
మహబూబాబాద్ జిల్లాలో తునికాకు సేకరణకు వెళ్లిన ఓ గిరిజన మహిళపై అడవి దున్న దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దున్న దాడిలో గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మామిడిగూడెం గ్రామ శివారులో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన జనగం సృజన అనే మహిళ సమీప అడవుల్లో సహచర కూలీలతో కలిసి తూనికాకు సేకరణకు వెళ్లింది. తునికాకు సేకరిస్తున్న క్రమంలో అడవి దున్న ఒక్కసారిగా దాడి చేసింది.. దున్న దాడి నుంచి గాయాలతో తప్పించుకున్న మహిళను గ్రామస్తులు ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మహిళ తలకు బలమైన గాయమైందని చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. భారీ కాయంతో ఆ అడవి దున్నను చూసి స్థానికులు భయంతో వణికిపోయారు. పని నిమిత్తం మళ్లీ అడవిలోకి వెళ్తే.. దున్నలు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాయో అనే భయంతో తునికాకు కూలీలు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..