ఏప్రిల్ 1 నుంచి UPI పేమెంట్స్ బంద్ వీడియో
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఎక్కువగా వినిపించే పేరు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అదే షార్ట్‌కట్‌లో యూపీఐ. యూపీఐ పేమెంట్ల ద్వారా నిత్యం కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాను మొబైల్ నెంబర్‌తో కనెక్ట్ చేయడం ద్వారా యూపీఐ చెల్లింపులు సులభంగా మారాయి. చిన్న వ్యాపారుల నుంచి కోట్లలో బిజినెస్ చేసే పెద్ద వ్యాపారస్తుల వరకు అందరికీ ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ ద్వారానే అంతా సాఫీగా సాగిపోతుంది. యూపీఐ పేమెంట్స్ ద్వారా ఎంత సుఖం ఉందో అదే స్థాయిలో మోసాలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 1 నుంచి కొన్ని మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈమేరకు ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న నంబర్లకు లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు.. ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. యూపీఐ వినియోగంలో మొబైల్ నంబర్ కీలకం. ఈ సేవల్లో ఓటీపీ వెరిఫికేషన్ కీలక భూమిక పోషిస్తుంది. అందుకే ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తోంది.ఎక్కువకాలం పాటు వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు వేరొకరికి కేటాయిస్తుంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు మనం వాడిన నంబర్లు వేరొకరికి చేరుతుంటాయి. దాంతో యూపీఐ ఖాతాలు కూడా వారి చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు ఎన్‌పీసీఐ ఆదేశాల మేరకు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్‌తో పాటు బ్యాంకులు ఇన్‌యాక్టివ్ నంబర్లను తొలగించే పనిలో పడ్డాయి.