అమ్మతనానికే మాయని మచ్చ.. 10 నెలల బిడ్డకు నరకం చూపిన తల్లి.. వామ్మో 600ల సార్లు..
తల్లిని మించిన దైవం లేదంటారు. కానీ బిడ్డ పాలిట ఆ తల్లే కాలయముడైంది. మాటలు కూడా రాని 10 నెలల పసిపాప ఏడుస్తున్నాడని లాలించాల్సింది పోయి సూదులతో పొడిచి వికృతానందం పొందింది. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా 600 సార్లు ఆ చిన్ని ప్రాణాన్ని సూదులతో జల్లెడలా మార్చేసింది. చైనాలో వెలుగుచూసిన ఈ అమానుష ఘటన వింటే రక్తం మరిగిపోవాల్సిందే.

కన్నతల్లి ప్రేమకు మించినది ఈ లోకంలో ఏది లేదంటారు. కానీ చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఒక ఘటన ఈ మాటను అబద్ధం చేస్తోంది. కేవలం 10 నెలల వయసున్న తన బిడ్డ ఏడుస్తున్నాడని, జ్వరంతో మారాం చేస్తున్నాడని ఒక తల్లి చేసిన పని వింటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఆ బిడ్డ శరీరాన్ని ఏకంగా 600 సార్లు సూదులతో పొడిచి తన పైశాచికత్వాన్ని చాటుకుంది. నైరుతి చైనాకు చెందిన దావో అనే మహిళ తన 10 నెలల కుమారుడికి జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించింది. అయితే ఆ బిడ్డ మెడ భాగంలో విపరీతమైన వాపు ఉండటాన్ని గమనించిన డాక్టర్ సుయ్ వెన్యువాన్ ఎక్స్-రే తీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బిడ్డ మెడలో, వెన్నెముక దగ్గర బూట్లు కుట్టడానికి ఉపయోగించే పెద్ద సూది ఒకటి విరిగి ఇరుక్కుపోయి ఉంది.
వైద్యుల నిర్ధారణతో విస్తుపోయిన అధికారులు
వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి ఆ సూదిని బయటకు తీసిన వైద్యులు, బిడ్డ శరీరాన్ని పరిశీలించి విస్తుపోయారు. ఆ చిన్నారి శరీరంపై దాదాపు 500 నుండి 600 సార్లు సూదులతో గుచ్చిన గాయాలు ఉన్నాయి. దీనిపై విచారణ చేయగా బిడ్డకు జ్వరం వచ్చినప్పుడు లేదా ఏడ్చినప్పుడు అతన్ని ‘శిక్షించడానికి’ మరియు ఒక రకమైన వింతైన ఇంటి నివారణ పద్ధతిలో తాను సూదులతో పొడిచానని ఆ తల్లి ఒప్పుకుంది. ఆ సూదులపై తుప్పు పట్టడం వల్లే బిడ్డకు తీవ్రమైన జ్వరం వచ్చిందని ఆపరేషన్ తర్వాత ప్రస్తుతం పసికందు కోలుకుంటున్నాడని డాక్టర్ తెలిపారు.
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం
ఈ ఘటన ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ తల్లిపై నిప్పులు చెరుగుతున్నారు. ‘‘ఇంత క్రూరమైన మహిళను తల్లి అనలేం. ఆ బిడ్డ తప్పు కుటుంబంలో పుట్టాడు, దయచేసి అతన్ని ఆ తల్లి దగ్గర ఉంచకండి’’ అంటూ వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ ఘటనను అత్యంత భయంకరమైన చైల్డ్ అబ్యూజ్‌గా అభివర్ణిస్తున్నారు.




