ఇంగ్లీషులో ఎక్కువగా వాడే అక్షరం ఏదో తెలుసా..? ఇది లేకపోతే ఏది రాయలన్నా కష్టమే..
ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ లెటర్ ఏదో తెలుసా? డిక్షనరీల నుండి గూగుల్ బుక్స్ వరకు.. మనం వాడే ప్రతి వాక్యంలోనూ ఒకే ఒక అక్షరం టాప్ ప్లేస్‌లో నిలిచింది. అది లేకుండా మనం గ్రామర్ రాయలేం.. చిన్న చిన్న పదాలు కూడా పలకలేం. అసలు ఇంగ్లీషులో అత్యధికంగా వాడే ఆ అక్షరం ఏది? అత్యంత తక్కువగా వాడే లెటర్ ఏది? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వేల కొద్దీ పదాలు మాట్లాడుతుంటాం.. చాటింగ్‌లలో ఎన్నో రాస్తుంటాం. అయితే మనం వాడే భాషలోని అక్షరాల వెనుక ఒక పెద్ద సీక్రెట్ దాగుందని మీకు తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే ఇంగ్లీష్ భాషపై అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తలు చేసిన వినూత్న అధ్యయనంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లోని 26 అక్షరాలలో ఒకే ఒక్క అక్షరం మిగతా అన్నింటికంటే అత్యంత శక్తివంతమైనదిగా, ఎక్కువగా వాడేదిగా కింగ్ స్థానంలో నిలిచింది. ఈ పరిశోధనల ప్రకారం.. ఇంగ్లీషులో అత్యధికంగా ఉపయోగించే అక్షరం E. పుస్తకాలు, వార్తాపత్రికలు, గూగుల్ బుక్స్, ఆన్‌లైన్ ఆర్టికల్స్, మన రోజువారీ సంభాషణల్లో వాడే మొత్తం అక్షరాలలో కేవలం E అక్షరమే 11 నుండి 12 శాతం వరకు ఆక్రమించేసింది. అంటే మనం రాసే ప్రతి వంద అక్షరాలలో సుమారు 12 అక్షరాలు ఒక్క E మాత్రమే ఉంటాయన్నమాట.
E అక్షరానికి అంత సీన్ ఎందుకుంది..?
ఇంగ్లీష్ భాషా నిర్మాణంలో E అక్షరం ఒక పిల్లర్‌లా దాగుంది. దానికి గల ప్రధాన కారణాలు ఇవే..
కీలక పదాలలో భాగం: ఇంగ్లీషులో మనం సెకనుకు వందల సార్లు వాడే చిన్న పదం the. ఇందులో E ఉండటమే దీని వాడకం పెరగడానికి పెద్ద కారణం. అలాగే మనం నిత్యం వాడే he, she, me, we, they, be, were, there, here వంటి బేసిక్ పదాలన్నీ E అక్షరంపైనే ఆధారపడి ఉన్నాయి.
గ్రామర్ కింగ్: వ్యాకరణ పరంగా కూడా E చాలా కీలకం. ఏదైనా నామవాచకాన్ని బహువచనంలోకి మార్చాలన్నా ఉదాహరణకు.. Boxes, Matches – చివరన es చేరుతుంది. ఒక వెర్బ్‌ను పాస్ట్ టెన్స్‌లోకి మార్చాలన్నా ఉదాహరణకు.. Walked, Played – చివరన ed చేరుతుంది. E అక్షరం తప్పనిసరి. ఈ చిన్న వ్యాకరణ నియమాల వల్ల కోట్లాది వాక్యాలలో ఈ అక్షరం పదేపదే రిపీట్ అవుతుంది.
తర్వాతి స్థానాల్లో ఉన్న టాప్ లెటర్స్ ఇవే..
భాషా నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో అత్యధిక వాడకంలో టాప్-3 స్థానాలు ఇవే..
మొదటి స్థానం: E (సుమారు 11-12శాతం)
రెండో స్థానం: T (సుమారు 9శాతం) – The, That, This, To, ITవంటి పదాల వల్ల దీనికి ఈ స్థానం దక్కింది.
మూడో స్థానం: A (సుమారు 8శాతం)
ఇంగ్లీషులో E అత్యధికంగా వాడే అక్షరమైతే.. అత్యంత తక్కువగా వాడే అక్షరం Z. ఆ తర్వాత స్థానాల్లో Q, X, J ఉంటాయి.
