ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. రెండ్రోజులపాటు వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి.. ఊహకందని విధంగా నిర్ణయం ప్రకటించారు. ఈరోజు తీర్పు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. అంతేకాదు, విచారణను ఏకంగా జూన్ 5కి వాయిదా వేశారు. రేపట్నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో తదుపరి విచారణ జూన్ 5న చేస్తామని ప్రకటించారు. దాంతో, అవినాష్‌రెడ్డి లాయర్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
తదుపరి విచారణను జూన్ 5కి వాయిదా వేయడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జడ్జ్‌కి విన్నవించారు అవినాష్‌రెడ్డి లాయర్లు. రెండు వారాలపాటు సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. అయితే, సుప్రీం ఆదేశాలున్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు.. అర్జెన్సీ ఉంటే చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేసుకోవాలని సూచించింది. కావాలంటే వెకేషన్ బెంచ్‌కి బెయిల్ పిటిషన్‌ను మార్చుకోవచ్చని కూడా చెప్పారు జడ్జ్.
అయితే, చీఫ్ జస్టిస్ దగ్గర కూడా అవినాష్‌రెడ్డికి ఊరట దక్కలేదు. సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని సీజే ముందు మెన్షన్ చేశారు అవినాష్ లాయర్లు. అయితే, ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యంకాదని చెప్పేశారు చీఫ్ జస్టిస్. ఏదైనాసరే వెకేషన్ బెంచ్ ముందే మెన్షన్ చేసుకోవాలని సూచించారు. అయినా, ఈ కేసుపై సుప్రీం డైరెక్షన్స్ ఇచ్చాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు సీజే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..