ఇది విన్నారా..? AIకి మంత్రి పదవి..! వర్చువల్‌గా కేబినెట్‌లోకి.. పైగా అవినీతిపై పోరాటం..
అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సును (AI) మంత్రిగా నియమించింది. "డీయెల్లా" అనే ఈ AI మంత్రి, అవినీతిని అరికట్టి, డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో అభివృద్ధి చేయబడిన డీయెల్లా, ఇ - గవర్నెన్స్‌లో సహాయపడుతుంది.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా AI మంత్రి వచ్చేశారు. ఎస్.. మీరు విన్నది నిజమే. అల్బేనియా ప్రధాన మంత్రి ఎడి రామా తన కొత్త మంత్రివర్గంలో అవినీతిని అరికట్టడం, దేశంలో డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం లక్ష్యంగా డీయెల్లా అనే కృత్రిమ మేధస్సు సృష్టించిన మంత్రిని నియమించారు.
డీయెల్లా అల్బేనియన్ భాషలో ‘సూర్యుడు’ అని అర్థం. భౌతికంగా కనిపించకపోయినా.. క్యాబినెట్‌లో పూర్తి స్థాయి సభ్యురాలిగా వర్చువల్‌గా వ్యవహరిస్తారు. “ఆమె రక్తమాంసాలు కలిగిన మంత్రి కాదు, కోడ్, సామర్థ్యం కలిగిన మంత్రి” అని రమా ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ AI సంస్థ, అల్బేనియా ఇ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్, ఇ-అల్బేనియాలో ఇప్పటికే వర్చువల్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. డిజిటల్ సేవలను నావిగేట్ చేయడంలో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులకు సహాయం చేస్తుంది.
అల్బేనియాలోని నేషనల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రకారం.. ప్రభుత్వ ప్రక్రియలలో కచ్చితత్వం, పారదర్శకత, వేగాన్ని హామీ ఇవ్వడానికి డీయెల్లా అధునాతన AI నమూనాలను ఉపయోగిస్తుంది. ఆమె ప్రధాన పనులలో ఒకటి.. పబ్లిక్ టెండర్లు 100 శాతం అవినీతి రహితంగా ఉండేలా చూసుకోవడం. డీయెల్లా సాంప్రదాయ అల్బేనియన్ దుస్తులలో ఒక మహిళగా కనిపిస్తుంది. అయితే డీయెల్లా అధికారిక మంత్రి హోదా ఇంకా అస్పష్టంగానే ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అధ్యక్షుడు బజ్రామ్ బెగాజ్ కొత్త మంత్రివర్గ ఏర్పాటును ఆమోదించినప్పటికీ, డీయెల్లా చట్టబద్ధంగా మంత్రిగా అర్హత పొందారో లేదో నిర్ధారించడంలో ఆయన విఫలమయ్యారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




