AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చీకటి పడినా ఇంటికి రాని చిన్నారి.. వెతుక్కుంటూ వెళ్లిన తండ్రికి అంగన్వాడీ సెంటర్‌లో..

పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఆ పిల్లల ప్రాణల మీదకు తెస్తుంది. కరీంనగర్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి లోపలే నిద్రిస్తున్న విషయాన్ని పట్టించుకోకుండా సిబ్బంది కేంద్రానికి తాళం వేసి చేతులు దులుపుకున్నారు. చీకటి పడినా బిడ్డ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించారు. అసలేం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: చీకటి పడినా ఇంటికి రాని చిన్నారి.. వెతుక్కుంటూ వెళ్లిన తండ్రికి అంగన్వాడీ సెంటర్‌లో..
3 Year Old Locked Inside Anganwadi Centre
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 17, 2026 | 6:20 PM

Share

అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది ఘోర నిర్లక్ష్యం మూడేళ్ల చిన్నారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. లోపల చిన్నారి నిద్రిస్తున్న విషయాన్ని గమనించకుండానే సిబ్బంది కేంద్రానికి తాళం వేసి వెళ్లిపోయారు. సుమారు నాలుగు గంటల పాటు ఆ పసికందు చీకటి గదిలోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఇస్లాంపూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన లత, ఆరీఫ్ దంపతుల మూడో కూతురు అమ్రిన్ స్థానిక అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుంది. రోజూలాగే తన అక్కలతో కలిసి ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. సాధారణంగా పాఠశాల ముగిశాక అక్కలే చిన్నారిని ఇంటికి తీసుకువస్తారు. అయితే సాయంత్రం చీకటి పడుతున్నా చిన్నారి ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అంగన్‌వాడీ ఆయాను ఆరా తీయగా.. చిన్నారిని ఎప్పుడో ఇంటికి పంపించేశానని చెప్పడంతో కుటుంబ సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

తండ్రి అప్రమత్తత.. ప్రాణాలతో బయటపడ్డ పసికందు

చిన్నారి ఆచూకీ కోసం వెతుకుతున్న తండ్రి ఆరీఫ్‌కు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్ నుంచి చిన్నారి ఏడుపు స్వరం వినిపించింది. అనుమానం వచ్చి వెంటనే పాఠశాల గేటు దూకి వెళ్లి తలుపు వద్ద నిలబడి అమ్రిన్.. అమ్రిన్.. అని పిలవగా, లోపలి నుంచి చిన్నారి స్పందించింది. వెంటనే గ్రామస్తులతో కలిసి ఆయా వద్ద నుండి తాళం చెవులు తెప్పించి తలుపులు తెరిచారు. అప్పటికే కటిక చీకట్లో, భయంతో వణికిపోతూ ఏడుస్తున్న అమ్రిన్.. తండ్రిని చూడగానే పరుగున వచ్చి హత్తుకుంది. చిన్నారి క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సిబ్బందికి మెమోలు.. శాఖాపరమైన విచారణ

నాలుగు గంటల పాటు మూడేళ్ల చిన్నారిని గమనించకుండా కేంద్రానికి తాళం వేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా టీచర్ సెలవులో ఉండటంతో మంగపేట టీచర్ మంజులకు ఇక్కడ అదనపు బాధ్యతలు అప్పగించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో నర్సింగరాణి బుధవారం ఇస్లాంపూర్ కేంద్రాన్ని సందర్శించి విచారణ జరిపారు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకుగాను.. ఆయా లచ్చమ్మ, ఇంచార్జ్ టీచర్ మంజుల, సూపర్‌వైజర్ సంతోషికి మెమోలు జారీ చేశారు. చిన్నారి లోపల ఉన్న విషయాన్ని సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే దానిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సీడీపీవో స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us