గాలానికి భారీ చేప చిక్కిందని సంబరపడ్డాడు.. తీరా బయటకు తీసి చూసేసరికి కంగుతిన్నాడు..
మొదట అతని గాలానికి ఎలాంటి చేపా దొరక్క నిరాశ చెందుతున్న క్షణంలో ఊహించని విధంగా అతని గాలానికి ఏదో చిక్కింది.
విస్కాన్సిన్ రాష్ట్రం ఎల్క్‌హార్న్ ప్రాంతానికి చెందిన ఆండీమూర్ అనే వ్యక్తి తరచూ ఫిషింగ్ పోటీల్లో పాల్గొంటాడు. ఇటీవల మిస్సోరీ నదిలో జరిగిన ఫిషింగ్ పోటీలో కూడా పాల్గొన్నాడు. మొదట అతని గాలానికి ఎలాంటి చేపా దొరక్క నిరాశ చెందుతున్న క్షణంలో ఊహించని విధంగా అతని గాలానికి ఏదో చిక్కింది. అంతే ఇక అతని ఆనందానికి అవధుల్లేవు. అయితే ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది. గాలానికి చిక్కినదాన్ని బయటకు తీసి చూస్తే.. ఏదో చేప అస్థిపంజరం కనిపించింది. వింతగా ఉన్న దాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. ఎందుకైనా మంచిదని అతడు దాని ఫొటోలు తీసుకుని వచ్చేశాడు.
అయితే మూర్ ఆ తరువాత నిర్వహించిన టోర్నమెంట్‌లో కూడా ఓడిపోయాడు. పోటీ ముగిశాక మూర్ ఆ అస్థిపంజరం ఫొటోలను నెట్టింట్లో షేర్ చేశారు. దీన్ని చూసిన కొందరు ఆ ఫొటోలు అరుదైన చేపవని గుర్తుపట్టి మూర్‌కు అదే విషయాన్ని చెప్పారు. దీంతో.. మూర్‌లో కూడా ఆసక్తి పెరగడంతో.. చేప అస్థిపంజరం విషయాన్ని ఆర్మీ అధికారులకు తెలియజేశాడు.
దీంతో.. వారు ఓ శాస్త్రవేత్తకు సమాచారం అందించారు. ఆయన వెళ్లి ఆస్థిపంజరాన్ని పరీక్షించి ఒక్కసారిగా షాకైపోయారు. ఎందుకంటే.. అది 9 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన బుల్‌డాగ్ చేపకు చెందిన అస్థిపంజరం. ప్రస్తుతం అంతరించిపోయిన ఆ జీవి దాదాపు 20 అడుగుల మేర ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తనకు అంతటి పురాతన శిలాజం దొరికిందని తెలుసుకుని మూర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఫిషింగ్ పోటీల్లో ఓడిపోయినా కూడా తాను చరిత్రను వెలికితీశానంటూ అతడు సంబరపడిపోయాడు. ఇక.. ఈ శిలాజాన్ని లెవిస్ అండ్ క్లార్క్ సెంటర్‌లో త్వరలో ప్రదర్శనకు ఉంచుతారని స్థానిక మీడియా తెలిపింది.