రోడ్ కిందే చార్జింగ్ పాయింట్స్ ! రన్నింగ్ వెహికిల్‌కు క్షణాల్లో ఛార్జింగ్.!
రోడ్డుపై ప్రయాణిస్తూనే ఎలక్ట్రిక్ వాహనాలు ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయ్యే టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఫ్రాన్స్, అమెరికా దేశాలు డైనమిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్లను విజయవంతంగా పరీక్షించాయి. ఈ టెక్నాలజీతో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం తగ్గి, ఈవీల రేంజ్ సమస్యకు పరిష్కారం లభించనుంది. భవిష్యత్తులో రోడ్లే పవర్ హౌస్‌లుగా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మనం ఇప్పుడు ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నామో తెలుసా? ఒక్క క్షణం కూడా వెయిట్ చేయడానికి ఎవరికీ ఓపిక లేని శరవేగవంతమైన ప్రపంచం! అవును, టెక్నాలజీ మన జీవితాలను అంతలా మార్చేసింది. ఒకప్పుడు ఉత్తరం అందడానికి వారాలు పట్టేది. ఇప్పుడు వాట్సాప్‌లో సెకన్లలో మెసేజ్ వెళ్ళిపోతోంది. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఓటీటీలో ఒక్క క్లిక్‌తో ప్రపంచ సినిమా మన చేతుల్లో ఉంటోంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అయితే ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. మరి ఇంతలా దూసుకుపోతున్న ప్రపంచంలో.. మన రవాణా వ్యవస్థ, మన వాహనాలు మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండిపోతే ఎలా చెప్పండి? సాధారణంగా మన బండిలో పెట్రోలో, డీజిలో అయిపోతే ఏం చేస్తాం? వెంటనే పెట్రోల్ బంక్ కి వెళ్తాం. ఐదు నిమిషాలు లైన్ లో నిలబడి ఆయిల్ కొట్టించుకుని వచ్చేస్తాం. అదే మీ దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ ఉందనుకోండి.. బ్యాటరీ డెడ్ అయిపోతే ఏం చేయాలి? ఏదైనా ఛార్జింగ్ పాయింట్ వెతుక్కుంటూ వెళ్ళాలి. అక్కడ బండిని ప్లగ్‌కి కనెక్ట్ చేసి.. కనీసం అర గంట నుండి ఒక గంట పాటు ఈగలు తోలుకుంటూ కూర్చోవాలి! అవునా కాదా? ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. ఈవీ కార్లు కొనడానికి చాలా మంది భయపడటానికి, వెనకడుగు వేయడానికి కూడా ప్రధాన కారణం ఇదే! కానీ.. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని వింటే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది! “ఛార్జింగ్ స్టేషన్ల వద్ద ఆగాల్సిన అవసరం లేదు.. అసలు బండిని ఎక్కడా ఆపాల్సిన పనే లేదు! మీరు వందల కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై ప్రయాణిస్తుంటేనే.. మీ కారు ఆటోమేటిక్‌గా, వైర్‌లెస్ పద్ధతిలో ఛార్జ్ అయిపోతుంది!” నమ్మకం కలగడం లేదా? ఇది ఏదో మార్వెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ అనుకుంటున్నారా? కానే కాదు! ఇది అక్షరాలా నిజం. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు దీని గురించి కేవలం ఆలోచించడమే కాదు.. ఏకంగా రోడ్డు నిర్మించి, ప్రయోగం చేసి, సక్సెస్ అయి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. అసలు ఏంటా దేశాలు? ఏంటా టెక్నాలజీ? రోడ్డుపై వెళ్తుంటే కారు ఎలా ఛార్జ్ అవుతుంది? దీనివల్ల భవిష్యత్తు ఎలా మారబోతోంది? ఈ రోడ్డుపై వెళ్తే షాక్ కొడుతుందా? ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు అసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కోరలు చాస్తోంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్వస్తి పలకడం ఒక్కటే మార్గం. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. భారతదేశంలో కూడా ఈవీల హవా మొదలైంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు, అవి ప్రతి ఇంటికీ చేరడానికి అతిపెద్ద విలన్‌గా మారిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది రేంజ్ యాంగ్జైటీ. అంటే ప్రయాణంలో ఎక్కడ బ్యాటరీ ఖాళీ అయిపోతుందో, బండి మధ్యలో ఆగిపోతుందేమో అన్న భయం. రెండోది ఛార్జింగ్ కేంద్రాల కొరత. నగరాల్లో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నా, హైవేలపై లాంగ్ జర్నీ చేసేటప్పుడు వందల కిలోమీటర్ల వరకు ఛార్జింగ్ స్టేషన్లు కంటికి కనిపించవు. ఇక మూడోది ఎక్కువ సమయం తీసుకోవడం. పెట్రోల్ ఐదు నిమిషాల్లో పోయించవచ్చు. కానీ, ఈవీ ఛార్జింగ్ కావాలంటే గంటల తరబడి వేచి చూడాలి. ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నా కనీసం 30 నుండి 40 నిమిషాలు పడుతుంది. ఈ మూడు సమస్యల వల్ల లక్షల రూపాయలు పెట్టి ఈవీ కార్లు కొనడానికి జనం ఇప్పటికీ సందేహిస్తున్నారు. సిటీ దాటి హైవే ఎక్కాలంటే భయపడుతున్నారు. సరిగ్గా ఈ సమస్యకు, ఎవరూ ఊహించని ఒక విప్లవాత్మకమైన పరిష్కారాన్ని కనిపెట్టింది పశ్చిమ ఐరోపా దేశమైన ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశం పర్యావరణ పరిరక్షణలో ఎప్పుడూ ముందే ఉంటుంది. కాలుష్య నియంత్రణలో భాగంగా ఆ దేశం ఇప్పటికే ఆయిల్ వాహనాలకు దాదాపు స్వస్తి పలికే దశకు చేరుకుంది. అక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యధికంగా విద్యుత్ వాహనాలే కనిపిస్తాయి. అయితే, తమ ప్రజలు ఛార్జింగ్ స్టేషన్ల వద్ద గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకోకూడదని ఫ్రాన్స్ ప్రభుత్వం భావించింది. దీనికోసం వారు ఒక వినూత్నమైన, మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అదే “డైనమిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్డు”. పారిస్ నగరం నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ A10 మోటార్‌వేపై ఈ అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేశారు. దీనిని “ఛార్జ్ ఆస్ యూ డ్రైవ్” ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వం పలు అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు, పరిశోధకులతో కలిసి ఈ 1.5 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక రహదారిని నిర్మించింది. ఈ రోడ్డుపై మీ ఈవీ వాహనాన్ని ఎక్కించి నడిపితే చాలు.. బండి రన్నింగ్‌లో ఉండగానే, ఆటోమేటిక్‌గా బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. ఒక్క క్షణం కూడా మీరు బండి ఆపాల్సిన అవసరం లేదు. చదవడానికి వింతగా ఉన్నా, ఫ్రాన్స్ దీనిని ఆచరణలో సాధ్యం చేసి చూపించింది! అసలు వైర్లు లేకుండా, ప్లగ్ పెట్టకుండా రోడ్డు మీద వెళ్తుంటే కారు ఎలా ఛార్జ్ అవుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అని మీకు ఖచ్చితంగా అనుమానం వచ్చే ఉంటుంది. చాలా