భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు.. రష్యా స్టేట్‌మెంట్ ఏంటంటే..?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్, రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ మధ్య చర్చలు జరిగాయి. భారత్-పాకిస్తాన్ విభేదాలను ద్వైపాక్షికం గా పరిష్కరించుకోవాలని రష్యా కోరింది. భారత్ పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించింది, దిగుమతులు, పోస్టల్ సేవలు నిలిపి వేసింది.

పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భాతర విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో చర్చించారు. భారత్, పాకిస్తాన్ తమ విభేదాలను రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ కోరారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన లావ్‌రోవ్.. భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలపై సుదీర్ఘంగా చర్చించారు.
“పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రష్యా-భారత్ సహకారం, భారత-పాకిస్తాన్ సంబంధాల గురించి వారు చర్చించారు. 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్ నిబంధనల ప్రకారం రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా భారత్, పాక్ మధ్య విభేదాలను ద్వైపాక్షిక ప్రాతిపదికన పరిష్కరించుకోవాలని సెర్గీ లావ్రోవ్ పిలుపునిచ్చారు” ఈ విషయాన్ని రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు చర్యలు తీసుకుంది. అలాగే ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ నుంచి దిగుమతులను భారత్ నిషేధించింది. పాకిస్తాన్ నౌకల ప్రవేశాన్ని నిషేధించింది, పోస్టల్ సేవలను నిలిపివేసింది. పాకిస్తాన్ నుండి ఉద్భవించే లేదా దాని గుండా వెళ్ళే వస్తువుల దిగుమతిపై భారతదేశం శనివారం నిషేధం విధించింది. మెయిల్, పార్శిళ్ల మార్పిడిని నిలిపివేసింది.
