IND vs AFG: టీమిండియాకు ఇక నో టెన్షన్.. సూపర్ ఆల్ రౌండర్ దొరికేశాడుగా..!
Team India All Rounder: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన చేశాడు. అతని ఆల్‌రౌండర్ ప్రతిభను సునీల్ గవాస్కర్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. హార్దిక్ పాండ్యా తర్వాత నితీష్ చక్కటి పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయంగా మారగలడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. యువ ప్రతిభావంతులను తొందరపడకుండా తగిన సమయం ఇచ్చి తీర్చిదిద్దాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

Team India All Rounder: న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. కేవలం 24 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు సిరీస్ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ తెలుగబ్బాయ్. ఈ ప్రదర్శనను భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్, కీలక ఆటగాళ్లైన గుల్బుదీన్ నయీబ్, రషీద్ ఖాన్‌లను పెవిలియన్ చేర్చడం ద్వారా నితీష్ తన సత్తా చాటాడు.
నితీష్ కుమార్ రెడ్డి ప్రస్థానం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక బ్యాటర్‌గా ప్రారంభమైంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతను బౌలింగ్‌లో కూడా పదును పెట్టి, ప్రస్తుతం అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. హార్దిక్ పాండ్యా తర్వాత టీమ్ ఇండియాకు నితీష్ రూపంలో ఒక చక్కటి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ప్రత్యామ్నాయం లభిస్తుందని ఆయన విశ్లేషించారు.
ఇదే సందర్భంలో, దేశవాలీ క్రికెట్‌లో ప్రతిభ చూపుతున్న వెంకటేష్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే వంటి యువ ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ సునీల్ గవాస్కర్ భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశారు. ప్రతిభావంతులైన ఇలాంటి యువ ఆల్‌రౌండర్లను అంతర్జాతీయ క్రికెట్‌లోకి తొందరపడి తీసుకురావద్దని, వారికి తగిన సమయం ఇచ్చి, మెరుగైన శిక్షణతో తీర్చిదిద్దాలని ఆయన హితవు పలికారు. ఏదైనా మ్యాచ్‌లో విఫలమైనప్పుడు వారికి తగిన భరోసా కల్పించాలని, మానసికంగా బలంగా ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, బౌలింగ్‌ను కూడా సీరియస్‌గా తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో భారత్‌కు అద్భుతమైన ఎంపికలు అందుబాటులోకి వస్తాయని గవాస్కర్ తెలిపారు.
నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ ద్వారా వెలుగులోకి వచ్చి, తన బ్యాటింగ్‌తో పాటు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఇటీవల కాలంలో తరుచుగా క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా అతను కొన్ని కీలక సిరీస్‌లకు దూరమయ్యాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద పునరావాసం పొంది, మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో రెండు ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నప్పటికీ, రెండో మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటి జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
ఈ ప్రదర్శనపై నితీష్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, సానుకూల దృక్పథంతో ఉంటే దేవుడే సరైన సమయంలో ఫలితాన్ని అందిస్తాడని, ఈ ప్రదర్శన తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని రెండో టీ20 అనంతరం వ్యాఖ్యానించాడు. నితీష్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, అతనిని బాగా ప్రోత్సహిస్తే అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా జట్టులో కీలకంగా మారే అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ పునరుద్ఘాటించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
