Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇకపై పెళ్ళిళ్లలో నో డీజే.. నో డౌరీ.. పెద్దల మాటే శాసనం.. కాదూ కూడదంటే..!

ఖర్చుకు తగ్గేదేలే.. పెళ్లి వేడుక అదిరిపోవాలి..! ఆకాశమంత పందిరి.. భూదేవంత పీఠ వేసి పెళ్లి చేయాలి. నభూతో నభవిష్యత్ అనేలా పెళ్లి వేడుక సాగాలి. పెళ్లి వేడుకకు వచ్చిన బంధువులు విందులు‌ ఆరగించి, వారెవ్వా అనేలా.. ఫ్రీ వెడ్డింగ్ షూట్లు.. హల్దీ ఫంక్షన్లు.. బిగ్ స్క్రీన్లలో మూడు ముళ్ల సందడి.. డీజే మోతలతో బరాత్‌లు దుమ్మెత్తిపోవాలి. ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా జనం కోరుకుంటున్న ట్రెండ్‌.

Telangana: ఇకపై పెళ్ళిళ్లలో నో డీజే.. నో డౌరీ.. పెద్దల మాటే శాసనం.. కాదూ కూడదంటే..!
Marriage
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Mar 27, 2025 | 3:56 PM

ఖర్చుకు తగ్గేదేలే.. పెళ్లి వేడుక అదిరిపోవాలి..! ఆకాశమంత పందిరి.. భూదేవంత పీఠ వేసి పెళ్లి చేయాలి. నభూతో నభవిష్యత్ అనేలా పెళ్లి వేడుక సాగాలి. పెళ్లి వేడుకకు వచ్చిన బంధువులు విందులు‌ ఆరగించి, వారెవ్వా అనేలా.. ఫ్రీ వెడ్డింగ్ షూట్లు.. హల్దీ ఫంక్షన్లు.. బిగ్ స్క్రీన్లలో మూడు ముళ్ల సందడి.. డీజే మోతలతో బరాత్‌లు దుమ్మెత్తిపోవాలి. ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా జనం కోరుకుంటున్న ట్రెండ్‌. కానీ అక్కడ మాత్రం ఇవన్నీ నడువవు.. హంగు ఆర్బాటాలకు అస్సలు చోటు ఉండొద్దు. అసలు‌ డీజే మోతలే వినిపించొద్దు.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ల పేరెత్తితే తాటతీస్తాం అంటున్నారు అక్కడి పెద్దలు. పెళ్లంటే నూరేళ్ల పంటలా ఉండాలి కానీ పదేళ్ల మంటలా కాదంటున్నారు. తరతరాల సంప్రదాయాన్ని కొనసాగించేలా ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా పెళ్లి జరిపించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కట్నకానుకల్లోనూ‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇంతకీ డీజే మోతలు లేని ఫ్రీ వెడ్డింగ్ షూట్లకు అసలు ఛాన్సే లేని పెళ్ళిలు సాగుతున్నదీ ఎక్కడ..?

అడవుల జిల్లా ఆదిలాబాద్.. సంస్కృతి సంప్రదాయాల‌కు పుట్టినిల్లు. హంగుఆర్బాటాలకు దూరంగా సాదాసీదా జీవనానికి‌ దగ్గరగా సాగుతున్న జిల్లా. అలాంటి జిల్లాలో పెళ్లి తంతును కూడా అంతే సాదాసీదగా సాగాలని నిర్ణయం తీసుకున్నారు బంజారా సామాజిక వర్గ పెద్దలు. సోషల్ మీడియా ఎఫెక్ట్ తో ఫ్రీ వెడ్డింగ్ షూట్లు, డెస్టినేషన్ వెడ్డింగ్లు , హల్దీ పంక్షన్లతో వివాహ వేడుకను రిచ్ గా చేసి అప్పుల పాలవుతున్నారు జనం. పెళ్లిని ఓ మధుర జ్ఞాపకంలా నిలుపుకోవడానికి అప్పులు చేసి మరీ ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే అలాంటి వేడుకలతో తమ సమాజం ఆర్థికంగా కుదేలవుతుందని.. అలాంటి పెళ్లిలకు మా సామాజిక వర్గంలో చోటు లేదంటున్నారు లంబాడా పెద్దలు.

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని లంబాడాలు హంగు ఆర్బాటాలకు పోయి ఘనంగా పెళ్లిలు జరిపి అప్పుల పాలవుతున్నారని గుర్తించిన లంబాడా సామాజిక వర్గాల పెద్దలు మూకుమ్మడిగా ఓ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుండి తమ సమాజంలో ఆడంబరాలకు చోటు లేకుండా పెళ్లి వేడుకలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. పెళ్లి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్లకు అవకాశం ఇవ్వవద్దని, పెళ్లిలో భారీ కట్నకానుకలతో అమ్మాయి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు తీసుకురావద్దని కోరారు. కట్నకానుకల్లో అమ్మాయికి తులం బంగారం కంటే మించి పెట్టవద్దని.. పెళ్లి ముగిసిన తర్వాత బరాత్ ల పేరిట డీజే మోతలకు అవకాశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. కాదు‌కూడదని పెద్దల ఆదేశాలను దిక్కరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరికలు‌ సైతం జారీ చేశారు. ఈ కఠిన ఆంక్షలు తమ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలహీనం కాకుండా చూసుకోవడంలో భాగమేనన్నది బంజారా సామాజిక వర్గ పెద్దల మాట.

ఈ మద్య కాలంలో పట్టణాలతో పోటీ పడుతున్న ఏజెన్సీ ప్రాంతంలోను వివాహ వేడుకల తీరు మారుతుంది. ఈ కారణం చేత సంస్కృతి సంప్రదాయాలను కోల్పోతున్నామని.. కల్యాణ మండపాలు, కన్వెన్షన్‌ సెంటర్లు దాటి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వరకు వెళుతున్నారని.. ఫ్రీ వెడ్డింగ్‌ షూట్లు, హల్దీ ఫంక్షన్లతో హడావుడి చేస్తూ తలకు మించిన భారాన్ని మోస్తున్నారు. ఈ‌ కారణంగానే ఉట్నూర్ ఏజెన్సీలో బంజారా వివాహాల్లో ఆంక్షలు అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నామంటున్నారు బంజారా కుల పెద్దలు. పెళ్లి వేడుకకు ముందు హల్దీ ఫంక్షన్‌కు లక్షల్లో డబ్బులు వృథా చేస్తుండడంతో ఎక్కడ హల్దీ ఫంక్షన్ జరిగినా సంప్రదాయ‌బ‌ద్ధంగా జరుపుకోవాలని, డీజే సౌండ్ తో డ్యాన్సులు చేయడం నిషేధించామని బంజారా సంఘం నేత భరత్ చౌహన్ తెలిపారు. పెళ్లికి ముందు కట్నకానుకలు ఎక్కువగా డిమాండ్ చేయవద్దని, వధువుకు సరిపడా మూడు తులాల బంగారం, అబ్బాయి చేతి ఉంగరానికి ప‌ది గ్రాముల గోల్డ్ మాత్రమే మాట్లాడుకోవాలని, ఇంతకుమించి అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. అంతేకాదు కుల పెద్ద‌ల స‌మ‌క్షంలోనే నిశ్చితార్థం నిర్వహించాల‌ని సంఘం తీర్మానించింది. తీర్మానాలు ఉల్లంఘించే వారిపై జ‌రిమానాలు కూడా విధిస్తామని భరత్ చౌహన్ స్పష్టం చేశారు. సంప్రదాయాలు పాటించేలా తాము పలు షరతులతో పెళ్లిళ్లు జరిపేలా చూస్తున్నామ‌ని, ఇందుకు గ్రామాల్లో సైతం సానుకూల స్పందన లభిస్తుందని బంజారా సంఘం నాయకులు చెప్తున్నారు.

మ్యారెజీ​కు ముందు ప్రీ వెడ్డింగ్‌ షూట్ల జోరు కొనసాగుతుందని.. కొందరు నిర్వహకులు‌ మరో అడుగు ముందుకేసి.. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లోని కొన్ని వీడియో షాట్లతో మీమ్స్‌ను క్రియేట్‌ చేస్తున్నారని, వాటికి సినిమాల్లోని హాస్య సన్నివేశాలను జోడించి వీడియోలను రూపొందిస్తున్నారు. దీంతో వివాహ‌బందం అర్థమే మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంజారా పెద్దలు. తమ సామాజిక వర్గంలో వీటికి చోటు లేదని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వివాహ బంధాన్ని బలపరుచుకోవాలని సూచిస్తున్నారు. డిజిటల్ యుగంలో వివాహ‌ వేడుకలు రోజురోజుకు శ్రుతిమించుతూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కనుమరుగవుతున్నాయి. ఈనేపథ్యంలో లంబడా గిరిజన పెద్దలు విదిస్తున్న నిషేధాజ్ఞలు సరైనవే అంటున్నారు బంజారా యువత. సంపన్న, పేద వర్గాల మధ్య పెళ్లి వేడుకలు, కానుకలు కుటుంబాల మధ్య చిచ్చురేపుతుండడంపై లంబాడా గిరిజన సంఘాల నేతలు సమావేశమై ఆంక్షలతో కూడిన తీర్మానాలు చేయడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశం అవుతోంది.

గతంలో సంప్రదాయబద్ధంగా ఎలాంటి ఖర్చులు లేకుండా సాదాసీదాగా పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు మాత్రం పెళ్లికి ముందే అసభ్యకరమైన ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లు, డీజే సౌండ్స్ తో పేరడీలు సాధారణ తంతుగా మారాయని.. వీటివల్ల లక్షల్లో ఖర్చు పెరగడమే గాక పేద, ధనిక కుటుంబాల మధ్య అసమానతలు మరింత పెరుగుతున్నాయంటున్నారు లంబాడా గిరిజన పెద్దలు. ల‌క్షల్లో కట్నకానుకలు డిమాండ్ చేయడంతో పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతుండడం వల్ల కఠిన పరిమితులతో నిషేధాలు విధించామని లంబాడ హక్కుల సంఘం నేతలు చెప్తున్నారు. బంజారాల పెళ్లి వేడుకల ఆడంబరాలపై ఏజెన్సీలో విధించిన నిషేధ పరిమితులు రాష్ట్రమంతటా త్వరలోనే అమల్లోకి వస్తాయని చెప్తున్నారు బంజారా కులపెద్దలు. చూడాలి మరీ నో డీజే నో డౌరీ పెళ్లిల్లు సమాజంలో మంచి మార్పుకు బాటలు వేస్తాయో లేదో‌..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..