AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా కీలక ప్రకటన.. గస్తీపై డ్రాగన్ ఏమందంటే?

భారత్‌–చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతల అంశం తెరపైకి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత, చైనా భద్రతా బలగాల మధ్య పలుచోట్ల ఎదురెదురుపడిన ఘటనలు కొనసాగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చైనా స్పందించింది. సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనికులు సాధారణ గస్తీ విధులు నిర్వహిస్తున్నారని, ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అవగాహనలకు కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ సోమవారం స్పష్టం చేశారు.

భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా కీలక ప్రకటన.. గస్తీపై డ్రాగన్ ఏమందంటే?
India China Border Tensions
Balaraju Goud
|

Updated on: Oct 26, 2026 | 5:51 PM

Share

భారత్‌–చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతల అంశం తెరపైకి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత, చైనా భద్రతా బలగాల మధ్య పలుచోట్ల ఎదురెదురుపడిన ఘటనలు కొనసాగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చైనా స్పందించింది. సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనికులు సాధారణ గస్తీ విధులు నిర్వహిస్తున్నారని, ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అవగాహనలకు కట్టుబడి ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ సోమవారం స్పష్టం చేశారు.

చైనా ఏమంది?

సరిహద్దు ప్రాంతాల్లో ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని, స్థిరత్వాన్ని కాపాడేందుకు చైనా క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తోందని గ్వో తెలిపారు. భారత్‌తో కుదిరిన సంబంధిత ఒప్పందాలు, ముఖ్యమైన అవగాహనలను తమ దేశం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు భారత్ కూడా పరస్పర అవగాహనలను గౌరవిస్తూ, చైనాతో కలిసి పనిచేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్ ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో భారత, చైనా బలగాలు పలుచోట్ల ఎదురెదురుపడిన ఘటనల గురించి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఐటీబీపీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, బలగాల సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

దీనిపై అక్టోబర్ 23న భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. చైనా సైనికులు నిర్దేశిత గస్తీ విధానాలకు భిన్నంగా వ్యవహరించినప్పుడు సరిహద్దు పరిస్థితి అప్పుడప్పుడు ఉద్రిక్తంగా మారుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. వివాదాలను పరిష్కరించేందుకు, అపార్థాలు తలెత్తకుండా నివారించేందుకు ఇరు దేశాలు దౌత్య, సైనిక మార్గాలను వినియోగిస్తున్నాయని తెలిపారు.

శాంతి చర్చలే కీలకం!

భారత్‌, చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి ఇరు దేశాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. గస్తీ విధానాలు, వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి పరిస్థితులపై స్పష్టత పెరగడం, పరస్పర అవగాహనలను పాటించడం కీలకంగా మారాయి. సరిహద్దులో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే రెండు దేశాల మధ్య విస్తృత సంబంధాలు మెరుగుపడతాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో దౌత్య, సైనిక సంప్రదింపులు ఏ దిశగా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us