లాస్ ఏంజెల్స్, అక్టోబర్ 29: అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు, కమేడియన్ మాథ్యూ పెర్రీ (54) అనుమానాస్పద రీతిలో తన ఇంటిలో విగతజీవిగి కనిపించారు. పెర్రీ తన ఇంట్లోని హాట్ టబ్‌లో అసప్మారక స్థితిలో కనిపించారు. అవివాహితుడైన ఫెర్రీ లాస్ ఏంజిలిస్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. తాజాగా ఆయన హాట్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. హాట్ టబ్‌లో నిర్జీవంగా పడిఉన్న మాథ్యూ పెర్రీని చూసిన ఆయన అసిస్టెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. శనివారం సాయంత్రం 4.10 గంటల సమయంలో పెర్రీ మరణం గురించిన సమాచారం అందిందని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. అయితే పెర్రీ మృతి పూల్, స్పా లేదా బాట్‌టబ్, ఫౌంటెన్‌లో మునిగి మరణించినట్లు అధికారులు ధృవీకరించలేదు. పోలీసులు ఫెర్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని లాస్ ఏంజిలిస్ షెరిఫ్ తెలిపారు.
కాగా ఫెర్రీ 1969 ఆగస్టు 19వ తేదీన మస్సాచుసెట్స్‌లోని మిలియమ్స్ టౌన్‌లో జన్మించారు. కెనడాలోని ఒట్టావాలోని రాక్‌క్లిఫ్ పార్క్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. 1994 నుంచి 2004 వరకు వరుసగా 10 సీజన్లు ఫ్రెండ్స్ అనే సెరీస్‌లో చాండ్లర్ బింగ్ పాత్రకు ఫెర్రీకి మంచి గుర్తింపు వచ్చింది. న్యూయార్క్‌లోని ఆరుగురు ప్రముఖుల జీవితాలు, డేటింగ్, కెరీర్ ప్రధానాంశంగా ‘ఫ్రెండ్స్’ సిరీస్ రూపొందించారు. ఈ సిరిసీ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులారిటీ దక్కించుకుంది.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అతని క్లాస్‌మేట్. పెర్రీ తల్లి సుజాన్నె మారిసన్ వృత్తిరీత్యా జర్నలిస్ట్. అప్పటి కెనడా ప్రధాని పియర్రె ట్రుడో వద్ద ప్రెస్ సెక్రెటరీగా పని చేశారు. చదువు పూర్తయిన తరువాత లాస్ ఏంజిలిస్‌లో స్థిరపడిన ఫెర్రీ హాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. టెలివిజన్ సిట్ కామ్ షో ఫ్రెండ్స్ (Friends) అతని దశను మార్చేసింది. అయితే కెరీర్ బాగా పుంజుకుంటున్న సమయంలో ఫెర్రీ మద్యపానం, డ్రగ్స్ వంటి వ్యసనాలను బానిసయ్యాడు. ఆ తర్వాత వాటి నుంచి బయటపడేందుకు వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నాడు. తన దురలవాట్ల కారణంగా ఫెర్రీ 2018లో పెద్ద పేగు సంబంధిత సమస్యతో బాధపడ్డాడు. అనేక సర్జరీల తర్వాత అతని ఆరోగ్యం కుదుటపడింది. బాయ్స్ విల్ బి బాయ్స్, గ్రోయింగ్ పెయిన్స్, సిల్వర్ స్పూన్, ఛార్లెస్ ఇన్ ఛార్జ్, సిడ్నీ, బేవర్లీ హిల్స్ 90210, హోమ్ ఫ్రీ, అల్లీ మెక్‌బీల్, ది వెస్ట్ వింగ్, స్క్రబ్స్, గో ఆన్, ద ఆడ్ కపుల్.. ఇలా పలు సీరియల్స్‌లల్లో నటించారు. తాజాగా ఫెర్రీ మరణవార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నెట్టింట సంతాపం తెలుపుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.