Social Media: మీకు తెలుసా! సోషల్ మీడియాలో ఈ కంటెంట్ షేర్ చేస్తున్నారా? అయితే మీరు జైలుకెళ్లాల్సిందే!
గతంలో సోషల్ మీడియా లేదా పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సామాన్యులపైనా, పలువురు పెద్ద పెద్ద వ్యక్తులపైనా చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు.
ఇండియాలో సోషల్ మీడియాలో బిగ్ రోల్ పోషిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జీరోను హీరోగా మార్చాలన్నా.. హీరోను జీరోగా మార్చాలన్నా సామాన్యులకు ఇప్పుడు సోషల్ మీడియానే ఆయుధంగా మారింది. అయితే కొంతమంది మాత్రమే ఈ సోషల్ మీడియాను ఉపయోగించి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇటీవల బీజేపీ బహిష్కరణ నేత నూపూర్ శర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ప్రకటన దేశవ్యాప్తంగానే కాదు.. ఇతర దేశాల్లోనూ తీవ్ర దుమారాన్ని రేపుతోన్న సంగతి తెలిసిందే. కొంతమంది ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో సోషల్ మీడియా లేదా పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సామాన్యులపైనా, పలువురు పెద్ద పెద్ద వ్యక్తులపైనా చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. భారతీయ చట్టాల ప్రకారం, ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. కానీ ఇతర వ్యక్తుల హక్కుల దృష్ట్యా.. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొచ్చు. ఎటువంటి పోస్ట్‌లు పెట్టకూడదు. సామాజిక మాధ్యమాల్లో మీ అభిప్రాయాలను వ్యక్తపరిచేటప్పుడు.. ఏ విషయాలను గుర్తించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో సోషల్ మీడియాను ఎంతమంది వాడుతున్నారు.?
గత ఏడాది భారత ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, భారతదేశంలో 53 కోట్ల మంది వాట్సాప్, 448 మిలియన్ల యూట్యూబ్, 41 కోట్ల మంది ఫేస్‌బుక్, 21 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్, 1.75 కోట్ల మంది ట్విట్టర్ యూజర్లు ఉన్నారు.
ఇలాంటివి పోస్ట్ చేయకూడదు.?
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయాలన్న దానిపై భారతీయ చట్టాల్లో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. సోషల్ మీడియాలో మీరు ఏదైనా అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినట్లయితే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం దోషిగా గుర్తించబడతారు. ఈ చట్టం కిందకు యూజర్లు, సోషల్ మీడియా కంటెంట్ ప్రొవైడర్లు, నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లు మొదలైనవారు వస్తారు.
పౌరులందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేఛ్చ, వాటిని వ్యక్తపరిచేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చునని ఆర్టికల్ 19(1)(A) చెబుతోంది. కానీ, ఆ స్వేచ్చకు ఓ పరిమితి ఉంది. అది ఇతర చట్టాలను ఉల్లంఘించకూడదు. ఉదాహరణకు, మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్.. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసినట్లయితే, లేదా రెండు సంఘాల మధ్య ద్వేషాన్ని సృష్టిస్తే లేదా నిర్దిష్ట సంఘంలో ఉద్రిక్తతను కలిగిస్తే, చట్ట ప్రకారం మీపై చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అభ్యంతరకరమైన కంటెంట్, ఇన్ఫ్లమేటరీ కంటెంట్ లేదా వర్గాల మధ్య ద్వేషాన్ని సృష్టించే కంటెంట్‌ను షేర్ చేయకూడదు.
ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినట్లయితే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 67 ప్రకారం చర్యలు తీసుకుంటారు. అందుకే సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదని చెబుతారు. అభ్యంతరకరమైన పదజాలం, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, ఇతరుల గౌరవాన్ని భంగం కలిగించేందుకు ప్రయత్నించినా.. ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసినా.. ఏ వర్గానికి వ్యతిరేకమైనా, పుకార్లు కావచ్చు, ఎవరినైనా చంపేస్తానని బెదిరించడం, అశ్లీలమైన కంటెంట్, పిల్లల అశ్లీలత… ఇలాంటి వాటికి సంబంధించిన పోస్టులు ఏవైనా చేస్తే.. కచ్చితంగా జైలుకెళ్లాల్సి వస్తుంది.
భారతదేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం, సైబర్ క్రైమ్ నేరం కింద పరిగణలోకి తీసుకుంటారని మీకు తెలుసా.? ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు ఉంటుంది లేదా ఒక లక్ష నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఒక్కోసారి రెండు శిక్షలు పడతాయి.