ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే వీడియో
వేసవి వచ్చేసింది అంటే మామిడి పళ్ల సీజన్ వచ్చినట్లే. కేజీ మామిడి ధర ఎంత లేదన్నా 300 రూపాయలకు మించదు. కేజీ 3 లక్షల రూపాయలు పలికే మామిడి పళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడిపళ్లని మన రైతులు పండిస్తున్నారు. అత్యద్భుత రుచి, రంగు, ఔషధ గుణాలతో ఈ మామిడి ఎంతో ప్రత్యేకం. కుమారుడు కానుకగా ఇచ్చిన మొక్కలతో నాందేడ్ మహిళా రైతు ఇంట సిరులు ఎలా కురుస్తున్నాయి? మామిడి పండ్లకు సెక్యూరిటీగా వేట కుక్కల్ని నియమించడం ఎప్పుడైనా చూసారా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి పండ్లను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోసీ గ్రామానికి చెందిన సుమన్‌బాయి గైక్వాడ్ అనే మహిళా రైతు పండించారు. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో ఒక్కో మామిడి పండును ఆ ప్రాంత ఇతర రైతులు అసూయ పడేంతలా 10 వేల రూపాయలకు అమ్మారు. సుమన్‌బాయి కుమారుడు నందకిశోర్ గైక్వాడ్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ మామిడిపండ్ల సాగు. యూపీఎస్సీ పరీక్షల కోసం పుణెలోని కోచింగ్ సెంటర్‌లో చేరిన అతను .. కరోనా కారణంగా అది మూతపడటంతో ఇంటికి తిరిగివచ్చాడు. ఇంట్లోనే ఉండి పరీక్షలకు సిద్ధమవుతూ.. ఆన్‌లైన్‌లో జపనీస్ రకానికి చెందిన మియాజాకీ మామిడి పండ్ల గురించి తెలుసుకున్నాడు. అనంతరం తల్లిని ఆ సాగువైపు ప్రోత్సహించాడు. ఒక్కొక్క దానికి రూ 6,500 చొప్పున చెల్లించి ఫిలిప్పీన్స్ నుంచి 10 మొక్కలను తెప్పించాడు. రెండేళ్ల కిందట వాటిని నాటగా ఈ ఏడాది ఒక్కో చెట్టుకు 11 నుంచి 12 కాయలు వచ్చాయి. ఆ పండ్లను వ్యవసాయ ప్రదర్శనలో విక్రయించారు. ముందు ఊదా రంగులో ఉన్న మియాజాకీ మామిడి రంగు పక్వానికి వస్తున్న కొద్దీ అస్తమిస్తున్న సూర్యుడిలా ఎరుపు వర్ణంలోకి మారుతుంది. కాబట్టే ఎగ్ ఆఫ్ ద సన్ అని కూడా అంటారు. 1950ల్లో ప్రత్యేక విధానంలో జపాన్ వాతావరణ పరిస్థితులకు అనుగూణంగా ఈ హైబ్రిడ్‌ను రూపొందించారు. ప్రత్యేకమైన తియ్యదనం, నువాసన కలిగిన ఈ పండుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఒక్కో పండు సుమారు 350 గ్రాముల నుంచి 550 గ్రాముల వరకూ ఉంటుంది. పండు కూడా సుతిమెత్తగా ఉంటుంది.