బాబోయ్ గూగుల్ జాబ్ ఇట్టా ఉంటుందా.. జీతం కాదు వీటి గురించి తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
గూగుల్ ఉద్యోగులకు భారీ జీతాలకు మించి వారికి దక్కే విలాసవంతమైన సదుపాయాలు, భద్రతా ప్రయోజనాల గురించి ఎప్పుడైనా విన్నారా? అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు, ఎక్కడి నుంచైనా పనిచేసే స్వేచ్ఛ, ఫ్యామిలీ సంరక్షణ కోసం ప్రత్యేక సెలవులు.. ఇలా ఒక ఉద్యోగికి అవసరమైన ప్రతి విషయాన్నీ గూగుల్ దగ్గరుండి చూసుకుంటుంది. ఆ వివరాలు అన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

టెక్ ప్రపంచంలో గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం ప్రతి ఒక్కరి కల. అయితే గూగుల్‌లో పనిచేయడమంటే కేవలం నెలాఖరున వచ్చే భారీ జీతం, సరికొత్త ప్రాజెక్టులు మాత్రమే కాదు.. ఉద్యోగి జీవితాన్ని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునే సమగ్ర ప్రయోజనాల సమాహారం. ఆరోగ్యం, ఆర్థిక భద్రత, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, కెరీర్ ఎదుగుదల విషయంలో గూగుల్ అందించే సౌకర్యాలు ఉద్యోగులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఆరోగ్యం – కుటుంబానికి పూర్తి భద్రత
ద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య, దంత, దృష్టి సంబంధిత పూర్తి బీమా సౌకర్యం లభిస్తుంది. అవసరమైనప్పుడు ప్రముఖ వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకునే సదుపాయం, అలాగే ఆఫీసులోనే వెల్నెస్ సెంటర్లు, మెంటల్ హెల్త్ యాప్స్, ప్రత్యేక సహాయ కార్యక్రమాలు ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక వైద్య సపోర్ట్ ప్రోగ్రామ్‌తో పాటు మహిళల ఋతుచక్ర సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను కూడా సంస్థ అందిస్తోంది.
లక్షల్లో వేతనాలు.. కోట్లలో ప్యాకేజీలు
వివిధ నివేదికల ప్రకారం.. భారతదేశంలో గూగుల్ ఉద్యోగుల సగటు వార్షిక పరిహారం సుమారు రూ. 55.4 లక్షలు. అనుభవం, హోదాను బట్టి శాలరీ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటర్న్‌లు – ఫ్రెషర్లు: సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్‌లకు ఏడాదికి రూ.13.3 లక్షల నుండి రూ. 19.1 లక్షల వరకు అందుతుంది.
ఎంట్రీ లెవల్ ఇంజనీర్లు : రూ. 32.3 లక్షల నుండి రూ. 40.6 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ లభిస్తుంది.
మిడ్ లెవల్ : ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ మేనేజర్లకు రూ. 36.7 లక్షల నుండి రూ. 44.5 లక్షలు కాగా, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లకు రూ. 47.6 లక్షల నుండి రూ. 53.9 లక్షల వరకు ఉంటుంది.
సీనియర్ – లీడర్‌షిప్ లెవల్స్: స్టాఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు రూ. 93.6 లక్షల నుండి రూ. 1.2 కోట్లు, ఇంజనీరింగ్ మేనేజర్లకు రూ. 1.1 కోట్ల నుండి రూ. 1.6 కోట్ల వరకు ప్యాకేజీలు ఉంటాయి. ఇక క్లౌడ్ విభాగంలోని సీనియర్ స్టాఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్యాకేజీ ఏకంగా రూ. 2.6 కోట్ల నుండి రూ. 2.9 కోట్ల వరకు ఉండటం విశేషం.
అదనపు ఆర్థిక ప్రయోజనాలు: బేస్ శాలరీతో పాటు క్రమమైన బోనస్‌లు, స్టాక్స్, స్టూడెంట్ లోన్ రీపేమెంట్ సాయం, పర్సనల్ ఫైనాన్స్ కోచింగ్ వంటివి అందుతాయి.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ – కుటుంబ మద్దతు
సెలవులు – ఫ్లెక్సిబిలిటీ: వెకెషన్ సెలవులు, పేరెంటల్ లీవ్, సిక్ లీవ్‌లతో పాటు హైబ్రిడ్ వర్క్ మోడల్ అందుబాటులో ఉంది. ఉద్యోగులు సంవత్సరానికి 4 వారాల పాటు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పని చేసే వెసులుబాటు ఉంది. పేరెంటింగ్ సపోర్ట్, సంతాన సాఫల్య సాయం, కేరర్స్ లీవ్, వృద్ధుల సంరక్షణ, బ్యాకప్ చైల్డ్ కేర్ వసతులు ఉన్నాయి. అనుకోని విపత్తు సంభవించినప్పుడు కుటుంబానికి అండగా నిలిచేందుకు సర్వైవర్స్ ఇన్‌కమ్ బెనిఫిట్ కూడా అమలు చేస్తున్నారు.
క్యాంపస్ లైఫ్ – కెరీర్ గ్రోత్
ఆఫీస్‌లోనే ఉచిత పౌష్టికాహారం, స్నాక్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, మసాజ్ థెరపీలు, అలాగే వంట, ఆర్ట్స్ తరగతులు ఉంటాయి. ఉద్యోగుల పెంపుడు కుక్కలను ఆఫీస్‌కు తెచ్చుకునేందుకు ఉద్దేశించిన ప్రసిద్ధ డగ్లర్స్ సంస్కృతి, ప్రముఖుల ప్రసంగాలతో కూడిన టాక్స్ వంటివి గూగుల్ సంస్థ ప్రత్యేకతలు. కెరీర్ ఎదుగుదల కోసం ఎడ్యుకేషన్ రీయింబర్స్‌మెంట్, సహోద్యోగుల నుంచే నేర్చుకునే గూగ్లర్ టు గూగ్లర్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
గూగుల్‌లో జాబ్ సాధించడం ఎలా?
కెరీర్ ప్రొఫైల్: ముందుగా గూగుల్ కెరీర్స్ పోర్టల్‌లో ప్రొఫైల్ రూపొందించుకోవాలి.
టెయిలర్డ్ రెజ్యూమే: పాత రెజ్యూమే కాకుండా దరఖాస్తు చేసుకునే రోల్‌కు తగిన స్కిల్స్‌తో ఫ్రెష్ రెజ్యూమే సిద్ధం చేసుకోవాలి.
కంపెనీ రీసెర్చ్: గూగుల్ పనితీరు, ఉత్పత్తులపై అవగాహన పెంచుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ఇంటర్వ్యూ – ఆఫర్: రెజ్యూమే షార్ట్‌లిస్ట్ అయితే హెచ్ఆర్ బృందం సంప్రదిస్తుంది. టెక్నికల్, బిహేవియరల్ ఇంటర్వ్యూ రౌండ్లలో ప్రతిభ కనబరిస్తే తుది జాబ్ ఆఫర్ లభిస్తుంది.
