AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPT ఇచ్చిన సలహా.. ప్రయోగం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలుసా?

ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చిన తర్వాత ప్రతి చిన్న సమస్యకు జనాలు ఏఐ సలహాలను తీసుకోవడం స్టార్ట్‌ చేశారు. కొందరైతే ఏకంగా దాని నుంచి వైద్య సలహాలు, డైట్స్‌ తీసుకొని ఫాలో అవుతున్నారు. కానీ ఇదే వాళ్లను కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడేలా చేస్తుంది. అమెరికాలో తాజాగా జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇంతకు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా.. అయితే తెలుసుకుందాం పదండి.

ChatGPT ఇచ్చిన సలహా.. ప్రయోగం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వ్యక్తి.. ఏం చేశాడో తెలుసా?
Anand T
|

Updated on: Aug 10, 2025 | 6:44 PM

Share

ప్రముఖ ఏఐ చాట్‌బోట్‌ చాట్‌జీపీటీ ఇచ్చిన ఒక సలహాను పాటించిన ఓ వ్యక్తి, ఏకంగా ప్రాణాలమీదకే తెచ్చుకున్నాడు. అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ క్లినికల్ కేసెస్’ అనే జర్నల్‌లో వచ్చిన నివేదిక ప్రకారం.. ఆమెరికాకు చెందిన 60 ఏళ్ల వయస్సున్న ఒక ఓ వ్యక్తి తన ఆహారంలో ఉప్పుకు బదులుగా వాడేందుకు సురక్షితమైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని చాట్‌జీపీటీని సలహా అడిగాడు. అతని ప్రశ్నలకు చాట్‌జీపిలి సలహా ఇస్తూ సోడియం బ్రోమైడ్‌ను వాడమని సూచించింది. అయితే దీన్ని వాడితే వచ్చే ప్రమాదాలను మాత్రం చాట్‌జీపిటి అతినికి వివరించలేదు. దీంతో ఇది మంచిదేనని గ్రహించిన అతను ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్‌ వాడడం స్టార్ట్‌ చేశాడు.

అయితే దాదాపు మూడు నెలల పాటు దీన్ని వాడిన తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. ఎవరో తనపై విష ప్రయోగం చేస్తున్నట్టు భావించి అతడు వెంటనే హాస్పిటల్‌లో చేరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతనితో దాహం వేస్తున్నా నీళ్లు తాగకపోవడం, ఎవరో తనను ఏదో చేస్తున్నట్టు అభిప్రాయపడడం, తీవ్రమైన ఆందోళనలకు గురికావడం వంటి లక్షణాలను గుర్తించారు. దీంతో అతనిపై బ్రోమైడ్ విషప్రయోగం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతే కాకుండా అతను నాడీ సంబంధిత లక్షణాలు, మొటిమల వంటి చర్మ విస్ఫోటనాలు, ఎర్రటి మచ్చల వంటి బ్రోమైడ్‌ లక్షనాలను కూడా వైద్యులు అతనిలో గుర్తించారు. దీంతో అతన్ని ప్రత్యేక వార్డుకు తరలించి కొన్ని రోజులు పాటు చికిత్స అందించారు. ఆ తర్వాత అతను కాస్త మామూలు స్థితికి వచ్చాడు.

అయితే అంతా ఒకే ఇక డిశ్చార్జ్‌ చేద్దామనుకునే సమయంలో జరిగిన విషయాన్ని అతను వైద్యులకు తెలిపాడు. ఏఐ సలహాతో ఉప్పుకు బదులుగా బ్రోమైడ్‌ను ఆహారంలో తీసుకున్నట్టు చెప్పాడు. దీని వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని వాపోయాడు. అయితే ఏఐను టెస్ట్‌ చేసేందుకు వైద్యులు మరోసారి ఛాట్‌జీపీటిని ఇదే సలహాను అడిగారు. ఏఐ కూడా మళ్లీ సేమ్‌ అదే సమాధాన్ని ఇచ్చింది. ఈ సారి కూడా దాని ప్రమాదాల గురించి ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.

అయితే ఈ బ్రోమైడ్‌ సమ్మేళనాలను గతంలో ఆందోళన, నిద్రలేమి సమస్యలకు ఇచ్చే మందులలో ఉపయోగించేవారు. కానీ వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలుసుకొని వాటి వాడకాన్ని నిషేదించారు. కేవలం పశువులకు ఇచ్చే ఔషదాలలో మాత్రమే ఇప్పుడు వీటిని వాడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.