ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం.. ఉప్పు నుండి ఉక్కు వరకు రేట్లు డబుల్
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న చమురు ధరలు, రూపాయి పతనం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి వంటి కారణాలతో భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేసిన పొదుపు సూచనలు కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ఖర్చులు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఖర్చులు తగ్గించి పొదుపు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఒక బలమైన ఆర్థిక తుఫాన్ భారత్ ను కుదిపేయబోతుందా? ఏ క్షణాన్నైనా అది మన పేద, మధ్యతరగతి వర్గాలను ఊహించని రీతిలో దెబ్బతీసే ప్రమాదం ఉందా? రాబోయే రోజుల్లో రూపాయి కూడా బయట అప్పు పుట్టే అవకాశం సామాన్యులకు ఉండదా? ద్రవ్యోల్బణం పెరిగి.. ఇంటి ఖర్చులు ఆకాశాన్ని తాకబోతున్నాయా? అంటే.. నిజమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. హైదరాబాద్ సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా క్యాజువల్‌గా చెప్పిన మాటల వెనక పెద్ద మతలబే ఉందని వారు వివరిస్తున్నారు. ప్రధాని చెప్పిన 9 పొదుపు సూత్రాల్లోని ప్రతి ఒక్కటీ.. నేరుగా డాలర్‌కే కనెక్ట్ అయి ఉందని వారు గుర్తుచేస్తున్నారు. మన ఖజానాలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు మరోసారి గుర్తుచేస్తున్నారు. మరోవైపు, ఈసారి ఎల్‌నినో ప్రభావం వల్ల కరువు, వరదల ముప్పు తప్పదని వాతావరణ నిపుణులు చెబుతున్న వేళ.. ఆ ప్రకృతి విపత్తుకు ఆర్థిక విపత్తు తోడైతే.. జరగబోయే నష్టాలు ఊహకూ అందవని ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే.. అందరూ భయపడుతున్నట్లు నిజంగానే భారత్ ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తుందా? బయటకు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా..మన ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందా? అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్య యుద్ధ వాతావరణం, హార్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి ఇవన్నీ భారత ఆర్థిక భవిష్యత్తుపై నిశ్శబ్ద తుపానులా మారుతున్నాయా? మొన్నటివరకు ఎన్నికల వేళ ‘చమురుకు ఎలాంటి ఢోకా లేదు’ అని భరోసా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ప్రజలకు బంగారం కొనొద్దని, పెట్రోల్ వినియోగం తగ్గించుకోవాలని, వంటనూనెలు పొదుపుగా వాడాలని, అవసరం లేని విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచనలు చేయడం యాదృచ్ఛికం కాదు. హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక పరిస్థితిపై కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు రూపాయి విలువ పడిపోతుండటం, మరోవైపు చమురు, బంగారం, యూరియా వంటి కీలక దిగుమతుల భారం పెరుగుతుండటంతో భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తీవ్రమవుతోంది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగసిపడుతుండగా, యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన ‘వినియోగ నియంత్రణ’ విజ్ఞప్తులు కేవలం పొదుపు సూచనలు మాత్రమేనా? లేక దేశ ఆర్థికవ్యవస్థలో లోతుగా పెరుగుతున్న అసమతుల్యతకు సంబంధించిన హెచ్చరికలా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి అంటే కేవలం ఎక్స్‌ప్రెస్ హైవేలు కాదు. షేర్ మార్కెట్ రికార్డులు కాదు. బిలియనీర్ల సంఖ్య కాదు. ఒక సాధారణ కుటుంబం భయపడకుండా బతకగలగడం. పిల్లల భవిష్యత్తుపై నమ్మకం కలిగి ఉండడం. ధరలు చూసి వంటగదిలో ఆందోళన చెందకపోవడం… అదే నిజమైన అభివృద్ధి. భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ఒత్తిడిని ఎదుర్కొంటున్న వర్గం మధ్యతరగతి. ఏఐ, యుద్ధాల వంటి కారణాలవల్ల దేశంలో ఉద్యోగ భద్రత తగ్గుతోంది. ప్రైవేట్ రంగంలో వేతన వృద్ధి మందగించింది. EMIలు పెరిగాయి. పిల్లల విద్య, వైద్యం, ఇల్లు అద్దెలు.. ఇలా ప్రతిదీ భారమయ్యాయి. అందరూ భయపడుతున్నట్లు నిజంగానే ద్రవ్యోల్బణం పెరిగితే.. మొదట ప్రభావం పడేది సామాన్యుడి కొనుగోలు శక్తిపై. జీతం అదే స్థాయిలో ఉన్నా, వస్తువుల ధరలు పెరగడంతో అదే డబ్బుతో తక్కువ వస్తువులు మాత్రమే కొనగలుగుతారు. దీనివల్ల కుటుంబ ఖర్చులు పెరిగి పొదుపు తగ్గిపోతుంది. ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆహారం, ఇంధనం, అద్దె, విద్య, వైద్యం వంటి అవసరాల ధరలు పెరిగితే గృహ బడ్జెట్ కుదేలవుతుంది. ఉదాహరణకు కూరగాయలు లేదా పెట్రోల్ ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా ప్రతి కుటుంబం మీదా పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పశ్చిమాసియా సంక్షోభం వలన పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడిపోతున్న సామాన్యుడికి మరో షాక్ తగలనుందా? అవును, మీరు విన్నది నిజమే. మీ వంటింట్లో వాడే నూనె నుండి, మీరు వాడే సబ్బులు, బిస్కెట్లు, చివరకు తాగే నీళ్ల బాటిల్ వరకు.. అన్నింటి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకనున్నాయి. ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ధరలు పెంచడానికి కేవలం లాభాలు మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు వీటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అలాగే, ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ ధరలు కూడా చమురుపైనే ఆధారపడి ఉంటాయి. ముడి సరుకుల ధరలు 10% నుండి 40% వరకు పెరగడం వల్ల కంపెనీల ఉత్పత్తి వ్యయం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వల్ల విదేశాల నుండి దిగుమతి చేసుకునే సరుకులు మరింత ఖరీదయ్యాయి. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ఇప్పటికే ధరలు పెంచినప్పటికీ, భవిష్యత్తులో లాభాలను నిలబెట్టుకోవడానికి మరిన్ని మార్పులు అవసరమని కంపెనీలు యజమానులు భావిస్తున్నారు. బిస్కెట్ల ధరలు కూడా మారనున్నాయి. ఇంధనం, ప్యాకేజింగ్ ఖర్చులు 20% పెరగడంతో పలు బిస్కెట్ కంపెనీలు ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నాయి. పరిమాణం తగ్గించడం లేదా ధర పెంచడం అనే రెండు వ్యూహాలను వీరు అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సబ్బుల కంపెనీలు ఇప్పటికే 2-5% ధరలను పెంచాయి. ముడి సరుకుల భారం 8-10% వరకు ఉండటంతో, పరిస్థితి ఇలాగే ఉంటే ధరలు మళ్ళీ పెంచక తప్పదని పలు కంపెనీలు భావిస్తున్నాయి. ఫెవికాల్, ఎం-సీల్ వంటి ఉత్పత్తుల ముడి సరుకు వ్యయం 40-50% పెరగడంతో, మూడవ విడత పెంపునకు కూడా వీరు సిద్ధమవుతున్నారు. బెవరేజెస్ సంస్థలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి. ధరలు పెంచితే సామాన్యులు కొనడం తగ్గిస్తారని కంపెనీలకు తెలుసు. అందుకే వారు పెద్ద ప్యాకెట్ల ధరలు పెంచి, సామాన్యుల కోసం రూ. 5, రూ. 10 చిన్న ప్యాకెట్లను తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో ఉన్న రాయితీలు, ఆఫర్లను తగ్గించి ఖర్చులను నియంత్రిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌లో కనీసం 5% నుండి 8% అదనపు భారం పడే అవకాశం ఉంది. సబ్బులు, షాంపూలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరలు పెరగడం వల్ల పొదుపు తగ్గే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన అనిశ్చితిలో ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, డాలర్ బలపడటం — ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై భారీ ఒత్తిడిని పెంచుతున్నాయి. దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఒక దశలో 645 బిలియన్ డాలర్లను తాకగా, ఇప్పుడు వాటిపై భారీ ఒత్తిడి ఉంది. రూపాయి విలువ వరుసగా పడిపోవడం, దిగుమతి బిల్లు పెరగడం, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడటం భారత ఆర్థిక వ్యవస్థను బలహీనంగా మారుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని “ఇంధన పొదుపు” గురించి పదే పదే మాట్లాడటం యాదృచ్ఛికం కాదు. ఇది ప్రజలను రాబోయే కఠిన పరిస్థితులకు తగినట్లుగా మానసికంగా రెడీ చేయడమే ప్రపంచంలో అతి పెద్ద జనాభా ఉన్న దేశమైన భారత్ నేడు అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న దేశంగా మారుతోంది. చైనా, అమెరికా తర్వాత అతిపెద్ద చమురు దిగుమతిదారు భారత్, గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్యలో 123 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి చేసుకున్నాం. ఇటీవల అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోళ్లు తగ్గించుకోవాల్సి వచ్చింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధర పెరిగితే భారత్‌లో బస్సు ఛార్జీ పెరుగుతుంది. గ్యాస్ ధర పెరుగుతుంది. కూరగాయల రవాణా ఖర్చు పెరుగుతుంది. చివరికి సామాన్యుడి భోజనపు ఖరీదు కూడా పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థకే ఇంధనంగా ఉండే చమురు వినియోగాన్ని తగ్గించడం కష్టమే. అందుకే ఈ పొదుపు మంత్రం. ప్రధాని చెప్పారనే మాటను కాసేపు పక్కన బెడితే.. ఎవరికి వారు ఈ సంకట స్థితిలో పొదుపు పాటించకపోతే.. ఎంతో కొంత ఆర్థిక సంక్షోభం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతికి ఈ సెగ తగలడం ఖాయం. అందుకే ఖర్చులు తగ్గించుకుని, సేవింగ్స్ పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిత్యావసరాల మొదలు అన్నింటి ధరలు రాబోయే రోజుల్లో పెరిగే ప్రమాదం ఉన్న వేళ.. మన ఆర్థిక క్రమశిక్షణే మనకు శ్రీరామ రక్ష అని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Vijay: 0277′ విజయ్ కారు నెంబర్ వెనుక గుండెలు పిండేసే కథ
స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త
Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో
డైనోసార్ల కంటే ముందే పుట్టి ఇప్పటికీ బతుకుతున్న 5 జీవులు
ఈదురు గాలుల ధాటికి.. 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డ వ్యక్తి!
అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో
వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్
ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా

