ఏలియన్స్ నిజంగా ఉన్నారా..? సీక్రెట్ ఫైల్స్ విడుదల చేస్తున్న అమెరికా..
విశ్వంలో మనం ఒంటరివాళ్లమేనా? గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఊరిస్తున్న ఈ మిస్టరీపై అమెరికా ప్రభుత్వం చిక్కుముడి విప్పబోతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు.. అత్యంత రహస్యంగా దాచిపెట్టిన UFO ఫైళ్లను పెంటగాన్ విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈ ఫైళ్లు.. గెలాక్సీ రహస్యాలపై ఎలాంటి నిజాలను బయటపెట్టబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఊరిస్తున్న గ్రహాంతరవాసులు, గుర్తించబడని ఎగిరే వస్తువుల మిస్టరీపై అమెరికా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. పెంటగాన్ వద్ద దశాబ్దాలుగా దాగి ఉన్న అత్యంత రహస్యమైన UFO ఫైళ్లను బహిర్గతం చేయడం ప్రారంభించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు పారదర్శకత మంత్రంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ప్రెసిడెన్షియల్ అన్‌సీలింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫర్ యూఏపీ ఎన్‌కౌంటర్స్ అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ఫైళ్లను విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి తెచ్చారు. గత ప్రభుత్వాలు ఇటువంటి ఘటనలను దాచిపెట్టి అమెరికన్లను నిరుత్సాహపరిచాయని, కానీ ఇప్పుడు ప్రజలే స్వయంగా చూసి ఒక నిర్ణయానికి రావాలని పెంటగాన్ పేర్కొంది.
రంగంలోకి దిగ్గజ ఏజెన్సీలు
కేవలం పెంటగాన్ మాత్రమే కాకుండా అమెరికాలోని టాప్ ఏజెన్సీలన్నీ ఈ ఫైళ్ల సేకరణలో పాలుపంచుకుంటున్నాయి.
NASA: అంతరిక్ష పరిశోధనా సంస్థ.
FBI: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.
AARO: ఆల్-డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్.
వీటితో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ ఫైళ్లను క్రమంగా విడుదల చేయనున్నాయి.
ట్రంప్ ఇచ్చిన హామీ.. నెరవేరిన వేళ
ఫిబ్రవరి 19న తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. “గ్రహాంతరవాసులు, యూఏపీ, యూఎఫ్ఓ లకు సంబంధించిన అన్ని రహస్యాలను బయటపెట్టమని యుద్ధ కార్యదర్శిని ఆదేశిస్తున్నాను” అని ఆయన తెలిపారు. ప్రజలు చూపిన అపారమైన ఆసక్తిని గౌరవిస్తూ, ఈ ఆసక్తికరమైన విషయాలను దాచకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే JFK, మార్టిన్ లూథర్ కింగ్ హత్యల ఫైళ్లను విడుదల చేసిన ట్రంప్ సర్కార్, ఇప్పుడు ఈ గెలాక్సీ రహస్యాలపై దృష్టి సారించింది.
అంతా నిజం కాకపోవచ్చు
ఈ ఫైళ్లు విడుదలవుతున్న తరుణంలో రక్షణ రంగ నిపుణులు ఒక సూచన చేస్తున్నారు. సైనిక విమానాలు లేదా అధునాతన సాంకేతిక వ్యవస్థల గురించి అవగాహన లేని వారు, సాధారణ వైమానిక దృశ్యాలను కూడా UFOలుగా పొరబడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. పెంటగాన్ కూడా గతంలో చేసిన సమీక్షలో.. ఇప్పటివరకు గ్రహాంతర జీవుల ఉనికిని ధృవీకరించే బలమైన సాక్ష్యాలేవీ దొరకలేదని తెలిపింది. ఏది ఏమైనా, దశాబ్దాలుగా మూసి ఉన్న తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. పెంటగాన్ విడుదల చేసే ఈ కొత్త ఫైళ్లు విశ్వంలో మనం ఒంటరివాళ్లమా? లేక మనకు తోడుగా మరెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తాయేమో వేచి చూడాలి.
