాలయ పోలీసులు అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించి, వారి ఇమిగ్రేషన్ స్థితిని ధృవీకరించే అధికారం కలిగి ఉంటారు. అవసరమనుకుంటే విచారించే రైట్స్ పోలీసులకు ఉంటుంది. అయితే, ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేసే ప్రాథమిక బాధ్యత ఫెడరల్ ఏజెన్సీలది. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది అమెరికాలో.
ఈ ఒప్పందాలు 1996లో అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ నేషనలిటీ యాక్ట్‌లోని సెక్షన్ 287(g) కింద రూపొందించబడ్డాయి. ఈడీల్ వల్ల స్థానిక, రాష్ట్ర పోలీసు శాఖలకు ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేసేందుకు ICEతో కలిసి పనిచేస్తాయి. దీనిద్వారా స్థానిక అధికారులు నిర్దిష్ట శిక్షణ పొంది, అక్రమ వలసదారులను గుర్తించడం, అరెస్టు చేయడం, నిర్బంధించడం వంటి విధులను నిర్వహిస్తారు. 2025లో, ఫ్లోరిడా రాష్ట్రాల్లోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఈమేరకు ఐసీఈతో డీల్ కుదుర్చుకున్నాయి.
ఈడీల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా..ఇది ఫెడరల్ చట్టం కింద రూపొందించబడ్డాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. స్థానిక అధికారులు ఫెడరల్ మార్గదర్శకాలను అనుసరిస్తూ, ICE పర్యవేక్షణలో పనిచేస్తారని… దీనివల్ల అక్రమ వలసలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. కానీ ఇమిగ్రేషన్ అమలు ఫెడరల్ అధికార పరిధిలో ఉండాలని, స్థానిక పోలీసులకు అధికారం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వ్యతిరేకులు వాదిస్తారు. స్థానిక అధికారులకు తగిన శిక్షణ లేకపోతే అది వివక్షకు దారి తేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ..ACLU ఈ ఒప్పందాలు రాజ్యాంగంలోని నాలుగో సవరణను ఉల్లంఘించవచ్చని వాదిస్తోంది.
గతంలో, 287(g) ఒప్పందాలపై న్యాయస్థానాల్లో సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని కేసుల్లో, స్థానిక అధికారులు జాతి ఆధారంగా వివక్ష చూపారనే ఆరోపణలతో ఈ ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేశారు. 2025లో, విదేశీ విద్యార్థులు తమ వీసాల రద్దుపై స్టాన్‌ఫోర్డ్. హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించారు, ఇది ఈ ఒప్పందాల చట్టబద్ధతపై మరింత చర్చ జరిగేలా చేసింది. మళ్లీ ఇప్పుడు మరోసారి ఈఒప్పందాలు వెలుగులోకి రావడంతో ఇండియన్ స్టూడెంట్స్‌లో ఆందోళన ఎక్కువైంది.
విశ్వవిద్యాలయాలు ICEతో ఒప్పందాలు కుదుర్చుకోవడం అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా ఇండియా, చైనా, లాటిన్ అమెరికా దేశాల నుండి వచ్చిన వారిపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. క్యాంపస్‌లో పోలీసులు అనవసరంగా విద్యార్ధులను ఇబ్బంది పెట్టే వకాశం ఉందని..ఇలాంటి ఒప్పందాలు ఏమాత్రం ఆరోగ్యకరమైనవి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దీనిపై ఆందోళన చేయాలన్నా విద్యార్ధులకు వీసారద్దు భయం పట్టుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా తమపై ఇమిగ్రేషన్ ఫోకస్ పెడుతుందన్న భయంతో చాలామంది విద్యార్ధులు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. గతంలో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన నిరసనలలో పాల్గొన్న విద్యార్థులను అమెరికా బహిష్కరించింది. అయితే ఈఒప్పందాలకు వ్యతిరేకంగా కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే, ఒప్పందాలలో పాల్గొన్న సంస్థలు తమ నిర్ణయాన్ని రాష్ట్ర ఆదేశాలకు అనుగుణంగా సమర్థిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు విద్య,పరిశోధనలపై దృష్టి పెట్టాలి కానీ..ఇమిగ్రేషన్ అమలులో పాల్గొనడం ఏంటన్న వాదనలూ విద్యావేత్తల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే విదేశీ విద్యార్ధులపై పూటకో ఆంక్షతో ట్రంప్ సర్కార్ కొరడా ఝలపిస్తోంది. ఇప్పుడు 287(g)లాంటి చట్టాలను తెరపైకి తీసుకొచ్చి…ఫారిన్ స్టూడెంట్స్‌ను మరింత ఇబ్బంది పెట్టాలని ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది.