సిమ్ కార్డ్ డిజైన్ వెనుక ఉన్న టెక్నికల్ సీక్రెట్ తెలుసా: ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిన విషయం
మనం నిత్యం వాడే స్మార్ట్‌ఫోన్లలోని సిమ్ కార్డులను గమనిస్తే, ఒకవైపు మూల కట్ చేసి ఉంటుంది. ఇది కేవలం డిజైన్ అనుకుంటే పొరపాటే! దీని వెనుక మొబైల్ యూజర్ల సౌకర్యం కోసం రూపొందించిన ఒక అద్భుతమైన టెక్నికల్ లాజిక్ ఉంది. అసలు సిమ్ కార్డును ఎందుకు అలా కట్ చేస్తారు? ఆ చిన్న కట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం!

మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో, సిమ్ కార్డులను తప్పుగా పెట్టడం వల్ల చాలామందికి సిమ్ స్లాట్స్, చిప్ డ్యామేజ్ అయ్యేవి. ఈ గందరగోళానికి చెక్ పెట్టేందుకు టెలికాం కంపెనీలు ఈ ‘కట్’ డిజైన్‌ను తీసుకొచ్చాయి. ఒక చిన్న కట్ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్ల పనిని ఎంత సులభతరం చేసిందో, ఈ ‘పూల్ ప్రూఫింగ్’ డిజైన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన హిస్టరీ తెలుసుకుందాం!
గందరగోళానికి బ్రేక్
మొదట్లో వచ్చిన సిమ్ కార్డులు పూర్తిగా చతురస్రాకారంలో ఉండేవి. నాలుగు మూలలు సమానంగా ఉండటంతో, సిమ్ కార్డును ఏ వైపు తిప్పి ఫోన్‌లో పెట్టాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడేవారు. సిమ్ కార్డును తిరగేసి పెట్టడం వల్ల ఫోన్‌లోని సిమ్ స్లాట్లు విరిగిపోవడం, గోల్డ్ చిప్ దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రీసెర్చ్ కంపెనీలు ఒక సింపుల్ ఐడియాను అమలు చేశాయి.
మిస్టేక్ ప్రూఫింగ్
సిమ్ కార్డు ఒక మూలన కొద్దిగా కట్ చేయడం వల్ల, యూజర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ కట్ ఉన్న భాగాన్నే స్లాట్‌కు అనుగుణంగా ఇన్సర్ట్ చేయడం మొదలుపెట్టారు. దీన్నే టెక్నికల్ భాషలో ‘పూల్ ప్రూఫింగ్’ లేదా ‘మిస్టేక్ ప్రూఫింగ్’ అంటారు. అంటే, ఎవరూ పొరపాటున కూడా తప్పు చేయకుండా డిజైన్ ద్వారానే గైడ్ చేయడం అన్నమాట. సిమ్ కార్డు ట్రై కూడా అదే విధంగా డిజైన్ చేయబడటంతో, చిన్న పిల్లలు లేదా కంటి చూపు సమస్య ఉన్నవారు కూడా సులభంగా స్పర్శతో గుర్తించి సిమ్ పెట్టగలుగుతున్నారు.
క్రెడిట్ కార్డ్ సైజ్ నుంచి నానో సిమ్ వరకు
1991లో మొట్టమొదటి సిమ్ కార్డు సైజ్ ఏటీఎం కార్డు అంత పెద్దగా ఉండేది. కాలక్రమేణా మొబైల్ ఫోన్ల సైజు తగ్గడంతో, సిమ్ కార్డులు కూడా మినీ, మైక్రో, ప్రస్తుతం వాడుతున్న ‘నానో సిమ్’ స్థాయికి చేరుకున్నాయి. సైజ్ ఎంత మారినా, ఆ ఒక మూల కట్ చేసే పద్ధతి మాత్రం దశాబ్దాలుగా అలాగే కొనసాగుతోంది.
ప్రస్తుతం ‘ఇ-సిమ్’ (e-SIM) టెక్నాలజీతో ఫిజికల్ సిమ్ కార్డుల అవసరం తగ్గుతున్నప్పటికీ, మొబైల్ సాంకేతికత చరిత్రలో ఈ చిన్న కట్ ఒక గొప్ప ఆవిష్కరణగా నిలిచిపోతుంది. ఒక చిన్న డిజైన్ మార్పు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజర్ల కష్టాన్ని తీర్చి, స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని ఎంత సులభం చేసిందో కదా
