AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: దైవం మానుష్య రూపేణా.. తండ్రి కూతురు సోబెరాన్, జ్యోతి.. సినిమా స్టోరీని తలపించే నిజ జీవిత కథ

కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది మానవత్వం ఇంకా బతికే ఉంది.. అందుకే ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నా.. ప్రపంచం ఇంకా మనగలుగుతుంది అని. రోడ్డు పక్కన పొదల్లో ఏడుస్తున్న ఒక చిన్నారిని ఒక యువకుడు గుర్తించి ఇంటికి తీసుకొచ్చి.. పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్ ఇచ్చాడు. ఇది సినిమా స్టోరీ కాదు.. అస్సాం రాష్ట్రంలో నిజంగా జరిగిన ఒక అద్భుతం.. ఆ తండ్రి కూతురు సోబెరాన్, జ్యోతిలు.. సినిమా స్టోరీని తలపించే నిజ జీవిత కథ ఏమిటంటే..

Inspiring Story: దైవం మానుష్య రూపేణా.. తండ్రి కూతురు సోబెరాన్, జ్యోతి.. సినిమా స్టోరీని తలపించే నిజ జీవిత కథ
Vegetable Seller Soberan
Surya Kala
|

Updated on: Aug 23, 2025 | 5:07 PM

Share

అస్సాంలోని టిన్సుకియా జిల్లాకి చెందిన సోబెరాన్ యువకుడు కూరలు అమ్ముకుని జీవిస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఒక రోజు సాయంత్రం కూరగాయలు అమ్ముకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అప్పుడు అతనికి పొదల్లో ఒక పసికందు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. సోబెరాన్ ఏడుపు వినిపిస్తున్న దిశగా వెళ్లి చూస్తే అక్కడ.. పొద దగ్గర ఉన్న చెత్త కుప్పపై పడి ఏడుస్తున్న పసికందును చూశాడు.

సోబెరాన్ చుట్టూ చూశాడు.. ఎవరూ కనిపించలేదు. ఎవరైనా వస్తారేమో అని కొంతసేపు వేచి ఉన్నాడు.. ఎవరూ కనిపించకపోవడంతో.. ఆ చిన్నారి బాలికని ఒడిలోకి తీసుకున్నాడు. ఆ పసికందు ఆడపిల్లగా గుర్తించాడు. చాలా ముద్దుగా ఉంది. అక్కడ వదిలి వేయడానికి మనసు రాక.. సోబెరాన్ ఆ బాలికను ఇంటికి తీసుకువచ్చాడు.

ఆ సమయంలో సోబెరాన్ వయసు 30 సంవత్సరాలు. అవివాహితుడు. బాలికని చూస్తే చాలా సంతోషం కలిగింది. దీంతో పాపని తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. ఆ అమ్మాయికి జ్యోతి అని పేరు పెట్టాడు. జ్యోతిని కన్నబిడ్డలా సాకడం మొదలు పెట్టాడు. సోబెరాన్ పగలు, రాత్రి కష్టపడి పనిచేశాడు. జ్యోతికి లోటు అనేది తెలియకుండా అన్ని అవసరాలు తీర్చాడు. స్కూల్ కి పంపించాడు. జ్యోతి అవసరాలు తీర్చేందుకు ఒక తండ్రి చేయగలిగినంత చేశాడు.

ఇవి కూడా చదవండి

తాను ఆకలితో పస్తు ఉండాల్సి వచ్చినా..తన కుమార్తెకు ఆ పరిస్థితి రానివ్వలేదు. ఇలా సంవత్సరాలు గడిచాయి. జ్యోతి 2013లో కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రురాలింది. జ్యోతి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించింది. 2014లో, అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసింది. ఉత్తీర్ణురాలైంది. జ్యోతి ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్‌గా నియమితురాలైంది.

తన కుమార్తె ఈ రోజు మంచి స్టేజ్ కు చేరుకోవడం చూసిన ఆ తండ్రి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. జ్యోతి తన తండ్రిని బాగా చూసుకుంటోంది. తండ్రి కోరికలన్నింటినీ నెరవేరుస్తోంది. తన తండ్రి కష్టపడింది చాలు.. ఇకనైనా విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంది. అయితే సోబెరాన్ ఇప్పటికీ కూరగాయల వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అంతేకాదు తన కూతురుని చూసి గర్వంతో నేను చెత్త కుప్ప నుంచి ఆడపిల్లను తెచ్చుకోలేదు.. నేనువజ్రాన్ని తెచ్చుకున్నా.. తన రాక నా జీవితాన్ని దైవిక కాంతితో నింపింది. ఆమె నాజీవితానికి ఒక జ్యోతి అని గర్వంగా చెబుతాడు.

సోబెరాన్ గురించి తెలిసిన వారు అందరూ దైవం మాన్యుష్య రూపేణా అని అంటున్నారు. నీలాంటి వ్యక్తులే సమాజానికి అవసరం.. నీ త్యాగానికి ప్రేమకి సలామ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..