Female Serial Killer: ఆ తల్లిని నలుగురు కన్నబిడ్డల్ని చంపిన సీరియల్ కిల్లర్ అన్నారంతా.. 20 యేళ్ల జైలు శిక్ష తర్వాత నిర్ధోషిగా విడుదల
నలుగురు కన్నబిడ్డలను పోగొట్టుకున్న ఆ తల్లిని లోకం అపార్థం చేసుకుంది. బిడ్డల్ని తానే చంపిందంటూ అందరూ వేలెత్తి చూపారు. చివరికి కోర్టు కూడా అదే నిజం అని నమ్మింది. దీంతో దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. కన్న బిడ్డల్ని తల్లే చంపేసిందని వచ్చిన ఆరోపణలను మునిపంటి కింద నొక్కిపట్టి నిజం ఏనాటికైనా వెలుగు చూడకపోతుందా అనే ఆశతో ఎదురు చూసింది. వరస్ట్ సీరియల్ కిల్లర్ అనే నిందను కూడా మోసింది. ఇన్నేళ్ల అవమానాల తర్వాత కోట్టు ఆమెను నిర్దోషిగా..

కాన్‌బెర్రా, డిసెంబర్ 14: నలుగురు కన్నబిడ్డలను పోగొట్టుకున్న ఆ తల్లిని లోకం అపార్థం చేసుకుంది. బిడ్డల్ని తానే చంపిందంటూ అందరూ వేలెత్తి చూపారు. చివరికి కోర్టు కూడా అదే నిజం అని నమ్మింది. దీంతో దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. కన్న బిడ్డల్ని తల్లే చంపేసిందని వచ్చిన ఆరోపణలను మునిపంటి కింద నొక్కిపట్టి నిజం ఏనాటికైనా వెలుగు చూడకపోతుందా అనే ఆశతో ఎదురు చూసింది. వరస్ట్ సీరియల్ కిల్లర్ అనే నిందను కూడా మోసింది. ఇన్నేళ్ల అవమానాల తర్వాత కోట్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించినట్లు గురువారం (డిసెంబర్ 14) మీడియాకు వెళ్లడించింది.
కాథ్లీన్ ఫాల్బిగ్ అనే ఆస్ట్రేలియా మహిళకు నలుగురు పిల్లలు. వారంతా 1989 నుంచి 1999 మధ్య ఉన్న పదేళ్లలో అనూహ్యంగా మృతి చెందారు. ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండా ఏడాదిలోపు మొదటి ముగ్గురు పిల్లలు చనిపోవడంతో.. సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ (SIDS)అని భావించారు. అయితే ఆమె నాలుగో బిడ్డ కూడా పుట్టిన 18 నెలల తర్వాత మరణించింది. నాలుగో బిడ్డ మరణానికి ఎలాంటి కారణం లేదని వైద్యులు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫోరెన్సిక్ రిపోర్టులు స్పష్టంగా లేనప్పటికీ ఆ పసిబిడ్డలకు శ్వాస ఆడకుండా చేసి చంపేసిందని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో 2003లో పిల్లలను హత్య చేసిన నేరం కింద ఆమెను దోషిగా కోర్టు నిర్ధారించింది. వార్తా పత్రికలు ఆమెను ఆస్ట్రేలియాలో వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్ అని అభివర్ణించాయి. తన పిల్లలది సహజ మరణమని చెబుతున్నా ఎవరూ ఆమె మాటలను కాతరు చేయలేదు. ఆ తర్వాత 2003లో కోర్టు కాథ్లీన్‌ను దోషిగా తేల్చగా 20 ఏళ్లు శిక్ష అనుభవించింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి కాథ్లీన్ పోరాడింది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆమెకు రెండు దశాబ్ధాల కాలం పట్టింది.
2019లో ఈ కేసుపై మరోమారు విచారణ చేపట్టగా కాథ్లీన్ నేరం చేసినట్లు కోర్టు పునరుద్ఘాటించింది. కానీ 2022లో రెండవ సారి విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఇద్దరు పిల్లలకు జన్యు పరివర్తన ఉందని, అదే వారి మరణాలకు కారణమై ఉండవచ్చని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆ పిల్లలంతా సహజ కారణాలతో మృతి చెందారని తేలడంతో ఈ ఏడాది జూన్ నెలలో క్షమాభిక్ష మీద ఆమె జైలు నుంచి విడుదలయ్యింది. చనిపోయిన పిల్లల వయసు 19 రోజుల నుంచి 18 నెలల మధ్య ఉంటుంది. తన పిల్లల మృతిపై సైన్స్, జెనెటిక్స్ క్లారిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అరుదైన జన్యు పరివర్తనలు, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల కలిగే ఆకస్మిక మరణాలను గురించి అర్థం చేసుకునేందుకు దోహదం చేసింది. 1999లో కూడా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను ఇంతకాలం అక్రమంగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చినందుకు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించనున్నట్లు కాథ్లీన్ లాయర్ మీడియాకు తెల్పింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.