UKRAINE CONFLICT: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో త్వరలో కీలక పరిణామాలు.. మే మొదటి పక్షంలోనే పుతిన్ ముహూర్తం.. వ్యూహాలకు పుతిన్, బైడెన్ పదును

పుతిన్ కంటే పట్రుషేవ్ మరింత దూకుడు స్వభావి అని కూడా సమాచారం. ఇదే జరిగితే రష్యన్ దళాల దూకుడు మరింతగా ముదురుతుందని అంటున్నారు. అసలే ఉక్రెయిన్‌పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. వారిని ఉక్రెయిన్ దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ప్రధాన నగరాలే టార్గెట్‌గా రష్యన్ క్షిపణుల వర్షం కురుస్తోంది.

UKRAINE CONFLICT: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో త్వరలో కీలక పరిణామాలు.. మే మొదటి పక్షంలోనే పుతిన్ ముహూర్తం.. వ్యూహాలకు పుతిన్, బైడెన్ పదును
Biden Putin War
Follow us
Rajesh Sharma

| Edited By: Sanjay Kasula

Updated on: May 03, 2022 | 8:50 PM

UKRAINE CONFLICT TO TURN INTO CRUCIAL MODE BIDEN PUTIN STRATEGIES:  రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో కీలక పరిణామాలు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవైపు రష్యా దూకుడును పెంచిందంటూ కథనాలొస్తుండగా.. మరోవైపు పుతిన్ ఆరోగ్యంపై కూడా చాలా వార్తలొస్తున్నాయి. ఆయనకు క్యాన్సర్ సోకిందని, ఆ చికిత్స కోసం ఆయన కొన్ని రోజులు అధ్యక్ష బాధ్యతలను తన అనుంగు సహచరుడు నికోలాయ్ పట్రుషేవ్‌కు అప్పగిస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. పుతిన్ కంటే పట్రుషేవ్ మరింత దూకుడు స్వభావి అని కూడా సమాచారం. ఇదే జరిగితే రష్యన్ దళాల దూకుడు మరింతగా ముదురుతుందని అంటున్నారు. అసలే ఉక్రెయిన్‌పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. వారిని ఉక్రెయిన్ దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ప్రధాన నగరాలే టార్గెట్‌గా రష్యన్ క్షిపణుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే అనేక మంది ఉక్రేనియన్లు దేశం విడిచి పారిపోయిన పరిస్థితి. దాదాపు 55 లక్షల మంది శరాణార్థులుగా మారారని అంచనా. మారియుపోల్‌ నగరం రష్యా సేనల వశం అయింది. ఇక ఖెర్సాన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఒడెస్సా పోర్ట్ సిటీపై బాంబుల వర్షం కురుస్తోంది. తాజాగా ఒడెస్సా ఎయిర్ పోర్టుపై రష్యా దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరో కీలక అడుగు వేసేందుకు పావులు కదుపుతున్నారు. తన ఉక్కు పిడికిలిలో బంధించిన ప్రాంతాలను రష్యాలో శాశ్వత భాగాలుగా మార్చేసేందుకు యత్నాలు చేస్తున్నట్లు పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఉక్రెయిన్‌ తూర్పుభాగంపై తన పట్టును బిగించేందుకే ఈ ప్రయత్నాలని అమెరికన్ ఇంటెలిజెన్స్‌ హెచ్చరించింది. ఖెర్సాన్‌ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ రష్యా తన ప్రయత్నాలను ఆపడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఇంటలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 2014లో క్రిమియాను ఆక్రమించుకొన్న తర్వాత కూడా రష్యా ఇదే వ్యూహాన్ని అనుసరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇదిలా వుండగా.. రష్యా ఆక్రమించుకున్న ఏరియాల్లో ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో రష్యన్ భాష మాట్లాడే వారు అధికంగా వుండడంతో రష్యాకు అనుకూలంగా ప్లెబిసైట్ ఫలితం తేలే అవకాశం వుందని, తద్వారా వాటిని రష్యాలో కలిపేసుకోవడమో.. లేక తమకు అనుకూలంగా వుండే వారితో అక్కడ పాలకులను ఎంపిక చేయడమో రష్యన్ వ్యూహం కావచ్చని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రష్యా నిర్వహించనున్న ప్లెబిసైట్ డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ లేదా ఖెర్సాన్‌ ప్రాంతాల్లో జరిగే అవకాశం వుంది. డాన్ బాస్ ఏరియాలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. ఉక్రెయిన్‌ను వీడి రష్యాతో కలిసేందుకు అక్కడి ప్రజల మద్దతు ఉందని చెప్పేందుకే ఈ చర్య చేపట్టనుంది. దీంతోపాటు తనకు నమ్మకమైన వ్యక్తులను అక్కడి పాలకులుగా పుతిన్‌ నియమించే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి ఈ ఓటింగ్‌ అనేది ఓ ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం విలీనం చేసుకొన్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి వ్యూహాలను రష్యా అనుసరించడం కొత్తేమీ కాదని అమెరికా చెబుతోంది. 2014లో క్రిమియాను ఆక్రమించుకున్నప్పటి నుంచి రష్యా వ్యూహం ఇదే ధోరణిలో కొనసాగుతోంది. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో కనుక రెఫరెండం నిర్వహిస్తే చర్చలకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్లేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవలే హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభమవడానికి అంటే ఫిబ్రవరి 24కు రెండు రోజుల ముందు డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలను కీవ్‌ నుంచి విడిపోయిన స్వతంత్ర భాగాలుగా మాస్కో గుర్తించింది. ఆ తర్వాత అక్కడ శాంతి నెలకొల్పేందుకంటూ పీస్‌ కీపింగ్‌ దళాలను పంపింది. దానికి స్పెషల్ మిలిటరీ యాక్షన్‌గా నామకరణం చేసింది. మరో పక్క ఖెర్సాన్‌ పట్టణాన్ని ఆక్రమించిన తర్వాత రష్యా అక్కడ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి యత్నాలు చేసింది. ఖార్కీవ్ సిటీని తొలుత ధ్వంసం చేసింది. గత నెలా పదిహేను రోజులుగా మారియుపోల్ సిటీని రణక్షేత్రంగా మార్చింది. దాంతో సిటీ మొత్తం విధ్వంసానికి గురైంది. ఉక్రెయిన్‌ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ దేశపు కరెన్సీని నిలిపిసి.. రష్యన్ రూబుల్స్‌ చలామణి చేయడానికి యత్నాలు మొదలుపెట్టింది. రెఫరెండం వంటి చర్యలను యూరోపియన్ దేశాలు యుద్ధానికి ముగింపుగా భావించి సహిస్తాయని పుతిన్‌ అంచనా వేస్తున్నట్లు ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌ సభ్యుడు డెనియల్‌ ఫ్రెడ్‌ అభిప్రాయపడ్డారు.అయితే బుచాలో నరమేధం వంటివి చూశాక పుతిన్‌ ఆక్రమణను పశ్చిమదేశాలు అంగీకరించవని పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి కీవ్‌ సహా కీలక నగరాలపై రష్యా దళాలు తీవ్రమైన దాడులు చేశాయి. కొన్ని నగరాలను ఆక్రమించాయి. కానీ, ఆతర్వాత వాటిని నిలబెట్టుకోకుండా వదిలేసి వెళ్లిపోయాయి. తాజాగా రష్యా దళాలు ఇజ్యూమ్‌ పట్టణంపై దాడులు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్‌పై దాడికి వచ్చిన దళాల్లో నాలుగో వంతు ఇప్పటికే దెబ్బతిన్నాయని