AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ కాస్కో.. పెట్రోల్ రేట్లపై ఇరాన్ వార్నింగ్.. ప్రపంచం గుండెల్లో గుబులు

ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. అమెరికా విధిస్తున్న ఇరాన్ నౌకాదళ దిగ్బంధనం ఒకవైపు.. ఇంధన ధరల పెరుగుదల తప్పదని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు మరోవైపు.. వెరసి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్ల మార్కును దాటేశాయి.

ట్రంప్ కాస్కో.. పెట్రోల్ రేట్లపై ఇరాన్ వార్నింగ్.. ప్రపంచం గుండెల్లో గుబులు
Crude Oil Prices Surpass 100 Dollars
Krishna S
|

Updated on: Apr 13, 2026 | 11:00 AM

Share

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకుంటున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం ప్రపంచ చమురు మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఈ పరిణామాలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. అమెరికాలో పెరగబోయే ఇంధన ధరల పట్ల వైట్ హౌస్‌ను హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిలో ఆంక్షలు విధిస్తామన్న హెచ్చరికలపై ఘాలిబాఫ్ X వేదికగా స్పందించారు. వైట్ హౌస్ సమీపంలోని గ్యాస్ ధరల స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. ‘‘ప్రస్తుత పెట్రోల్ ధరలను ఆస్వాదించండి.. త్వరలోనే ఈ ధరలు భారీగా పెరుగుతాయి’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన ఒక ఆసక్తికరమైన సమీకరణాన్ని పోస్ట్ చేశారు. అమెరికా తమ ఓడరేవులను దిగ్బంధిస్తే.. చమురు ధరలు విపరీతంగా పెరగడం ఖాయమని హెచ్చరించారు.

రంగంలోకి దిగిన యూఎస్ నేవీ

మరోవైపు అమెరికా తన హెచ్చరికలను అమలు చేయడం ప్రారంభించింది. సోమవారం సాయంత్రం నుండి ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే అన్ని రకాల నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అరేబియా గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని అన్ని ఇరానియన్ పోర్టులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఇతర దేశాల మధ్య ప్రయాణించే నౌకలకు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతి ఉంటుందని యూఎస్ స్పష్టం చేసింది. నావికులందరూ బ్రిడ్జ్ టు బ్రిడ్జ్ ఛానల్ 16 ద్వారా నిరంతరం నిఘా వర్గాలతో టచ్‌లో ఉండాలని ఆదేశించింది.

భగ్గుమంటున్న చమురు ధరలు

ట్రంప్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. WTI క్రూడ్ ఆయిల్ 8 శాతం పెరిగి బ్యారెల్‌కు 104.50 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ 7 శాతం వృద్ధితో 102 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావంతో ఆసియా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దక్షిణ కొరియా కోస్పి 2 శాతం, జపాన్ నిక్కీ 0.3 శాతం నష్టపోయాయి.

విఫలమైన ఇస్లామాబాద్ చర్చలు

వాస్తవానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని ప్రపంచం ఆశించింది. కానీ, ఇరుపక్షాలు తమ రెడ్ లైన్స్ విషయంలో పట్టుదలకు పోవడంతో చర్చలు ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దాడులు కొనసాగుతున్న వేళ, హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.

Follow Us