పోలీస్ ఉద్యోగార్థులు పరీక్షలకు రెడీనా..? SI, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు విడుదల!
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! TSLPRB SI, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల తేదీలను విడుదల చేసింది. SI/ASI పరీక్ష నవంబర్ 29, కానిస్టేబుల్ పరీక్ష డిసెంబర్ 20న జరగనున్నాయి. మొత్తం 7,437 పోస్టులకు భారీ దరఖాస్తులు వచ్చాయి. వయోపరిమితి సడలింపుతో లక్షలాది మందికి లబ్ధి చేకూరింది. అభ్యర్థులు సిద్ధం కావడానికి ఇదే సరైన సమయం.

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) పోలీస్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. SI/ASI పోస్టులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.
7,437 పోస్టులకు భారీగా దరఖాస్తులు
తెలంగాణ పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఇందులో SI/ASI కేటగిరీలో 298 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ (PC) కేటగిరీలో 7,139 పోస్టులు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. మొత్తం 5,77,064 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇవి సుమారు 4,29,000 మంది అభ్యర్థుల నుంచి వచ్చినట్లు బోర్డు తెలిపింది. ఒక్కో అభ్యర్థి సగటున 1.34 పోస్టులకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది.
SI/ASI ప్రిలిమినరీ రాత పరీక్ష – నవంబర్ 29, 2026
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష – డిసెంబర్ 20, 2026
అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు, పరీక్ష కేంద్రాలు, సమయం, పరీక్ష విధానం వంటి వివరాలను బోర్డు అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని అనుసరించాలి.
ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు?
పోలీస్ శాఖతో పాటు ఇతర భద్రతా విభాగాల్లో కూడా భారీగా నియామకాలు చేపడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి:
తెలంగాణ పోలీస్ శాఖ – 5,000 పోస్టులు
SI – 200
PC – 4,800
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ – 1,424 పోస్టులు
ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్ – 790 పోస్టులు
జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ – 223 పోస్టులు
ఇలా వివిధ విభాగాలను కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
వయోపరిమితి సడలింపుతో భారీ ప్రయోజనం
ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులకు వయోపరిమితిలో ఏడేళ్ల సడలింపు కల్పించడంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం లభించింది. ఈ సడలింపు వల్ల దాదాపు 1.13 లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరినట్లు బోర్డు వెల్లడించింది.
ఒక్క పోస్టుకే 68 శాతం మంది దరఖాస్తు
దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే.. 68.45 శాతం మంది అభ్యర్థులు ఒక్క పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేశారు. మరోవైపు 28.88 శాతం మంది రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి బోర్డు కీలక విషయాన్ని వెల్లడించింది. మొత్తం 1,35,359 మంది అభ్యర్థులకు రిబేట్ వర్తింపజేసినట్లు తెలిపింది.
అభ్యర్థులు సిద్ధం కావాల్సిన సమయం ఇదే
SI/ASI అభ్యర్థులకు నవంబర్ 29 వరకు, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 20 వరకు సమయం ఉంది. దీంతో అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను మరోసారి పరిశీలించుకుని, గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాల్సి ఉంటుంది. మొత్తంగా తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం భారీ నియామక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాత పరీక్షల తేదీలు ఖరారు కావడంతో ఇక అభ్యర్థుల దృష్టి పరీక్షల సన్నద్ధతపైకి మళ్లింది.
మరిన్ని కెరీర్ & ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
