HMPV Virus: డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. అప్రమత్తమైన భారత్.. వైరస్ లక్షణాలివే..
చైనా పేరు వార్తల్లో వినిపిస్తే చాలు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. కారణం మరో ప్రమాదకర వైరస్.. అవును.. చైనాలో మరో వైరస్ మానవకోటిపై దాడి చేస్తుంది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌పై ఇండియన్ గవర్నమెంట్ అలర్ట్ అయింది. మరి వైరస్ మన దగ్గరకు కూడా వస్తుందా..? కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి..?
చైనా పేరు వార్తల్లో వినిపిస్తే చాలు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. కారణం మరో ప్రమాదకర వైరస్.. అవును.. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కొత్తగా పుట్టుకొచ్చిన హ్యుమన్‌మోటాన్యూమో వైరస్‌తో చైనా ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తోన్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. చైనాలో కొత్త వైరస్ విషయంపై అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్‌ఎస్ స్పందించింది. ప్రస్తుతం హ్యూమన్ మెటానిమోవైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీజీహెచ్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వైరస్ లక్షణాలివే..
ఈ HMPV వైరస్ సోకినవారిలో కొవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తాయి. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి.
వైరస్ తీవ్రమైతే న్యుమోనియా లాంటి సమస్యలకు దారితీస్తుంది.
మూడు లేదా ఆరురోజుల వరకూ లక్షణాలు ఉంటాయి.
ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయి.
కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ ఈజీగా సోకుతుంది.
చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..