వేషం మార్చి పోలీసుల కళ్లుగప్పాడు..! చివరికి గుట్టు రట్టు చేసిన విగ్గి.. వీడిన 80 హత్యల మిస్టరీ!
బ్రెజిల్‌లో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జోర్లాన్ లోపెస్ డా సిల్వా అరెస్ట్ అయ్యాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మహిళ వేషంలో చిన్నారితో తిరుగుతుండగా పట్టుబడ్డాడు. విచారణలో 80 హత్యలు చేసినట్లు చెప్పినా, పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఇతడు 16 హత్యలతో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్‌లో 33 ఏళ్ల జోర్లాన్ లోపెస్ డా సిల్వా అనే వ్యక్తి భారీ హత్యల కేసుల్లో అనుమానితుడిగా పోలీసులకు చిక్కాడు. అయితే అతడిని పట్టుకున్న తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతను మహిళ వేషం వేసుకుని, రెండేళ్ల చిన్నారిని ఎత్తుకుని తిరుగుతున్న సమయంలో పట్టుబడ్డాడు. విచారణలో తన జీవితంలో సుమారు 80 మందిని హత్య చేసినట్లు అతను చెప్పినప్పటికీ, ఈ సంఖ్యను పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
ఈ ఘటన ఈశాన్య బ్రెజిల్‌లోని పారైబా రాష్ట్రం, ములుంగు ప్రాంతంలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 13న సుమారు 48 గంటల పాటు సాగిన పోలీసుల ఆపరేషన్ అనంతరం జోర్లాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి కోసం పోలీసులు గతంలో కూడా గాలింపు చేపట్టారు. ఒక దశలో వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అతడితో ఉన్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అయితే జోర్లాన్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు.
తప్పించుకునే ప్రయత్నంలో జోర్లాన్ డ్రెస్, విగ్గు, మహిళల చెప్పులు, సన్‌గ్లాసెస్, నెయిల్ పాలిష్ వేసుకున్నాడు. అంతేకాకుండా రెండేళ్ల చిన్నారిని ఎత్తుకుని ఉండటంతో తనను పోలీసులు గుర్తించరని భావించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ చిన్నారికి జోర్లాన్‌తో కుటుంబ సంబంధం లేదని అధికారులు తెలిపారు. చిన్నారి సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. అతడి వద్దకు ఆ చిన్నారి ఎలా వచ్చిందన్న విషయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
మూడు నెలల్లో 16 హత్యలతో లింక్
జోర్లాన్‌ను పోలీసులు ప్రస్తుతం 16 హత్యలతో సంబంధం ఉన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా 2026 మే నెలలో జైలు నుంచి విడుదలైన తర్వాత సుమారు మూడు నెలల వ్యవధిలో జరిగిన హత్యలపై అతడిపై అనుమానాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో అతడి ప్రమేయానికి సంబంధించి పోలీసులకు ఆధారాలు లభించినట్లు అధికారులు చెబుతున్నారు.
విచారణలో తన తొలి హత్యను 13 ఏళ్ల వయసులోనే చేసినట్లు జోర్లాన్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా జీవితకాలంలో సుమారు 80 మందిని హత్య చేసినట్లు అతడు పేర్కొన్నాడు. అయితే ఈ వాదన ప్రస్తుతం అతడి స్వయానా ప్రకటన మాత్రమే. పోలీసులు గత కేసులు, అదృశ్యమైన వ్యక్తుల వివరాలు, లభించిన ఆధారాలను పరిశీలిస్తూ ఆ సంఖ్య నిజమేనా అన్నది నిర్ధారించే పనిలో ఉన్నారు.
జంట హత్య కేసులోనూ దర్యాప్తు
ఆగస్టు 1వ తేదీన రియో టింటో ప్రాంతంలో ఇద్దరు వ్యాపారులను హత్య చేసిన కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కేసులోనూ జోర్లాన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఒక మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని అతడు పోలీసులకు చూపించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
జోర్లాన్‌పై ప్రస్తుతం పలు హత్య కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. అతడు చెప్పిన 80 హత్యల సంఖ్య అధికారికంగా నిర్ధారణ కాలేదు. ప్రతి కేసుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే అతడి అసలు నేర చరిత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, బ్రెజిల్‌లోని పాత పరిష్కారం కాని హత్య కేసులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
