Viral: పోర్ట్ నుంచి బయటికొచ్చిన రెండు లారీలు.. అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులు షాక్
లారీ దిగువ భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కంటైనర్లలో రహస్యంగా దాచిన ప్యాకెట్లను మెక్సికో సిటీ పోలీసులు గుర్తించారు. వాటిలో కొకైన్ ఉన్నట్లు గుర్తించి పోలీసులు షాక్‌కు గురైయ్యారు.
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్ అక్రమ రవాణా కూడా ఒకటి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ స్మగ్లర్లు తగ్గేదే లే.. అన్నట్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మెక్సికో సిటీ పోలీసుల తనిఖీల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కొలంబియా నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.6 టన్నుల కొకైన్‌ను మంగళవారం మెక్సికో నగర పోలీసులు సీజ్ చేశారు. మెక్సికో నగరంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే తొలిసారి. కోట్లాది రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను స్మగ్లర్లు రెండు ట్రైలర్ లారీల్లో రహస్యంగా దాచి.. అక్రమంగా తరలిస్తున్నారు. పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.. ఈ ట్రైలర్ లారీలపై అనుమానం కలిగింది. దీంతో వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లారీ దిగువ భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కంటైనర్లలో రహస్యంగా దాచిన ప్యాకెట్లను గుర్తించారు. వాటిలో కొకైన్ ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురైయ్యారు.
డ్రగ్స్ స్మగ్లర్లు దీన్ని కొలంబియా నుండి పసిఫిక్ తీరంలోని వోక్సాకా పోర్ట్‌కు సముద్ర మార్గంలో తరలించారు. అక్కడి నుంచి రెండు ట్రైలర్ల లారీలో బయటకు తరలిస్తుండగా.. మెక్సికో నగర శివారులో పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు మెక్సికో నగరంలో పోలీసులకు ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారిగా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కొకైన్‌లో కొంత భాగం మెక్సికో నగరంలో పంపిణీ చేయనుండగా.. మిగిలిన సగ భాగాన్ని మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా తరలించాలని స్లగ్లర్లు భావించినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ రాకెట్‌తో ప్రమేయమున్న నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
Hoy @SSC_CDMX y @FiscaliaCDMX aseguraron más de 1,600 kg de cocaína, lo que se considera el mayor decomiso de esta droga en la #CDMX, fueron detenidas 4 personas, agradecemos a la @FiscaliaEdomex su apoyo. Esto debilita a los criminales que generan violencia en nuestra CDMX. pic.twitter.com/xObxvufKfH
— Omar Garcia Harfuch (@OHarfuch) July 26, 2022
మెక్సికో సిటీలో డ్రగ్స్ రాకెట్ లక్ష్యంగా పోలీసులు జరిపిన రెండో అతిపెద్ద ఆపరేషన్ ఇది. రెండు వారాల క్రితం మెక్సికో పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాకు చెందిన 14 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి భారీ ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో ఎక్కువగా ఇది వరకే డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో అరెస్టై బయటకు వచ్చిన వారుగా పోలీసులు తెలిపారు.
డ్రగ్స్‌పై మెక్సికో పోలీసులు తీవ్ర పోరాటం చేస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాల్లో తమ దందాను కొనసాగిస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి