మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచిన డీకే అరుణకు మోదీ 3.O కేబినెట్‌లో చోటు దక్కే అవకాశముందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో చిట్‌చాట్, టీవీ9తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ నియోజకవర్గంలో తన విజయంపై మొదటి నుంచి విశ్వాసం ఉందన్నారు డీకే అరుణ. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఓటుకు వెయ్యి చొప్పున పంచిందని ఆరోపించారు. అయినా ప్రజల అశీర్వాదంతో తాను గెలిచానని చెప్పారు. జిల్లా ప్రజల కోసం శాయశక్తులా పనిచేస్తానని.. అభివృద్ధి కోసం కేంద్రంతో రాష్ట్రం కలిసి పనిచేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని తాము కోరడం లేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి హద్దులు దాటి అబద్ధాలు ప్రచారం చేశారని విమర్శించారు. తమ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి పనిచేశాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. తనకు ఏ పదవి ఇవ్వాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారని తెలిపారు. పార్టీ ఏ పదవి అప్పగించినా నిర్వహిస్తానని చెప్పారు. అదే సమయంలో కేంద్ర మంత్రి పదవి కోసం తాను లాబీయింగ్ చేయబోనని స్పష్టంచేశారు.
మహబూబ్ నగర్ ఓట్ల లెక్కింపు మంగళవారంనాడు హోరాహోరీగా సాగింది. చివరకు డీకే అరుణ 4500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై విజయం సాధించారు. డీకే అరుణకు 5,10,747 ఓట్లు పోల్ కాగా.. వంశీచంద్ రెడ్డి 5,06,247 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి 1,54,792 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు.