ఓ వైపు కరుగుతోన్న మంచు.. మరోవైపు వాతావరణ మార్పులు.. ప్రశ్నార్థకంగా మానవాళి మనుగడ..
వాతావరణ మార్పులు భూగోళాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. కరుగుతున్న మంచు మానవాళితో పాటు ఇతర ప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంలో పడేస్తోంది.
భూగోళం మీద లక్షలాది సంవత్సరాలుగా మంచుతో కూరుకున్న ప్రాంతాల్లో ఇప్పుడు పెను వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్న ఈ ప్రమాకర పరిస్థితులు ప్రపంచ చిత్రపటాన్నే మార్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర ధృవ ప్రాంతాల్లో కరుగుతున్న మంచు కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతూ అనేక దేశాల తీరాలను దెబ్బతీస్తున్నాయి. స్విట్జర్లాండ్ అనగానే మనకు మంచు పర్వతాలు గుర్తుకు వస్తాయి. అక్కడ రోమన్ చక్రవర్తుల కాలం నాటి ఒక పురాతన దారి బయపడింది. ఇంత కాలం ఇది పూర్తిగా గడ్డకట్టిన హిమానీ నదాలల్లో కూరుకుపోయింది.
స్విట్జర్లాండ్‌లో వేడి గాలుల ప్రభావం పెరగడంతో స్సెక్స్ రూజ్, ట్సాన్ ఫ్లూరాన్ హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. మందపాటి పొరలు పూర్తిగా తొలగిపోవడంతో రోమన్‌ల కాలం నాటి బేర్ రాక్ రూట్ స్పష్టంగా కనిపిస్తోంది. మంచు ప్రాంతాలు ఇలాగే కరిగిపోతే స్విట్జర్లాండ్‌లో ప్రమాదకర ఏర్పాటు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు కెనడాలో వాతావరణ మార్పులు ధృవపు ఎలుగుబంట్ల మనుగడను ప్రమాదంలోకి నెడుతోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో వేసవి కాలంతో సంబంధం లేకుండా మంచు వేగంగా కరిగిపోతోంది. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే ధృవపు ఎలుగుబంట్లు ఎక్కడికి వెళ్లాలో తెలియక జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. సహజసిద్ద వాతావరణాన్ని కోల్పోవడంతో ఈ ఎలుగుబంట్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.