ల్యాప్‌టాప్ ధరతో కారు కొనేయొచ్చా? Dell XPS 16 Creator Editionతో ఎడిటర్స్‌కు పండగే
ప్రముఖ టెక్నాలజీ సంస్థ Dell భారత మార్కెట్లో మరో ప్రీమియం ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. Dell XPS 16 Creator Edition పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, AI నిపుణులు, ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇందులో అత్యాధునిక NVIDIA RTX Spark ప్లాట్‌ఫామ్, శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యం, 3.2K Tandem OLED టచ్‌స్క్రీన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. Blender, DaVinci Resolve, Adobe Photoshop వంటి హెవీ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

భారీ AI మోడళ్లను రన్ చేయడం, 3D డిజైనింగ్, 8K వీడియో ఎడిటింగ్ వంటి క్లిష్టమైన పనులను నిర్వహించేలా Dell XPS 16 Creator ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ప్రీమియం ఫీచర్లకు అనుగుణంగానే దీని ధరను కూడా నిర్ణయించారు. భారత మార్కెట్లో Dell XPS 16 Creator Edition ప్రారంభ ధర రూ.4,49,990గా ఉంది. ప్రస్తుతం Dell అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. డిసెంబర్ మధ్య నాటికి Dell ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఇతర రిటైల్ దుకాణాలు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోనూ లభించనుంది.
NVIDIA RTX Spark ప్లాట్‌ఫామ్
ఈ ల్యాప్‌టాప్‌లో 16 అంగుళాల 3.2K Tandem OLED టచ్‌స్క్రీన్‌ను అందించారు. ఇది 20Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 1,000 నిట్స్ బ్రైట్‌నెస్, VESA DisplayHDR True Black 600 సర్టిఫికేషన్ ఉన్నాయి. 100 శాతం DCI-P3 కలర్ గామట్ కవరేజ్, Delta E 2 కంటే తక్కువ కలర్ అక్యురసీ, Pantone Validated సర్టిఫికేషన్ కూడా ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ఫోటో ఎడిటింగ్, వీడియో కలర్ గ్రేడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి పనులకు ఈ డిస్‌ప్లే ఉపయోగపడుతుంది.
పనితీరు విషయానికి వస్తే.. ఇందులో NVIDIA RTX Spark ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. Blackwell ఆర్కిటెక్చర్ ఆధారిత RTX GPU, Grace CPU ఇందులో ఉన్నాయి. GPUలో గరిష్ఠంగా 6,144 కోర్లు, Grace CPUలో 20 కోర్ల వరకు ఉంటాయి. అలాగే 128GB వరకు యూనిఫైడ్ మెమరీ, 2TB వరకు TLC NVMe M.2 PCIe Gen 5 SSD స్టోరేజ్‌కు సపోర్ట్ ఉంది. Real-Time Ray Tracing, DLSS టెక్నాలజీ, హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ 4:2:2 వీడియో ఎన్‌కోడింగ్, డీకోడింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
AI టూల్స్‌కు సపోర్ట్..
సాఫ్ట్‌వేర్ పరంగా GitHub Copilot, Claude Code, ComfyUI, Cursor వంటి AI, డెవలప్‌మెంట్ టూల్స్‌కు ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుంది. Blender, DaVinci Resolve, Adobe Photoshop, Adobe Premiere వంటి క్రియేటివ్ అప్లికేషన్లను కూడా ఉపయోగించుకోవచ్చు. కనెక్టివిటీ కోసం మూడు USB4 Type-C పోర్టులు, DisplayPort 2.1, Power Delivery సపోర్ట్, HDMI 2.1b పోర్ట్, ఫుల్ సైజ్ కార్డ్ రీడర్, యూనివర్సల్ ఆడియో జాక్ అందించారు. ఒకేసారి మూడు ఎక్స్‌టర్నల్ మానిటర్లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా USB-C పోర్ట్ ద్వారా ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేయవచ్చు.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 99Wh బ్యాటరీని అందించారు. బాక్స్‌లో 130W USB Type-C ఛార్జర్ లభిస్తుంది. పూర్తిగా అల్యూమినియంతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ బాడీ మందం కేవలం 17.8 మిల్లీమీటర్లు మాత్రమే. ప్రారంభ ఆఫర్లలో భాగంగా అర్హత కలిగిన Axis Bank, ICICI Bank కార్డులపై గరిష్ఠంగా రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. మొత్తంగా భారీ AI పనులు, ప్రొఫెషనల్ క్రియేటివ్ వర్క్ కోసం శక్తివంతమైన ల్యాప్‌టాప్ కోరుకునే వారికి Dell XPS 16 Creator Edition ఒక ప్రీమియం ఎంపికగా నిలవనుంది.
