Inspiring Story: భర్త మరణం.. నలుగురు పిల్లల పోషణ భారం.. మటన్ కొట్టు వృత్తిని ఉపాధిగా ఎంచుకున్న మెదక్ జిల్లా వనిత..
International Women's Day 2022:పెళ్లి అయిన 11 ఏళ్లకే ఆమెకు నలుగురు బిడ్డలు. సంసారం సాఫీగానే సాగుతుందనుకుంటున్న సమయంలో.. ఊహించని పరిణామం. భర్త మృత్యువుతో..
International Women’s Day 2022:పెళ్లి అయిన 11 ఏళ్లకే ఆమెకు నలుగురు బిడ్డలు. సంసారం సాఫీగానే సాగుతుందనుకుంటున్న సమయంలో.. ఊహించని పరిణామం. భర్త మరణంతో.. కుటుంబపోషణ ఎలా అన్న సంక్షోభం. ఇక ఈ ఊరులో ఎలా ఉండాలి.. ఎలా బతకాలన్న ఆందోళనలో ఉన్న ఆమెకు గ్రామస్తులంతా అండగా నిలిచారు. అప్పటికే కుటుంబ పోషణ కోసం చేసుకుంటున్న వృత్తినే.. ఉపాధిగా ఎంచుకోమని సలహా ఇచ్చి.. తోడుగా నిలిచారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మటన్ కొట్టు మున్నీపై ఓ ప్రత్యేక కథనం.
ఇంటి బాధ్యతలు…మోస్తున్న ఆమె పేరు మున్నీ. చిన్న వయసులోనే పెళ్లి అయింది. అంతలోనే భర్త జాఫర్ అకస్మాత్తుగా చనిపోవడంతో..కుటుంబ భారం మొత్తం తనపైనే పడింది. అప్పటి వరకు అత్తామామ వాళ్లు చేసుకుంటూ వస్తున్న మటన్ కొట్టు(Meat Shop) వ్యాపారాన్నే జీవనాధారంగా చేసుకుంది. గ్రామస్తుల సహకారంతో.. అత్తింటి ఊళ్లోనే ఆడపడుచుగా జీవిస్తోంది.
మెదక్ జిల్లాలోని రామయంపేట మండలం ధర్మారందొంగల గ్రామానికి చెందిన మున్నీ.. 20 ఏళ్లుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తోంది. మగ వారు చేసే పని కదా.. ఎలా అని మొదట సందేహ పడినా.. గ్రామస్తులంతా ధైర్యం చెప్పారు. మగ ఏంటీ ఆడ ఏంటీ.. పని నేర్చుకుని చేసుకుంటే నీ కాళ్ల మీద నువ్వు బతకొచ్చు.. నీ పిల్లలకు తోడుగా నిలవచ్చన్న ధైర్యం.. ఆమెను ముందుకు నడిపించేలా చేసింది.
మటన్ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నప్పటికీ.. మున్నీకి ఇతరత్రా ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కనీసం ఉండడానికి కూడా సొంతిల్లు లేదు. అద్దె ఇంట్లోనే ఉంటూ…. ఓ చోట షాపు పెట్టుకుని పొట్టపోసుకుంటోంది. వచ్చిన నాడు పది రూపాయలు.. రాని నాడు లేదు అన్నట్టుగానే ఉంటోంది. గ్రామస్తులంతా ఆమె దగ్గరే మటన్ కొంటూ చేయూత నిస్తూ వస్తున్నప్పటికీ.. మున్నీ కులస్తులు మాత్రం అణగదొక్కే యత్నం చేస్తుండడం మున్నీని కలిచివేస్తోంది.
పసిపిల్లలుగా ఉన్నప్పటి నుంచి అటు వారిని, ఇటు వ్యాపారాన్ని సమానంగా నెట్టుకుంటూ వస్తోంది మున్నీ. పేరుకు మటన్ కొట్టు పెట్టుకుని నడిపిస్తున్నప్పటికీ.. అందులో అంతంత మాత్రంగానే ఆదాయం వస్తోందని అంటోంది. అందుకే పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న ఆశ ఉన్నప్పటికీ.. చదివించలేకపోయానని వాపోయింది. మటన్ షాపే కాదు.. మిగతా సమయంలో బీడీలు కూడా చేస్తుంది.
ప్రభుత్వం దయతలిచి ఓ ఇంటిని ఇస్తే అదే పదివేలని వేడుకుంటోంది మున్నీ. కొడుకులు కూడా ఎదిగి రావడంతో.. తనకు తోడుగా ఉంటారని చెబుతోంది. వేడుకలకు ఆర్డర్లను కూడా తీసుకుని నాన్‌వెజ్‌ను సరఫరా చేస్తోంది. కష్టాలకు ఎదురీదుతూనే.. తన బిడ్డలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలని చూస్తోంది. అందుకోసం ఏ కష్టం వచ్చినా… పంటికిందనే భరిస్తూ ముందుకు సాగుతోంది మున్నీ.
-శివతేజ, మెదక్ జిల్లా, టీవీ9 తెలుగు
Also Read..
Women’s Day 2022: సాధారణ గృహిణి నుంచి కోట్ల టర్నోవర్ దాకా.. విజయనగరం జిల్లా మహిళ విజయగాథ