AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి

ప్రస్తుతం భారత రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. టాటా, మహీంద్రా వంటి పెద్ద సంస్థలు ఈవీలను తీసుకొస్తున్నా, అసలు ఈ విప్లవానికి పునాది 25 ఏళ్ల క్రితమే పడింది. ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందిన 'రేవా' (Reva), 2001లో వినియోగదారుల ముందుకు వచ్చి చరిత్ర సృష్టించింది. ఆ కారుకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం

ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే..! 25 ఏళ్ల జర్నీ వెనుక ఎన్నో నిజాలు.. అవేంటి
Reva
Nikhil
|

Updated on: Jul 22, 2026 | 6:00 AM

Share

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేని రోజుల్లోనే, చేతన్ మైని దూరదృష్టితో ‘రేవా’ను రూపొందించారు. నగర ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా, పర్యావరణహితంగా ఈ కారును తయారు చేశారు. అప్పట్లో తగినంత సబ్సిడీ లేకపోయినా, 24 దేశాలకు ఎగుమతి అయ్యి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. భారత ఆటోమొబైల్ రంగానికి కొత్త దిశను చూపిన ఆ తొలి ఎలక్ట్రిక్ కారు విశేషాలను, ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం!

ఈవీలకు శ్రీకారం చుట్టిన చేతన్ మైని

రేవా వ్యవస్థాపకుడు చేతన్ మైని, అప్పట్లోనే భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని గట్టిగా నమ్మారు. నగరాల్లో తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం, పర్యావరణానికి మేలు చేసే వాహనం అవసరమని గుర్తించి ఈ కారును రూపొందించారు. ఆ సమయంలో ఛార్జింగ్ స్టేషన్లు లేవు, ఈవీ టెక్నాలజీకి అవసరమైన సరఫరా వ్యవస్థ లేదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, అన్ని సవాళ్లను ఎదుర్కొని ఈ కారును అభివృద్ధి చేయడం సాహసోపేతమైన విషయం.

రేవా ప్రత్యేకతలు

రేవా పూర్తిగా నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు ఉన్నప్పటికీ, రోజువారీ అవసరాలకు ఇది సరిపోతుందని భావించేవారు. ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే సదుపాయం, తక్కువ మెయింటెనెన్స్ మరియు చిన్న పరిమాణం ఉండటం వల్ల పార్కింగ్‌కు ఎంతో సులభంగా ఉండేది.

సవాళ్లు, వారసత్వం

అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో, రేవా ధర పెరిగి అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. అయినప్పటికీ, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఛార్జర్లను దేశీయంగానే అభివృద్ధి చేయడంలో రేవా సంస్థ అద్భుత విజయాన్ని అందుకుంది. మహీంద్రా సంస్థ రేవాను కొనుగోలు చేసిన తర్వాత, ఆ టెక్నాలజీ ఆధారంగానే తన ప్రస్తుత ఈవీలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.

రేవా ఆధునిక ఈవీలతో పోలిస్తే సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లిన మొదటి కారుగా చరిత్రలో నిలిచిపోయింది. చేతన్ మైని రేవాను మళ్లీ తీసుకొచ్చే ఆలోచన లేదని చెప్పినా, భవిష్యత్తులో అవకాశం వస్తే కాదనబోనని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఒక చిన్న కారుగా మొదలై, భారత ఈవీ ప్రయాణానికి పునాది వేసిన ‘రేవా’ ప్రస్థానం ఆటోమొబైల్ చరిత్రలో ఎప్పటికీ ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయంగా మిగిలిపోతుంది

Follow Us