Cobra Vs King Cobra: కోబ్రా వర్సెస్ కింగ్ కోబ్రా.. ఏది ఎక్కువ ప్రమాదం.. మీరు అస్సలు ఊహించలేరు..
కింగ్ కోబ్రా - కోబ్రా చూడటానికి ఒకేలా ఉన్నా, వాటి మధ్య అనేక కీలక తేడాలున్నాయి. కింగ్ కోబ్రా భారీ పరిమాణం, దట్టమైన అడవుల నివాసం, ఇతర పాముల ఆహారం ద్వారా ప్రత్యేకంగా నిలుస్తుంది. సాధారణ నాగుపాము మాత్రం చిన్నది, జనవాసాలకు దగ్గరగా ఉంటుంది. విష తీవ్రత, మానవులకు కలిగే ప్రమాదం పరంగా రెండూ విభిన్నమైనవి.

కింగ్ కోబ్రా – సాధారణ కోబ్రా చూడటానికి ఒకేలా కనిపించినా, వాటి స్వభావం, విషం, జీవన విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రెండు జాతులు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. పరిమాణం విషయంలో రాజ నాగుపాముకు తిరుగులేదు. ఇది 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాముగా పేరుగాంచింది. సాధారణ నాగుపాము మాత్రం 5 నుండి 7 అడుగుల వరకు మాత్రమే పెరుగుతుంది. కింబ్ కోబ్రా తెలివైనది కూడా.. తన గుడ్లను రక్షించుకోవడానికి గూళ్ళు నిర్మించే సామర్థ్యం కలిగి ఉంటుంది. నాగుపాము బొరియలలో, ఆకుల కుప్పల కింద, లేదా చెట్ల మొదళ్లలో గుడ్లను పెడుతుంది.
నివాసం – ఆహారం రెండింటి మధ్య ముఖ్యమైన తేడాలను చూపుతాయి. రాజ నాగుపాము దట్టమైన అడవులు, మడ అడవులు వంటి ఏకాంత, తేమతో కూడిన వాతావరణాలను ఇష్టపడుతుంది. ఇది ప్రధానంగా ఇతర పాములను మాత్రమే తింటుంది. సాధారణ నాగుపాము పరిస్థితులకు చాలా సులభంగా అలవాటు పడుతుంది. ఇది పొలాలు, అడవులు, పట్టణాల సమీపంలో కూడా నివసిస్తుంది. దీని ఆహారం ఎలుకలు, కప్పలు, పక్షులు, బల్లులు. ఎలుకల కోసం ఇది తరచుగా మానవ నివాసాలకు దగ్గరగా వస్తుంది.
విషం తీవ్రత – మానవులకు ప్రమాదం
రెండు పాముల విషంలోనూ తేడా ఉంది. రాజ నాగుపాము విషం ఒకే కాటులో భారీ పరిమాణంలో విడుదల అవుతుంది. ఇది చికిత్స చేయకపోతే వెంటనే ప్రాణాంతకం, ఏనుగును కూడా చంపగలదు. అయితే ఇది మానవులకు చాలా అరుదుగా కనిపిస్తుంది. సాధారణ కోబ్రా విషం మరింత శక్తివంతమైనది. నాడీ వ్యవస్థపై వేగంగా పనిచేసి శ్వాసకోశ పక్షవాతానికి కారణమవుతుంది. ఇది జనసాంద్రత గల ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్ల దేశంలో ప్రతి సంవత్సరం వేలాది మరణాలకు కారణమవుతూ, మానవుల పరంగా అత్యంత ప్రాణాంతకమైన పాముగా నిలిచింది.
పర్యావరణ ప్రాముఖ్యత
ఈ రెండు పాములు పర్యావరణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. రాజ నాగుపాము ఇతర పాముల జనాభాను నియంత్రిస్తే, సాధారణ నాగుపాము ఎలుకల జనాభాను అదుపులో ఉంచి, పంట నష్టం, వ్యాధుల వ్యాప్తిని నివారిస్తుంది. మొత్తంమీద బలం, పరిమాణంలో రాజ నాగుపాము ఆధిపత్యం చెలాయించినప్పటికీ, మానవ భద్రత పరంగా సాధారణ నాగుపామే ఎక్కువ ప్రమాదకరమైనదిగా చెబుతారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
