Viral: పెళ్లి చేసుకోండి లేదా ఉద్యోగం ఊడపోతుంది.. అవివాహితులకు కంపెనీ అల్టిమేటం
కంపెనీలో పనిచేసే అవివాహిత ఉద్యోగులు పెళ్లి చేసుకోవాలని.. లేదంటే ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందని చైనాకు చెందిన ఓ కెమికల్ కంపెనీ అల్టిమేటం విధించింది. నాలుగు మాసాల్లో పెళ్లి చేసుకోవాలని ఆ కంపెనీ ఉద్యోగులకు హెచ్చరిక లేఖ పంపింది. అయితే ఈ ఆదేశాలు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహాన్ని ఓ మధురమైన ఘట్టంగా పరిగణిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా కొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటుండగా.. మరికొందరు వివాహం చేసుకోకుండా అవివాహితులుగా మిగిలిపోయేందుకు మొగ్గుచూపుతున్నారు. వీరి సంఖ్య ఏటికేడు పెరుగుతోందని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కాగా సింగిల్స్ అయితే కంపెనీ పట్ల పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. వివాహం తర్వాత ప్రజలు తమ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇది వారి పనితీరును ప్రభావితం చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొన్ని కంపెనీలు బ్యాచిలర్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో ఒక కంపెనీ నుండి వచ్చిన వింతైన అల్టిమేటం గురించి తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు. తమ ఉద్యోగులు నాలుగు మాసాల్లో వివాహం చేసుకోవాలని లేదా వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని ఆ కంపెనీ అల్టిమేటం ఇచ్చింది. చైనాలో జననాల రేటు గత కొన్నేళ్లుగా గణనీయంగా పడిపోవడంతో ఆ కంపెనీ ఈ రకమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
చైనా షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక కంపెనీ తన ఉద్యోగుల కోసం అలాంటి ఆదేశాన్ని జారీ చేసింది. షాన్డాంగ్ షుంటియన్ కెమికల్ కంపెనీ 28 నుండి 58 సంవత్సరాల వయస్సు గల దాదాపు 1,200 మంది ఉద్యోగులను సెప్టెంబర్ చివరి నాటికి వివాహం చేసుకోవాలని ఆదేశించింది. ఈ జాబితాలో అవివాహితులతో పాటు విడాకులు తీసుకున్న వారిని కూడా చేర్చారు.
కారణం ఏమిటి?
వివాహం చేసుకునేందుకు కంపెనీ ఉద్యోగులకు ఇచ్చిన ఆర్డర్‌లో 4 నెలల అల్టిమేటం ఇచ్చింది. ఇందులో మార్చి నాటికి వివాహం చేసుకోని ఉద్యోగులు..ఎందుకు పెళ్లి చేసుకోలేదో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జూన్ నాటికి వివాహం కాని ఉద్యోగుల పట్ల చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోపు పెళ్లి కాకుండా ఉంటే వారిని ఇంటికి సాగనంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని ఆదేశాలివ్వడాన్ని సమర్థించుకున్న ఆ కంపెనీలు.. దీని వెనుక కారణాన్ని కూడా వెల్లడించింది. ఉద్యోగులలో కష్టపడి పనిచేయడం, ప్రేమ, విధేయత, సాంస్కృతిక విలువలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆ కంపెనీ పేర్కొంది.
సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత
పెళ్లి విషయంలో ఆ కంపెనీ ఇచ్చిన ఆర్డర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనా కంపెనీ నుండి వచ్చిన ఈ ఆర్డర్ చైనా సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. అయితే నెటిజన్లు ఆ కంపెనీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించేలా ఆ కంపెనీ ఆదేశాలు ఉన్నాయని విమర్శించారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. తమ ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఈ అల్టిమేటంను సదరు కంపెనీ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.