బ్రిటిష్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దెబ్బతిన్న దళాలను తిరిగి నిర్మించుకోవాలంటే రష్యాకు రెండు దశాబ్దాలు పట్టొచ్చని పలు యూరోపియన్ దేశాలు అంచనా వేస్తున్నాయి. అయితే పునర్నిర్మాణానికి ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సహకరిస్తామని అమెరికాతోపాటు పలు యూరోపియన్ దేశాలు చెబుతున్నాయి. ఇంకో పక్క పశ్చిమ దేశాల ఆయుధ ప్రవాహం ఉక్రెయిన్‌లో పెరిగిపోతోంది. మరోపక్క లాజిస్టిక్స్‌, ఇతర వైఫల్యాలతో రష్యా దళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మే9వ తేదీన రష్యాన్ విక్టరీ డే నాటికి పుతిన్‌ మరిన్ని విజయాలు నమోదు చేయాలి లేదా ఆ రోజే యుద్దానికి ముగింపు ప్రకటన చేయాలి. ఈస్ట్ ఉక్రెయిన్‌ను రష్యాలో విలీనం చేసుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్‌కు అమెరికా సహా పలు దేశాల ఆయుధ సరఫరా ఊపందుకుంది. తమ దగ్గరున్న పరిమిత ఆయుధ సంపత్తితోనే ఉక్రెయిన్ సైన్యం రష్యన్ దళాలకు చుక్కలు చూపించింది. ఆ తర్వాత అమెరికా పంపిన యాంటి ట్యాంకర్ మిస్సైళ్ళతో రష్యాను తోక ముడిచేలా చేసింది. అమెరికా ఇటీవల ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల సాయంలో భాగంగా ఎం777 శతఘ్నులను ఉక్రెయిన్‌కు అందజేస్తోంది. కెనడా కూడా ఆయుధ సాయం అందిస్తోంది. వీటిని యుద్ధక్షేత్రాలకు హెలికాప్టర్లు లేదా వాహనాలకు అమర్చి లాక్కొని వెళ్లవచ్చంటున్నారు. ఇప్పటికే అమెరికా చెప్పిన వాటిలో సగానికిపైగా డెలివరీ చేసినట్లు పెంటగాన్‌ ప్రకటించింది. అమెరికా అత్యాధునిక గైడెడ్‌ షెల్స్‌ను కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఇవి జీపీఎస్‌ ఆధారంగా నిర్దేశిత లక్ష్యాన్ని నాలుగు మీటర్లు అటు ఇటుగా ఛేదిస్తాయి. శతఘ్నుల దాడికి ముందు డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్‌ కచ్చితమైన లక్ష్యాలను గుర్తిస్తోంది. దీనికి తోడు స్థానికులు, పోరాటంలో ఉన్న దళాలు ఇచ్చే ఇన్ఫర్మేషన్‌తో కచ్చితమైన రష్యా లక్ష్యాలపై దాడులు చేస్తోంది. దాదాపు 1700 రష్యా యుద్ద వాహనాలను ఉక్రెయిన్‌ ట్యాంకర్లు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు దేశాల పర్యటనలో వున్న మోదీ.. ఈ యుద్దంలో విజేతలెవరు వుండరని అన్నారు. మే మూడో తేదీన డెన్మార్క్‌లో మాట్లాడిన మోదీ.. రష్యా తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు. మరోవైపు కీవ్ సిటీలో పర్యటించేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఉక్రెయిన్‌లో పర్యటించారు. నిజానికి గత నెలలోనే బైడెన్ ఉక్రెయిన్‌కు రావాల్సి వుంది. కానీ పోలండ్ పర్యటనకే ఆయన పరిమితమయ్యారు. కానీ ఉక్రెయిన్ సరిహద్దు దాకా బైడెన్ వెళ్ళారు. ఆ దేశానికి సంఘీభావం ప్రకటించడంతోపాటు ఉక్రెయిన్ బలగాలకు మనోధైర్యం కల్పించేందుకు అప్పట్లో బైడెన్ యత్నించారు.  ప్రస్తుతం ఉక్రెయిన్ దేశ పునరుద్ధరణకు అమెరికా కట్టుబడి వుందని చాటేందుకు బైడెన్ ఆ దేశ పర్యటనకు సిద్దమవుతున్నారు. ఆర్థిక, ఆయుధ సహాయం కొనసాగుతుందని పదే పదే చాటుతున్నారు. ఓవైపు పుతిన్ ఆరోగ్య పరిస్థితి.. ఇంకోవైపు ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సరఫరా.. ఇలా ఈ యుద్ధంలో మే నెల మొదటి పక్షంలో కీలక పరిణామాలు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?