Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్ట్ ఇన్ స్పేస్ – అంతరిక్షంలోకి మనుషుల చితాభస్మాలు

రెస్ట్‌ ఇన్ పీస్..అందిరికి తెలిసిందే. కానీ రెస్ట్ ఇన్ స్పేస్ మీరు విన్నారా.? అంతరిక్షంలో అంతిమయాత్ర సాధ్యమేనా ? అసలు కలలో కూడా ఊహించగలమా ? మామూలుగా మనిషి చనిపోయాక ఖననమో, దహనమో చేస్తాం. తర్వాత చితాభస్మాలను మత సంప్రదాయాల ప్రకారం నదిలో కలిపి శ్రద్ధాంజలి ఘటిస్తాము. ఇలా ఎవరి సంప్రదాయంలో వారు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు. కానీ అంతరిక్షంలో కలిపితే...ఎలా ఉంటుంది. కలలో కూడా సాధ్యమేనా అనుకుంటున్నారు కదూ..కానీ ఆ కలలను కూడా నిజం చేసేస్థాయిలో ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది.

రెస్ట్ ఇన్ స్పేస్ - అంతరిక్షంలోకి మనుషుల చితాభస్మాలు
Space Capsule
Ram Naramaneni
|

Updated on: Jul 06, 2025 | 7:01 PM

Share

అంతరిక్షం అంచును తాకే లెవల్లో నెక్ట్స్ లెవల్ ఆలోచనలతో మన సైంటిస్టులు విజయాలు సాధిస్తున్నారు. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ కథలను నిజం చేసేందుకు ఓ అద్భుత ప్రయోగం జరిగింది. అదే రెస్ట్‌ ఇన్ స్పేస్. స్పేస్ బరియల్. అంతరిక్షంలో అంతిమయాత్ర. కాకుంటే చివరి నిమిషంలో యాత్ర ఫెయిలైంది. కానీ అది పూర్తిగా సఫలమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని నిరూపించింది సెలెస్టిస్ మెమోరియల్ స్పేస్ ఫ్లైట్స్ అనే సంస్థ.

సెలెస్టిస్ మెమోరియల్ స్పేస్‌ఫ్లైట్స్ అనే సంస్థ గత కొన్నేళ్లుగా చితా భస్మాలను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపే సేవలను అందిస్తోంది. అంతరిక్ష అన్వేషణ పట్ల ఆసక్తి ఉన్నవారి కలలను నెరవేర్చేందుకు ఒక చెంచా భస్మాలను అంతరిక్షంలోకి పంపుతుంది. మిగిలిన భస్మాలను సముద్రంలో లేదా లాంచ్ సైట్ వద్ద గాల్లో కలిసేలా ఏర్పాటు చేస్తుంది. కాకుంటే ఫ్రీగా కాదు. చాలా కాస్ట్లీ. మినిమం 4 లక్షల నుంచి 12 లక్షల వరకు చార్జ్ చేస్తుంది.

గత నెల 23న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 166 మంది చితాభస్మాలతో పాటు మార్టియన్ గ్రో ప్రాజెక్ట్ కోసం కానబిస్ గింజలు, అంటే గంజాయి గింజలను మోసుకెళ్లింది. భూమి కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. కానీ రీఎంట్రీ సమయంలో కమ్యూనికేషన్ తెగింది. స్ప్లాష్‌డౌన్‌కు కొన్ని నిమిషాల ముందు, పారాచూట్ విఫలమై, క్యాప్సూల్ పసిఫిక్ సముద్రంలో కూలిపోయింది. ఎంతో ఆశగా ప్రయోగం విజయవంతమవుతుందని భావించిన 166 మంది కుటుంబసభ్యులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఇది పాక్షిక విజయం సాధించింది కానీ.. పూర్తిగా నెరవేర్చలేకపోయినందకు చింతిస్తున్నామని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రయోగం విఫలమైనా స్పేస్ బరియల్ కొనసాగిస్తామని సెలెస్టిస్ ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా స్పేస్ బరియల్‌ పై ప్రయోగాలను చేస్తోంది సెలెస్టిస్. అంతరిక్షంలో ప్లేస్‌ను బట్టి ధరలను నిర్ణయించింది.

  • 1. ఎర్త్‌రైజ్ సేవలు-ధర రూ.4.27లక్షలు:  ఇది ఎంపిక చేసుకుంటే భస్మాలు అంతరిక్షంలోకి తీసుకుని వెళ్తుంది..మళ్లీ సేఫ్‌గా భూమికి చేర్చుతుంది.
  • 2. ఎర్త్‌ ఆర్బిట్ సేవలు-ధర రూ.5.27లక్షలు: ఈసర్వీస్ ఎంపిక చేసుకుంటే అస్తికల క్యాప్సూల్ భూమి చుట్టూ కక్ష్యలో తిరిగి చివరకు వాతావరణంలో బర్న్‌ అయ్యేలా చేస్తుంది
  • 3. లూనా సర్వీస్-ధర రూ.10.69లక్షలు: ఈసర్వీస్‌లో అస్తికలు చంద్రునిపై శాశ్వతంగా నిలిచిపోయేలా ఏర్పాటు చేస్తారు.
  • 4. వాయేజర్ సర్వీస్-ధర రూ.11లక్షలు: ఈసర్వీస్‌లో స్పేస్‌లోకి భస్మాలను పంపిస్తారు. అవి నక్షత్రాల మధ్యే శాశ్వతంగా ఉండిపోయేలా సెట్ చేస్తారు.

ఇలా నాలుగు ఎంపికల ద్వారా సెలెస్టిస్ స్పేస్ బరియల్ సర్వీస్‌ అందిస్తోంది. దీనికి అమెరికాలో ఫుల్ క్రేజ్ ఉంది. చాలామంది ఫ్యామిలీస్ తమ కుటుంబీకుల కోసం ఈ తరహా అంతిమ సంస్కారం నిర్వహించాలని యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఓ ట్రెండ్‌లా నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఎవరు ఏ సర్వీస్ కావాలో ఎంపిక చేసుకున్న తర్వాత సెలెస్టిస్ బృందం లాంచ్ తేదీ, డిజిటల్ స్మారకం వంటి వివరాలను అందిస్తారు. కుటుంబ సభ్యులు లాంచ్ సమయంలో మూడు రోజుల స్మారక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, లేదా లైవ్ బ్రాడ్ కాస్ట్‌ ద్వారా చూడొచ్చు.