Baba Vanga: బాబా వంగా చెప్పింది నిజమవుతుందా.. మారుతున్న పరిస్థితులు.. ప్రపంచాన్ని వణికిస్తున్న అంచనాలు..
ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా మెరుపు దాడులు.. మరోవైపు ఇరాన్ వీధుల్లో ఆందోళనలు.. ఇంకోవైపు సముద్రంపై రష్యాతో ముదురుతున్న యుద్ధ మేఘాలు.. ఇవన్నీ చూస్తుంటే మానవాళి మూడవ ప్రపంచ యుద్ధం ముంగిట నిలబడిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయానికి, దశాబ్దాల క్రితమే 2026లో విధ్వంసం తప్పదు అని బాబా వంగా చేసిన భయంకరమైన అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయా? అనే సందేహాలు వస్తున్నాయి.

2026 సంవత్సరం అడుగుపెట్టడమే ప్రపంచవ్యాప్త అల్లకల్లోలంతో మొదలైంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా దూకుడు, మరోవైపు ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాటు, ఇంకోవైపు రష్యా – ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు.. ఇవన్నీ చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రఖ్యాత దార్శనికురాలు బాబా వంగా 2026 గురించి చేసిన అంచనాలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.
వెనిజులాపై అమెరికా మెరుపు దాడి మదురో అరెస్ట్
జనవరి 3న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులాలో అమెరికా సైన్యం చేపట్టిన సైనిక చర్యలో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ పట్టుబడ్డారని ప్రకటించారు. 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్న వెనిజులాలో రాజకీయ పరివర్తన వచ్చే వరకు అమెరికానే ఆ దేశాన్ని నడిపిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రభుత్వం ద్వారా అమెరికాకు 50 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుతుందని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇరాన్‌లో తిరుగుబాటు – గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేసిన ట్రంప్
ఇరాన్ జాతీయ కరెన్సీ పతనం కావడంతో 31 ప్రావిన్సుల్లోని 100కు పైగా నగరాల్లో పౌరులు తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత, అంతర్జాతీయ టెలిఫోన్ లైన్ల కట్ మధ్య ఇరాన్ అట్టుడుకుతోంది. మరోవైపు డానిష్ భూభాగమైన గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేస్తానంటూ ట్రంప్ తన పాత ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
సముద్రంపై రష్యాతో ఢీ
ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యా జెండా కలిగిన చమురు ట్యాంకర్‌ని అమెరికా కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకోవడం రష్యాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ చర్య రెండు అగ్రరాజ్యాల మధ్య నేరుగా సైనిక ఘర్షణకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాబా వంగా భయంకరమైన అంచనాలు
9/11 దాడులు, కోవిడ్-19 వంటి పరిణామాలను ముందే ఊహించిన బాబా వంగా 2026ను యుద్ధం – విధ్వంసం సంవత్సరంగా అభివర్ణించారు. ఆమె అంచనాల ప్రకారం.. 2026లో ప్రపంచ దేశాల మధ్య భారీ యుద్ధం మొదలవుతుంది. తైవాన్‌పై చైనా దండయాత్ర, రెండు అగ్రరాజ్యాల మధ్య సైనిక వివాదం, 2026 నాటికి ఏఐ మానవాళిని నియంత్రించే స్థాయికి ఎదుగుతుంది. కాగా చమురు రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, అంతర్గత తిరుగుబాట్లు కలిసి ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు సాగుతున్న ఈ పరిణామాలు బాబా వంగా చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయా? లేక ప్రపంచ దేశాలు శాంతి వైపు అడుగులు వేస్తాయా? అన్నది వేచి చూడాలి.
