Telangana Politics: కాంగ్రెస్‌లోకి కసిరెడ్డి.. డైలమాలో వంశీచంద్‌రెడ్డి.. కల్వకుర్తిలో కొత్త రాజకీయం..
ఆ యువనేత దారెటు. అసెంబ్లీ బరిలోనా... లేక మరోసారి పార్లమెంట్ పోరులోనా. కొత్త చేరికలు ఆయన అసెంబ్లీ సీటుకు ఎసరు పెట్టాయా? టికెట్ దక్కకపోతే ఆయన భవిష్యత్ ఏంటి? పాలమూరు కాంగ్రెస్‌లో ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? కల్వకుర్తి కాంగ్రెస్‌లో పరిణామాలతో వంశీచంద్‌రెడ్డి ఆత్మరక్షణలో పడితే ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ టికెట్ అశిస్తూ పార్టీలో చేరబోతున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి హైదరాబాద్‌లో వంశీచంద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు మద్దతు తెలపాలని కసిరెడ్డి కోరారట.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. కొత్తగా కండువాలు కప్పుకుంటున్న నేతలు.. పాత నేతల అవకాశాలకు గండికొడుతున్నారనే చర్చ నడుస్తోంది. కల్వకుర్తి కాంగ్రెస్‌లో మొన్నటిదాకా టికెట్‌పై నిశ్చింతగా ఉన్న నాయకుడిని కూడా ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి. 2014లో గులాబీపార్టీ హవాని తట్టుకుని కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన యువనేత వంశీచంద్ రెడ్డి భవిష్యత్తు ఏంటని హస్తం పార్టీలు గుసగుసలు నడుస్తున్నాయట.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తిలో ఓడిపోయినా కాంగ్రెస్ అధిష్ఠానంతో ఉన్న సత్సంబంధాలతో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీకి నిలిచారు వంశీచంద్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటమిపాలైనా పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. యువనేత కావడం, హైకమాండ్‌తో ఉన్న సంబంధాలతో వంశీచంద్ రెడ్డికి పార్టీ జాతీయ అర్గనైజింగ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పట్నించీ వంశీచందర్‌రెడ్డి సొంత నియోజకవర్గాన్ని వదిలేసి పూర్తిగా ఢిల్లీకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. దీంతో ఎన్నికల ముందు ఆయనకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి.
సుంకిరెడ్డి స్పీడ్ పెంచుతున్న సమయంలోనే..
వంశీచందర్‌రెడ్డి కొన్నేళ్లగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవటంతో ఆ సీటుపై కొందరు కన్నేశారు. నిన్నమొన్నటిదాకా ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో తిరుగుతూ టికెట్ బరిలో ఉన్నాననే సంకేతాలిచ్చారు. ఓ వైపు సుంకిరెడ్డి స్పీడ్ పెంచుతున్న సమయంలోనే వంశీచంద్ రెడ్డికి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూపంలో యువనేతకి మరో ఉపద్రవం వచ్చిపడిందట. టికెట్ హామీతోనే కసిరెడ్డి కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే వంశీచంద్ రెడ్డి భవిష్యత్ ఏంటని చర్చ నడుస్తోంది. కసిరెడ్డికి టికెట్ ఇస్తే వంశీచంద్ సపోర్ట్ చేస్తారా.. లేక మరో నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది.
ఆత్మరక్షణలో పడితే..
కల్వకుర్తి కాంగ్రెస్‌లో పరిణామాలతో వంశీచంద్‌రెడ్డి ఆత్మరక్షణలో పడితే ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ టికెట్ అశిస్తూ పార్టీలో చేరబోతున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి హైదరాబాద్‌లో వంశీచంద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు మద్దతు తెలపాలని కసిరెడ్డి కోరారట. మరి వంశీచంద్‌రెడ్డి నిర్ణయమేంటనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ కార్యకర్తలు, అనుచరులతో చర్చించాక తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారట వంశీచంద్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకే కసిరెడ్డి .. వంశీచంద్‌రెడ్డిని కలిశారంటున్నారు. కసిరెడ్డికే కల్వకుర్తి టికెటిస్తే వంశీచంద్‌రెడ్డి మళ్లీ ఎంపీగానో లేదంటో హైదరాబాద్‌లో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంనుంచో బరిలో నిలిచే అవకాశాలున్నాయట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
