నల్గొండ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. నిడమానూరు మండలం గుంటుపల్లిలో ఓ యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం జి.అన్నారం దళిత సామాజికవర్గానికి చెందిన ఇరుగు నవీన్.. బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమ వ్యవహారం వివాదంగా మారింది. రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు నడుస్తున్నాయి. ఆ క్రమంలో.. యువతిని మరిచిపోకపోతే చంపేస్తామంటూ.. గతంలో నవీన్‌ను యువతి బంధువులు బెదిరించినట్లు యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
వివాదాలతో విసిగిపోయిన యువకుడు.. యువతి బంధువులతో మాట్లాడమని.. తిరుమల్ అనే వ్యక్తిని కలిశాడు. చొరవ తీసుకున్న తిరుమల్.. యువతి బంధువులను చర్చకు పిలిచాడు. నిడమానూరు మండలం గుంటిపల్లి శివారులో మాట్లాడుకుందామని చెప్పాడు. దాంతో అక్కడకు చేరుకున్న యువతి బంధువులు.. అదును చూసి నవీన్‌ను వేట కొడవళ్లతో నరికి చంపారు.
ప్రేమ వ్యవహారంపై మాట్లాడేందుకు గుంటుపల్లి నుంచి మూడు బైకులపై వచ్చిన 9 మంది యువతి బంధువులు.. వచ్చిరాగానే కత్తులతో నరికి చంపినట్లు పేర్కొంటున్నారు. నవీన్‌ను హత్య చేసి వారంత పరారయ్యారు. ప్రేమ వ్యవహారంలోనే యువతి బంధువులు హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నిడమూరు మండలం అన్నారం నవీన్ ను హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మూడు టీములుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసులు నమోదుచేశారు. యువకుడి హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నారంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..