వందలు, వేలు కాదు లక్షలే.. బాబోయ్ కేజీ మామిడి పండ్ల ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
సామాన్యంగా మార్కెట్‌కు వెళ్తే కిలో మామిడి పండ్లు 60 నుండి 100 రూపాయలకు దొరుకుతాయి. బాగా కాస్ట్లీ రకం అయితే ఒక రెండు వందలు పెడతాం. కానీ కేవలం ఒక్క కిలో మామిడి పండ్ల ధర ఏకంగా 3 లక్షల రూపాయలు అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది అక్షరాలా నిజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ విదేశీ మామిడిని ఇప్పుడు మన దేశంలోనే ఒక సామాన్య రైతు పండించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ వివరాలు తెలుసుకుందాం..

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. మార్కెట్‌లో రకాన్ని బట్టి కిలో మామిడి పండ్లు 60 రూపాయల నుండి 200 రూపాయల వరకు లభిస్తాయి. సీజన్ కాబట్టి కొంచెం తక్కువ ధరకే దొరుకుతాయి. కానీ కేవలం ఒక్క కిలో మామిడి పండ్ల ధర ఏకంగా 3 లక్షల రూపాయలు అంటే మీరు నమ్మగలరా? అమ్మో.. బంగారాన్ని మించిపోయిందని ముక్కున వేలేసుకుంటారు కదూ.. అయితే ఇది అక్షరాలా నిజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ప్రత్యేక రకం మామిడిని ఇప్పుడు మన దేశంలో అదీ ఒక సామాన్య రైతు పండించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఒడిశా రైతు అద్భుత ప్రయోగం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచిన జపనీస్ రకం మామిడి మియాజాకిని ఒడిశాకు చెందిన ఒక రైతు తన తోటలో విజయవంతంగా పండించాడు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన దేబా భాటియామి అనే రైతు ఈ అరుదైన ఘనత సాధించాడు. సాధారణంగా జపాన్ వాతావరణంలో పండే ఈ రకాన్ని, ఒడిశాలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దేబా ఎంతో జాగ్రత్తగా పెంచాడు.
మొక్క వెనుక ఉన్న కథ
రైతు దేబా భాటియామి నాలుగేళ్ల క్రితం ఒక సామాజిక కార్యకర్త నుండి ఈ ప్రత్యేకమైన మామిడి మొక్కను కొనుగోలు చేశాడు. అప్పటి నుండి ఆ మొక్కను ఒక చిన్న బిడ్డలా ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. ఆయన పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. ఆ చెట్టుకు కాసిన ఎర్రటి మియాజాకి మామిడి పండ్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
తోటకు పోటెత్తుతున్న జనం.. రైతుకు దొంగల భయం
ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ మామిడి పండ్లు ఒడిశా మట్టిలో పండాయనే వార్త తెలియగానే, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పర్యాటకులు దేబా తోటను చూడటానికి పోటెత్తుతున్నారు. చెట్టుకు కాసిన ఆ అపురూపమైన పండ్లను చూసి అందరూ మురిసిపోతున్నారు. అయితే ఇంత క్రేజ్ రావడంతో రైతు దేబాకు కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. ఎక్కడ రాత్రి పూట ఎవరైనా వచ్చి ఈ ఖరీదైన మామిడి పండ్లను దొంగిలిస్తారేమోననే భయం పట్టుకుంది. అందుకోసం ఆయన ప్రతిరోజూ రాత్రి, పగలు తేడా లేకుండా ఆ మామిడి చెట్టు కిందే కూర్చుని గట్టి కాపలా కాస్తున్నాడు.
పుచ్చకాయలు, పనసలు, మామిడి పండ్లతో అలరించే ఈ వేసవిలో.. ఈ 3 లక్షల రూపాయల మియాజాకి మామిడి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక సామాన్య రైతు పట్టుదలతో విదేశీ పంటను మన దేశంలో పండించడం నిజంగా అభినందనీయం.
