Air India: ఎయిర్ పోర్ట్‌పై క్షిపణి దాడి.. విమానాల రాకపోకలు నిలిపివేసిన ఎయిర్ ఇండియా!
బెన్ గురియన్ విమానాశ్రయంపై జరిగిన క్షిపణి దాడి తరువాత, ఎయిర్ ఇండియా ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాలను రెండు రోజులపాటు నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఢిల్లీ నుండి బయలుదేరిన ఒక విమానాన్ని అబుదాబికి మళ్లించారు.

ఈ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమానాలను ఎయిర్ ఇండియా రాబోయే రెండు రోజుల పాటు నిలిపివేసింది. ఈ సంఘటన తర్వాత ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాన్ని అబుదాబికి మళ్లించామని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టిక్కెట్లు ఉన్నవారికి మినహాయింపు, రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
“ఈ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటన తర్వాత ఢిల్లీ నుండి టెల్ అవీవ్‌కు మే 4, 2025న బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI139ని అబుదాబికి మళ్లించారు. విమానం అబుదాబిలో ల్యాండ్ అయింది. త్వరలో ఢిల్లీకి తిరిగి వస్తుంది. మా కస్టమర్లు, సిబ్బంది భద్రతను కోసం మా కార్యకలాపాలు మే 6, 2025 వరకు తక్షణమే నిలిపివేస్తున్నాం. మా సిబ్బంది కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వారికి సహాయం చేస్తున్నారు. మే 3 నుంచి 6 మధ్య చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో మా విమానాలలో బుక్ చేసుకున్న కస్టమర్లకు రీషెడ్యూలింగ్‌పై ఒకేసారి మినహాయింపు లేదా రద్దు కోసం పూర్తి వాపసు అందిస్తాం.” అని ఎయిర్ ఇండియా పేర్కొంది.
యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణి బెన్ గురియన్ విమానాశ్రయం ప్రధాన టెర్మినల్ సమీపంలో పడటంతో నలుగురు గాయపడ్డారు. క్షిపణి దాడితో విమానాశ్రయంలో కార్యకలాపాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారీ మాట్లాడుతూ.. బెన్ గురియన్ విమానాశ్రయం ఇకపై విమాన ప్రయాణానికి సురక్షితం కాదు అని అన్నారు. ఆయన ప్రకటన తర్వాత, క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పందిస్తూ.. ఈ దాడికి 7 రెట్లు ప్రతిదాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్ దాడులతో దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు, పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రకటించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