సింపుల్.. మీలో చాలా మంది ఇప్పుడు ఇంట్లో లేదా ఆఫీసులో స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జర్లు వాడుతూనే ఉండి ఉంటారు. ఫోన్‌ని ఒక ప్యాడ్‌పై పెట్టగానే ఎలాంటి వైర్ కనెక్ట్ చేయకుండానే ఫోన్ ఛార్జ్ అవుతుంది కదా? సరిగ్గా అదే సూత్రం ఆధారంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. దీనిని మూడు భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది రోడ్డు కింద రాగి కాయిల్స్. ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు A10 మోటార్‌వే రోడ్డు ఉపరితలం కింద అంటే కాంక్రీట్ లోపల ప్రత్యేకమైన రాగి కాయిల్స్‌ను అమర్చారు. ఈ కాయిల్స్ గుండా విద్యుత్‌ను ప్రవహింపజేసినప్పుడు, అవి రోడ్డుపై ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. రెండవది వాహనం కింద రిసీవర్ ప్లేట్. ఈ రోడ్డుపై ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాల అడుగు భాగంలో ఒక ప్రత్యేకమైన రిసీవర్ కాయిల్‌ను అమరుస్తారు. రోడ్డు కింద ఉన్న అయస్కాంత క్షేత్రం గుండా వాహనం వెళ్ళినప్పుడు, ఆ అయస్కాంత శక్తిని ఈ రిసీవర్ గ్రహించి, తిరిగి విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మూడోది . రియల్ టైమ్ సాఫ్ట్‌వేర్ & సెన్సార్లు. “మరి రోడ్డు మొత్తం కరెంట్ ఉంటే.. దానిపై మనుషులు నడిచినా, వేరే సాధారణ బండ్లు వెళ్లినా షాక్ కొట్టదా?” అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్! ఈ రోడ్డు కింద అత్యాధునిక సెన్సార్లు, రియల్ టైమ్ సాఫ్ట్‌వేర్ ఉంటాయి. రోడ్డుపై వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈవీ వాహనం వచ్చినప్పుడు మాత్రమే ఆ నిర్దిష్ట కాయిల్స్ యాక్టివేట్ అవుతాయి. వాహనం దాటిపోగానే కరెంట్ ఆగిపోతుంది. కాబట్టి ఇది 100% సురక్షితం! ఈ ప్రయోగం కేవలం ఏదో పేరుకు చేశారా? అంటే అస్సలు కాదు. టెస్టింగ్ సమయంలో వచ్చిన ఫలితాలు చూసి ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు నోరెళ్లబెట్టారు. ఈ A10 మోటార్‌వేపై జరిపిన పరీక్షల్లో ఈ సిస్టమ్ అత్యధికంగా 300 కిలోవాట్ల కంటే ఎక్కువ పీక్ పవర్‌ను, సగటున 200 కిలోవాట్ల శక్తిని కదులుతున్న వాహనానికి విజయవంతంగా బదిలీ చేయగలదని నిరూపితమైంది! సాధారణంగా మనం ఇళ్లలో వాడే ఫాస్ట్ ఛార్జర్లు 7kW నుండి 22kW పవర్ ఇస్తాయి. కమర్షియల్ డిసి ఫాస్ట్ ఛార్జర్లు 50kW నుండి 150kW ఇస్తాయి. కానీ ఫ్రాన్స్ తయారు చేసిన ఈ రోడ్డు కదులుతున్న వాహనానికి ఏకంగా 200kW స్థిరమైన శక్తిని ఇస్తోంది అంటే.. ఇది ఎంతటి విప్లవాత్మకమైన ఆవిష్కరణో మీరే ఊహించుకోండి! ఫ్రాన్స్ కార్ల కోసం ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేస్తే.. ఇటు వైపు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా మరో అడుగు ముందుకు వేసి, భారీ లారీలకు రన్నింగ్‌లోనే వైర్‌లెస్ ఛార్జింగ్ చేసి రికార్డు సృష్టించింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు, ఇంజినీర్లు కలిసి యూఎస్ హైవే 52/231 లోని ఒక 400 మీటర్ల రోడ్డు భాగాన్ని డైనమిక్ వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్‌గా మార్చారు. ఈ రోడ్డుపై ప్రత్యేకంగా తయారు చేసిన ‘కమిన్స్ క్లాస్ 8 ఎలక్ట్రిక్ సెమీ ట్రాక్టర్’ అనే భారీ లారీని నడిపించారు. ఆ లారీ ఏమన్నా మెల్లగా వెళ్ళిందా? లేదు! ఏకంగా గంటకు 65 మైళ్ల వేగం అంటే దాదాపు 105 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోతున్న ఆ లారీ లోపలికి రోడ్డు గుండా 190 కిలోవాట్ల విద్యుత్తు వైర్‌లెస్‌గా ట్రాన్స్‌ఫర్ అయింది! ఈ ప్రయోగంలో లారీ బ్యాటరీలోకి పంపిన విద్యుత్, సగటున 100 ఇళ్లకు సరిపడా కరెంట్‌తో సమానం! అంత భారీ విద్యుత్‌ను హైవే స్పీడ్‌లో ఒక లారీలోకి వైర్లు లేకుండా పంపడం అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదు. దీని ద్వారా ఎంతో కాలంగా సైన్స్ ఫిక్షన్ కథలకే పరిమితమైన ఈ కల.. ఇప్పుడు నిజమైంది, దీనిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం సాధ్యమే అని పర్డ్యూ పరిశోధకులు గర్వంగా ప్రకటించారు.. ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్ల వల్ల కేవలం టైమ్ సేవ్ అవ్వడమే కాదు, మానవాళికి, ఆటోమొబైల్ రంగానికి ఊహించని లాభాలు ఉన్నాయి. వాహనాల బరువు తగ్గుతుంది. సాధారణంగా లాంగ్ జర్నీ చేసే బస్సులు, లారీలకు భారీ సైజు బ్యాటరీలు కావాలి. బ్యాటరీ పెరిగితే బండి బరువు పెరుగుతుంది, మైలేజ్ తగ్గుతుంది. కానీ రోడ్డుపైనే ఛార్జింగ్ ఉంటే.. చిన్న బ్యాటరీతోనే వందల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వాహనం బరువు తగ్గి, మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది. కార్ల ధరలు తగ్గుతాయి. ఈవీ కార్లలో 40% ఖర్చు కేవలం బ్యాటరీలదే. బ్యాటరీ సైజు తగ్గితే, ఆటోమేటిక్‌గా ఎలక్ట్రిక్ కార్ల ధరలు సగానికి పైగా తగ్గిపోతాయి. సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తాయి. బ్యాటరీల తయారీకి లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన లోహాలు కావాలి. వీటి కోసం భూమిని విపరీతంగా తవ్వేస్తున్నారు. బ్యాటరీల సైజు తగ్గడం వల్ల ఈ లోహాలపై ఆధారపడటం తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఛార్జింగ్ కోసం ఎక్కడా ఆగక్కర్లేదు కాబట్టి, డ్రైవర్లు అలసిపోయే వరకు నాన్‌స్టాప్‌గా ప్రయాణాలు సాగించవచ్చు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. చూశారుగా.. ఫ్రాన్స్, అమెరికా దేశాలు భవిష్యత్తు రవాణా రంగాన్ని ఎలా మార్చబోతున్నాయో! ఒకప్పుడు రోడ్లు అంటే కేవలం వాహనాలు వెళ్లడానికి మాత్రమే ఉపయోగపడేవి. కానీ రాబోయే రోజుల్లో రోడ్లే పవర్ హౌస్‌లుగా మారబోతున్నాయి. మనం రోడ్డుపై వెళ్తుంటే పెట్రోల్ అయిపోతుందన్న భయం లేదు, ఛార్జింగ్ అయిపోతుందన్న టెన్షన్ లేదు. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ ఖరీదైనదే అయినప్పటికీ.. రాబోయే రోజుల్లో సాంకేతికత మరింత అందుబాటులోకి వస్తే, ప్రపంచవ్యాప్తంగా అన్ని హైవేలు ఇలాగే మారిపోయే అవకాశం ఉంది. మన భారతదేశంలో కూడా నితిన్ గడ్కరీ గారు “ఎలక్ట్రిక్ హైవేస్” గురించి మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో మన దేశంలో కూడా ఇలాంటి రోడ్లు వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. మూడేళ్లలో కట్టేసిన చైనా రోబోలు
కీచక భర్తకు బుద్ధి చెప్పిన భార్య..ఏం చేసిందంటే
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

