బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. 10 నిమిషాల పాటు చర్చలు.. ఏం మాట్లాడారంటే…
తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సరళిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
GHMC_ELECTIONS : తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సరళిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లు బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం.. దాదాపు 10 నిమిషాల పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై, పార్టీ పరిస్థితులపై సంజయ్‌తో ప్రధాని ముచ్చటించారు. కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని అభినందించారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను మోదీ కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడుచుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ధైర్యంగా ముందుకు సాగాలని, అన్ని విధాలా అండగా ఉంటామని బండి సంజయ్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
దుబ్బాక గెలుపు తర్వాత నూతనోత్తేజంతో ఉన్న రాష్ట్ర బీజేపీ శ్రేణులు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని బీట్ చేస్తూ ప్రచార పర్వాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కేంద్ర అధినాయకత్వాన్ని సైతం ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికల స్థాయిలో ప్రచారం నిర్వహించి బల్దియా ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఏదిఏమైనా బల్దియా పీఠం తమదే అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తాయంటున్నారు. మరి దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా? ఏం జరుగబోతోంది? అనేది తెలియాలంటే 4వ తేదీ సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.