Nobel Prize: 2026 రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి.. మొత్తం ప్రైజ్‌మనీ ఎంతంటే?
Nobel Prize: 2026 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలను వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి. కాగన్ (Henri B. Kagan), జపాన్‌కు చెందిన కెన్సో సోయ్ (Kensō Soai)లు సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అసిమ్మెట్రిక్ ఆర్గానిక్..

Nobel Prize: 2026 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలను వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి. కాగన్ (Henri B. Kagan), జపాన్‌కు చెందిన కెన్సో సోయ్ (Kensō Soai)లు సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అసిమ్మెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌లో నాన్-లీనియర్ ఎఫెక్ట్స్ (Non-linear effects), ఆటోక్యాటాలసిస్ (Autocatalysis)పై చేసిన కీలక పరిశోధనలకు గుర్తింపుగా వీరికి ఈ అవార్డు లభించింది.
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అక్టోబర్ 7, 2026న విజేతలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది కెమిస్ట్రీ నోబెల్ బహుమతి మొత్తంగా 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ కాగా, ఈ మొత్తాన్ని ఇద్దరు విజేతలు సమానంగా పంచుకోనున్నారు.
ఇంతకీ వీరి పరిశోధన ఎందుకు అంత ముఖ్యమైనది?
మన చుట్టూ ఉన్న అనేక అణువులు ఒకదానికొకటి అద్దంలో కనిపించే ప్రతిబింబాల మాదిరిగా రెండు రూపాల్లో ఉండగలవు. వీటిని మిర్రర్-ఇమేజ్ మాలిక్యూల్స్ లేదా ఎనాంటియోమర్స్ (Enantiomers) అంటారు. సులభంగా చెప్పాలంటే మన ఎడమ, కుడి చేతులు ఒకదానికొకటి అద్దం ప్రతిబింబాల్లా ఉంటాయి. చూడటానికి ఒకేలా కనిపించినా వాటిని పూర్తిగా ఒకదానిపై మరొకటి ఉంచలేం. రసాయన అణువుల్లోనూ ఇలాంటి లక్షణం ఉంటుంది. దీనినే చిరాలిటీ (Chirality) అంటారు.
జీవుల్లో ఒకే రకమైన అణు రూపం ఎందుకు?
జీవరాశుల్లో ఉండే అనేక ముఖ్యమైన అణువులు రెండు అద్దం ప్రతిబింబ రూపాల్లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, జీవ వ్యవస్థలు వాటిలో ఒక రూపాన్నే ఎక్కువగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ప్రోటీన్ల నిర్మాణంలో ఉపయోగించే అమినో ఆమ్లాలు రెండు మిర్రర్-ఇమేజ్ రూపాల్లో ఉండగలవు. అయితే జీవ వ్యవస్థల్లో ఒక నిర్దిష్ట రూపానికే ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రత్యేకతను హోమోకైరాలిటీ (Homochirality) అంటారు. ఇది చాలా కాలంగా రసాయన శాస్త్రవేత్తలను ఆలోచింపజేసిన ప్రశ్న.
జీవం ప్రారంభమైనప్పుడు ఒకే రకమైన మాలిక్యులర్ ‘హ్యాండ్‌నెస్’ ఎలా ఏర్పడింది? అనే ప్రశ్నకు సమాధానం కనుగొనే దిశలో కాగన్, సోయ్ పరిశోధనలు కీలకమైన ముందడుగుగా నిలిచాయి.
మొత్తం ప్రైజ్‌మనీ ఎంతంటే?
నోబెల్ గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతి విలువ ఈ ఏడాది 12 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (సుమారు 1.2 మిలియన్ డాలర్లు / దాదాపు రూ.10 కోట్లకు పైగా). ఈ మొత్తాన్ని ఇద్దరు విజేతలకు సమంగా పంచనున్నారు.
BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2026 #NobelPrize in Chemistry to Henri B. Kagan and Kenso Soai “for the discovery of non-linear effects and autocatalysis in asymmetric organic synthesis.” https://t.co/nH090ql1Xc
— The Nobel Prize (@NobelPrize) October 7, 2026
