Spices: ఘాటెక్కిన దినుసులు, మసాలాల రేట్లు.. సామాన్యుడి రోజు గడిచేది ఎట్లా
Spices Price Rising: పేద, మధ్యతరగతి వాళ్లకు ఇది మాములు గడ్డు కాలం కాదు. కరోనా కష్టాల నుంచి కోలుకోకముందే.. బ్రతుకు ముందుకు నెట్టలేని పరిస్థితి ఏర్పడింది. బయట అన్నింటి ధరలు పెరిగిపోయాయి. కూరగాయల దగ్గర్నుంచి మొదలెడితే.. పెట్రోల్, డీజిల్.. ఫ్రూట్స్.. ఇప్పుడు మసాలాలు.. అన్నింటి రేట్లు పైపైకి చేరుతున్నాయి. దీంతో మార్కెట్ వైపు వెళ్లాలంటేనే బాబోయ్ అంటున్నారు.. మిడిల్ క్లాస్ జనాలు. తాజాగా పెరిగిన మసాలా దినుసుల రేట్లపై ఓ లుక్కేద్దాం పదండి...
ఓవైపు టమోటా రేట్లు మంటపుట్టిస్తుంటే.. మరోవైపు కూరల్లో వాడే దినుసులు, మసాలాల రేట్లు కూడా ఘాటెక్కాయి. నెల రోజుల క్రితం ఉన్న రేట్లు.. ఇప్పుడు ఉన్న రేట్లు చూసి సామాన్యుడు షాక్ తింటున్నాడు. ఏ వస్తువు చూసినా మధ్యతరగతి వాళ్లు కొనలేని పరిస్థితి కనిపిస్తోంది. కూర ఏదైనా రుచి రావాలంటే మసాలా ఉండాల్సిందే. మసాలా గట్టిగా దట్టిస్తే ఆ కూర వాసన.. రుచే.. అధరహో అనిపిస్తుంది. పైపెచ్చు చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మరి ముక్కకు రుచి మసాలానే కదా.. ఆ మసాలా కూడా ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. మరి కూర వండేదెట్టా.. కడుపునిండా తినేదెట్టా అన్న పరిస్థితి ఏర్పడింది. గడిచిన ఆరు నెలల్లో మసాలా దినుసులు, సుగంధద్రవ్యాల రేట్లు ఎలా ఉన్నాయి. ఎంత మేర పెరిగాయనేది ఓ సారి చూద్దాం.
వస్తువు(కేజీ) | 6 నెలల క్రితం | ప్రస్తుతం |
---|---|---|
పసుపు | రూ. 120 | రూ. 180 |
ఎండు మిర్చి | రూ. 150 | రూ. 280 |
సోంపు | రూ. 250 | రూ. 500 |
జీలకర్ర | రూ. 360 | రూ. 720 |
మిరియాలు | రూ. 400 | రూ. 550 |
యాలకులు | రూ. 900 | రూ. 1200 |
లవంగం | రూ. 900 | రూ. 1200 |
ఎన్నడూ లేనంతగా రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. చూస్తుండగానే రెండు రెట్లు, మూడు రెట్లు పెరిగిపోతున్నాయి. మార్కెట్‌లో నిన్నటి ధరల పట్టికకు.. ఇవాళ్టి ధరల పట్టికకు ఏ మాత్రం దగ్గరి సంబంధం కూడా ఉండటం లేదు. అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది. భిఫర్ జోయ్ తుఫాన్, రుతుపవనాల ఆలస్యం, తగ్గిన దిగుబడితో పాటు అనేక అంశాల కారణంగా రేట్లు పెరిగినట్టు తెలుస్తోంది. మరో మూడు నెలలు ఈ రేట్లు కిందకు దిగే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటిదాకా ఏం కొనాలో.. ఏం తినాలో..
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..