IV Drip: గర్బా డ్యాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ ఎక్కించుకుంటున్న యూత్!
దసరా నవరాత్రుల్లో.. తొమ్మిది రాత్రులు గర్బా ఆడుతూ ఉత్సాహంగా కనిపించేందుకు ఐవీ డ్రిప్ ట్రీట్‌మెంట్ కు యువతీ యువకులు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. విటమిన్ సి, బి-కాంప్లెక్స్, జింక్, గ్లుటాథయోన్ మిశ్రమాన్ని నరాల ద్వారా శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. తక్షణ శక్తి లభిస్తుందని, చర్మం కాంతివంతంగా కనిపిస్తుందనీ గుజరాత్ లోని బ్యూటీ క్లినిక్‌లు ఈ చికిత్సను ప్యాకేజింగ్ చేసి ఆఫర్ చేస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఐవీ డ్రిప్ తీసుకోవడం ప్రమాదకరమని స్కిన్ స్పెషలిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.

గుజరాత్‌లో నవరాత్రి వేడుకలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో గర్బా నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రాత్రివేళల్లో గంటల తరబడి నృత్యం చేయడంతో పాటు, ఫొటోలు, వీడియోల్లో అందంగా కనిపించాలని చాలా మంది ప్రత్యేకంగా రెడీ అవుతారు. కొత్త దుస్తులతో పాటు ఫేషియల్ మేకప్, స్కిన్‌కేర్ కోసం పార్లర్లలో భారీగా ఖర్చు చేస్తుంటారు. ఈసారి కొత్త దుస్తులు, మేకప్, ఫేషియల్, స్కిన్‌కేర్ వరకే ఆగడం లేదు. పోషకాలతో కూడిన ప్రత్యేక ఐవీ డ్రిప్స్ కోసం వేలల్లో ఖర్చు చేస్తున్నారు!
నవరాత్రికి ఐవీ డ్రిప్ ట్రెండ్!
తక్షణ శక్తి లభిస్తుందని, చర్మం కాంతివంతంగా కనిపిస్తుందని భావించి విటమిన్ సి, బి-కాంప్లెక్స్, జింక్, గ్లుటాథయోన్ మిశ్రమంతో ఐవీ డ్రిప్ ఎక్కించుకుంటున్నారు. 45 నిమిషాల ఒక్క సెషన్‌లొ అలసట తగ్గి, ముఖం తాజాగా కనిపిస్తుందనీ చేయించుకుంటున్నారు. ఒక్కో సెషన్‌కు రూ.4,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేస్తున్నారు. కొందరు పలు సెషన్లతో ప్రత్యేక ప్యాకేజీల ధర రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నారు. సోషల్ మీడియాలో మొదట ఈ ట్రెండ్‌ను Gen Z యువతకు సంబంధించినదిగా ప్రచారం జరిగినప్పటికీ, అహ్మదాబాద్‌లోని క్లినిక్‌లకు 30, 40 ఏళ్ల వయసున్న వారు కూడా వస్తున్నారట. కార్పొరేట్ ఉద్యోగాల్లో ఎక్కువ గంటలు పని చేయాల్సి రావడం.. రాత్రివేళల్లో గర్బా ప్రాక్టీస్ చేయడంతో నిద్ర సరిపోక అలసట పెరుగుతోంది. దీంతో సాధారణంగా తీసుకునే విటమిన్ సప్లిమెంట్లకు బదులుగా ఐవీ డ్రిప్స్‌ను ఎంచుకుంటున్నారు.
డాక్టర్ల హెచ్చరిక.. సరదాగా తీసుకోవద్దు!
ఐవీ డ్రిప్స్‌కు డిమాండ్ పెరగడంతో వైద్య నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఐవీ డ్రిప్స్ అనేవి సాధారణ బ్యూటీ ట్రీట్‌మెంట్లు కావు. వైద్యుల సూచనల తర్వాతే ఉపయోగించాలనీ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ కింజల్ మెహతా అన్నారు. అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉండే మిశ్రమాలను తీసుకోవడం ప్రమాదకరమని వీటి వల్ల అలర్జీ, శరీరంలో ద్రవాలు అధికంగా చేరడం, కాలేయంపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. శరీరంలో పోషకాల లోపం ఉందో లేదో తెలుసుకోకుండా కేవలం అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఇలాంటి చికిత్సలు తీసుకోవడం సరికాదని సూచిస్తున్నారు. సాధారణ అలసటకు తగిన నిద్ర, సమతుల ఆహారం, తగినంత నీరు తీసుకోవడం మంచిదనీ తెలిపారు.
పెరుగుతున్న కండోమ్‌ల అమ్మకాలు
నవరాత్రుల సమయంలో గుజరాత్‌లో గార్బా, దాండియా వేడుకలు అంబరాన్ని తాకుతాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివస్తుంది. రాత్రి పొద్దుపోయే వరకు సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. పండుగ వాతావరణం యువతకు స్నేహితులతో గడిపేందుకు, స్వేచ్ఛగా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇదే సమయంలో కండోమ్‌ల అమ్మకాలు పెరుగుతున్నట్లు కొన్ని కంపెనీలు గత కొన్నేళ్లుగా ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్‌లో జరిగే గార్బా, దాండియా ఈవెంట్స్ చాలా వరకు టికెట్ల విక్రయాల ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలంటే ఈవెంట్‌ను బట్టి రూ.2 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో నిర్వాహకులకు ఈ కార్యక్రమాలు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే ఈ వేడుకల ప్రభావం డ్యాన్స్, వినోదానికే పరిమితం కావడం లేదనే చర్చ కూడా సాగుతోంది. నవరాత్రుల సమయంలో యువతలో సన్నిహిత సంబంధాలు పెరగడం, సురక్షిత శృంగారం కోసం కండోమ్‌ల వినియోగం వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి.