
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో పీటముడి వీడడం లేదా..? తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారిందా..? ఇక్కడ గెలుపు ఈజీగా ఉండడంతో కాంగ్రెస్‌లో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారిందా.? భువనగిరి టికెట్‌పై కోమటిరెడ్డి కుటుంబం కన్నేసిందా.? సతీమణి లక్ష్మీ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా..? సన్నిహితుడు చామల కిరణ్ రెడ్డి కోసం సీఎం రేవంత్ పట్టుబడుతున్నారా..? భువనగిరి టికెట్.. రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వార్‌గా మారిందా..? భువనగిరి ఎంపీ టికెట్ పాలిటిక్స్ పొలిటికల్ హీట్ పెంచిందా.?
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. భువనగిరి టికెట్ కోసం బలమైన ఆశావాహులు పోటీ పడుతుండడంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి సవాల్‌గా మారుతోంది. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలకుగానూ 6 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ టికెట్ దక్కించుకుంటే చాలు విజయం తేలికేనని ఆశావాహులు భావిస్తుండడంతో భువనగిరి చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థి ఎంపిక కొలిక్కి రాకపోవడంతో మలి జాబితాలో కూడా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఈ టికెట్‌ను ప్రకటించకుండా పక్కన పెట్టింది. ఈ ఎంపి టిక్కెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
భువనగిరి టికెట్‌ను కోమటిరెడ్డి కుటుంబ ఆశిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, కోమటిరెడ్డి బ్రదర్స్ సోదరుడి కొడుకు సూర్య పవన్ రెడ్డి ఆశిస్తున్నారు. వీరితోపాటు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ రెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే రాష్ట్ర క్యాబినెట్ బెర్త్ కోసం రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. సతీమణికి భువనగిరి ఎంపీ టికెట్ అడిగితే.. అది మంత్రి పదవికి అడ్డంకిగా మారుతుందేమోనని భావించారట. మరోవైపు సూర్య పవన్ రెడ్డి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారట.
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంపై కోమటిరెడ్డి బ్రదర్స్ కు గట్టిపట్టు ఉంది. 2009 ఎన్నికల్లో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 2014లో ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీలకుగానూ జనగాం మినహా మిగిలిన ఆరు అసెంబ్లీలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఈ పార్లమెంటు సెగ్మెంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రత్యేక అనుచర గణం ఉంది. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అలాగే తాము ఎన్నో ఏళ్లుగా విజయం సాధిస్తున్న ఈ భువనగిరి టికెట్‌ను చేజార్చుకునేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కాదని మరోకరికి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
భువనగిరి ఎంపి టిక్కెట్ కోసం నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు సమాచారం. తమవారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీ నేతలంతా రంగంలోకి దిగడంతో భువనగిరి ఎంపీ టికెట్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయట. కుటుంబ సభ్యుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్, సన్నిహితుడి కోసం సీఎం రేవంత్ రెడ్డిలు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న చామల కిరణ్ రెడ్డి భువనగిరి టికెట్ ను ఆశిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని తానై హస్తం గెలుపు కోసం పాటు పడ్డారు. దీంతో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేయడంతో పాటు సీఎం రేవంత్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ టికెట్ విషయంలో సీఎం రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టుగా పోటీ ఉందని పార్టీలో టాక్.
మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి కూడా భువనగిరి టికెట్‌ను ఆశిస్తున్నారట. టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు జోరుగా ప్రచార సాగుతోంది. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ఫైళ్ల శేఖర్ రెడ్డి కలిశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతల్లో ఈ టికెట్ కోసం బిగ్ ఫైట్ చేస్తుండగా, పైళ్ల శేఖర్ రెడ్డి ప్రయత్నాలతో భువనగిరి ఎంపీ టికెట్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
భువనగిరి టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఫ్లాష్ సర్వేతో ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోందట. సిట్టింగ్ ఎంపీ, భువనగిరి పార్లమెంటు నియోజవర్గ ఇన్చార్జిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థి ఎంపికలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకం కానున్నారు. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ విషయంలో రేవంత్ సొంత నిర్ణయం తీసుకున్నప్పటికీ భువనగిరి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారన్న టాక్ నడుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…