El Nino: వినాశకరంగా ఎల్ నినో ప్రభావం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి సూపర్ ఎల్ నినోపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా మార్చగల ఈ ముప్పు, గ్లోబల్ వార్మింగ్ తో కలిసి తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్‌లో రుతుపవనాలను బలహీనపరచి, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉంది.

ఐక్యరాజ్యసమితి (UN) రాబోయే కొద్ది వారాల్లో ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా మార్చేయగల “సూపర్ ఎల్ నినో” ముంచుకొస్తోందని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఈ ఎల్ నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి, ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ మార్పులను తీసుకురావచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది.
ఎల్ నినో అంటే ఏమిటి?
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటారు. శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో నీటి ఉష్ణోగ్రతలు ఏకంగా 6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఆ మహాసముద్రంలో భారీ ఉష్ణ తరంగాలు తూర్పు వైపుగా వేగంగా కదులుతున్నాయి. రాబోయే రోజుల్లో అతిపెద్ద వాతావరణ ముప్పును ఎదుర్కోబోతున్నామని కచ్చితంగా చెప్పగలమని, ఇది బహుశా రికార్డు స్థాయి ఎల్ నినో కావచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాలు
వాతావరణ మార్పులతో ఇప్పటికే మండిపోతున్న ప్రపంచంపై ఈ ఎల్ నినో ఆజ్యం పోస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. దీని ప్రభావాలు సరిహద్దులు దాటి మరీ వేగంగా వ్యాపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా తీవ్రమైన ఎల్ నినో ఏర్పడినప్పుడు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు తలెత్తుతాయి. దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువులు, కార్చిచ్చులు సంభవిస్తాయి. అదే సమయంలో, అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా నీటి వనరులు, ఉష్ణోగ్రతలు, తీవ్ర వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుంది.
భారత్‌పై ఎల్ నినో ప్రభావం
ముఖ్యంగా భారత్ విషయానికొస్తే, ఎల్ నినో కారణంగా రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. దీనివల్ల వర్షపాతం బాగా తగ్గిపోతుంది, ఫలితంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పంట దిగుబడులు తగ్గిపోవడం, ఆహార ధరలు ఆకాశాన్ని తాకడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. సప్లై చైన్ దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్ నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఈ ఎల్ నినో దెబ్బకు వచ్చే 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రపంచ దేశాలకు పెద్ద సవాలును విసురుతోంది.
పాములకు శత్రువు.. అడవుల యోధుడు.. ముంగిస గురించి ఆసక్తికర విషయాలు
