దొంగతనం రిటర్న్ గిఫ్ట్.. షాపులో చీరలు కొట్టేసి.. మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్!
ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఈ వింత చోరీ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దొంగతనం చేయడం ఒక ఎత్తు అయితే, చేసిన తప్పును తెలుసుకుని లేదా భయపడి తిరిగి ఆ వస్తువులను కొరియర్ చేయడం ఇక్కడ ఊహించని మలుపు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు ఒడిశా వ్యాప్తంగా వైరల్‌గా మారాయి.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన చీరల చోరీ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణకు చెందిన ముగ్గురు మహిళలు ఓ ప్రముఖ హ్యాండ్లూమ్ షాప్‌లోకి వెళ్లి ఖరీదైన చీరలను దొంగలించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే చోరీ చేసిన చీరలను మళ్లీ పార్సిల్ చేసి షాప్‌కే పంపించడం ఈ కేసులో అసలు ట్విస్ట్.
గత వారం భువనేశ్వర్‌లోని ఓ హ్యాండ్లూమ్ స్టోర్‌కు వచ్చిన ముగ్గురు మహిళలు కస్టమర్లలా నటిస్తూ గంటల పాటు షాప్‌లో తిరిగారు. ఈ సమయంలో సుమారు 7 లక్షల రూపాయల విలువ చేసే 25 ఖరీదైన చీరలను చాకచక్యంగా మాయం చేసినట్లు సమాచారం. అయితే బయటకు వెళ్లే సమయంలో అనుమానం రాకుండా కేవలం రూ.1400 విలువ చేసే ఒక కుర్తాను కొనుగోలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికే షాప్ సిబ్బంది స్టాక్‌ను చెక్ చేయగా భారీగా చీరలు మిస్సింగ్ అయినట్లు గుర్తించారు. వెంటనే షాప్ యాజమాన్యం భువనేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టోర్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. వీడియోల్లో మహిళల కదలికలు స్పష్టంగా కనిపించడంతో కేసు మరింత చర్చనీయాంశమైంది.
View this post on Instagram
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు ఒడిశా వ్యాప్తంగా వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు షేర్ అవడంతో మహిళలపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో గత శనివారం చోరీకి గురైన 24 చీరలను పెద్ద పార్సిల్ రూపంలో తిరిగి అదే హ్యాండ్లూమ్ షాప్‌కు పంపించారు. అనూహ్యంగా భారీ పార్సిల్ రావడంతో మొదట షాప్ నిర్వాహకులు ఆశ్చర్యానికి గురయ్యారు. పార్సిల్ తెరిచి చూడగా అందులో చోరీకి గురైన చీరలే ఉండటంతో అవాక్కయ్యారు. అనంతరం మహిళలు కొనుగోలు చేసిన కుర్తా బిల్‌పై ఉన్న ఫోన్ నంబర్‌కు షాప్ యజమాని కాల్ చేయగా, తెలంగాణకు చెందిన మహిళలు తమ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై భువనేశ్వర్ పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. చీరలను తిరిగి పంపించినా చోరీ కేసు నుంచి తప్పించుకోలేరని, చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.




